ఆత్మహత్య చేసుకోవాలనుకుంది…. ఇప్పుడు కోట్లు సంపాదిస్తోంది… ఇంతకీ ఎవరామె.తెలుసా.?

చిన్న వయసులోనే ఆమెకు పెళ్లయింది. అత్తారింట్లో నానా నరకయాతన అనుభవించింది. అత్తారింటి నుంచి బయటకు రాగానే సమాజం హేళన చేసింది. ఇక ఊరు వదిలేసి ముంబై చేరుకుంది. కేవలం 60 రూపాయలతో ప్రారంభమైన ఆమె ఇప్పుడు కొన్ని వందల కోట్లకు అధిపతి అయ్యింది.

కాలం ఎదురు తిరిగినప్పుడు, వాటిని జయిస్తే విజయం మనల్ని వరిస్తుంది అనడానికి సరైన ఉదాహరణ కల్పనా సరోజ్. నిజమైన స్లమ్ డాగ్ మిలినీయర్ కు ఆమె జీవితం చక్కని ఉదాహరణ. మహారాష్ట్రాలోని అలోకా జిల్లాలో చిన్న గ్రామంలో జన్మించిన కల్పనకి 12 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు పెళ్లి చేసేసారు. పెళ్లైన తర్వాత భర్త నరకం చూపించడం మొదలు పెట్టాడు. పరిస్ధితి తెలుసుకుని ఒక రోజు ఆమె తండ్రి వచ్చి పుట్టింటికి తీసుకెళ్లాడు. ఊర్లో అందరూ ఆమెను హేళనగా మాట్లాడేవారు. మళ్లీ స్కూల్‌కు వెళితే విచిత్రంగా చూసేవారు. చిన్న వయసులోనే ఆ కష్టాలు భరించలేకపోయింది. అవమానాలు భరించలేక కల్పన ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లడంతో పునర్జన్మ లభించింది. ఇంట్లో వాళ్లని ఒప్పించి 1972లో ముంబై చేరుకుంది.

కొన్ని రోజులు తెలిసిన వాళ్లింట్లో ఉంటూ బట్టల షాపులో పని చేసేది. నెలకు రూ. 60 జీతం తీసుకునేది. ఆ తర్వాత బట్టలు కుట్టడం నేర్చుకుంది. దీంతో రోజుకు రూ.100 సంపాదించేది. అప్పుడే ఆమె తొలిసారిగా 100 నోటును చూసింది. వచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకుంది. రెండేళ్ల పాటు డబ్బులు కూడబెట్టి ఒక ఇల్లు అద్దెకు తీసుకుంది.
అదే సమయంలో కల్పన అక్క మందులకు డబ్బులు లేక మరణించింది. తన నుంచి సహాయం ఆశించిన అక్క మరణించడం కల్పనను బాగా కలచి వేసింది. అప్పడే ఎక్కువ డబ్బు సంపాదించాలని కల్పన నిర్ణయించుకుంది. 1975లో మహాత్మా జ్యోతి పూలే స్కీమ్ కింద రూ.50,000 లోన్ తీసుకుంది. బట్టల షాపు ప్రారంభించింది. నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని భావించి. సుశిక్షిత్ బెరోజ్‌గర్ యువక్ సంఘటన పేరుతో ఒక అసోసియేషన్ ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో 3000 వేల మందికి పైగా చేరారు. ఇక్కడ ఆమె 11 మందితో ఓ టీం ను ఏర్పాటు చేసుకుంది. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి అడుగు పెట్టి తిరుగులేని శక్తిగా ఎదిగింది. అతి తక్కువ కాలంలోనే రియల్ ఎస్టేట్ వ్యాపారంలో 4 కోట్లు సంపాదించింది.

ఎన్. ఆర్. కామానీ 1960లో కామాని ట్యూబ్స్ కంపెనీని స్థాపించారు. లేబర్ యూనియన్లు, మేనేజ్‌మెంట్ మధ్య వివాదాల కారణంగా ఈ కంపెనీ 1985లో మూతపడింది. సుప్రీం కోర్టు 1988లో ఈ కంపెనీని తిరిగి ప్రారంభించాలని ఆదేశించింది. అధికారాన్ని వర్కర్లకు అప్పగించింది. అయితే ఆర్థిక అంశాలపై అవగాహన లేకపోవడంతో కంపెనీ నష్టాల్లోకి వెళ్లింది. దీంతో కంపెనీ పునరుద్ధణకు 1999లో కల్పన 10 మంది సభ్యులతో ఒక టీమ్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో మార్కెటింగ్, బ్యాంక్, లాయర్లు, ప్రభుత్వ అధికారులు వంటి వారందరూ ఉన్నారు. బ్యాంకులు పెనాల్టీలు, వడ్డీలను రద్దు చేసేందుకు అంగీకరించాయి. కంపెనీ పునరుద్ధరణకు ఈ చర్యలు ఎంతగానో దోహదపడ్డాయి. 2006లో కంపెనీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టారు. రుణాలను తీర్చడమే తొలి లక్ష్యంగా ముందుకు కదిలారు. దీని కోసం ఆమె తన ప్రాపర్టీలను కూడా అమ్మేశారు. 2009లో కంపెనీ ఎస్‌ఐసీఏ (సిక్ ఇండస్ట్రీయల్ కంపెనీస్ యాక్ట్) నుంచి బయట పడింది. 2010లో కంపెనీని వాదా ప్రాంతానికి మార్చారు. రూ.5 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. ఏడాది గడవక ముందే 2011లో రూ.3 కోట్ల లాభం వచ్చింది.
కల్పన తర్వాత ఇతర వ్యాపారాల్లోకి అడుగు పెట్టారు. ప్రస్తుతం ఆమె నిర్వహిస్తున్న వ్యాపారాల టర్నోవర్ రూ.2,000 కోట్లు. ఏడు కంపెనీలకు విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కామాని ట్యూబ్స్ ఇప్పుడు లాభదాయకమైన కంపెనీ. ప్రతి ఏడాది రూ.5 కోట్ల లాభాన్ని అందిస్తోంది. 2013లో ఆమె పద్మశ్రీ గౌరవం కూడా లభించింది.

Comments

comments

Share this post

scroll to top