స్పందించిన సీఎం – ఉచితంగా ఇంట‌ర్ రీ వెరిఫికేష‌న్

ఎట్ట‌కేల‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ స్పందించారు. గ‌త కొన్ని రోజులుగా ఇంట‌ర్ బోర్డు తీరుపై స్టూడెంట్స్, పేరెంట్స్ ఆందోళ‌న వ్య‌క్తం చేస్తుండ‌డంతో అత్య‌వ‌స‌ర స‌మావేశం నిర్వ‌హించారు. అస‌లు ఏం జ‌రుగుతుందో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేశారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ ద‌గ్గ‌రి నుండి ఫ‌లితాల వెల్ల‌డి వ‌ర‌కు స‌మీక్ష చేప‌ట్టారు. ఈ ప్ర‌త్యేక స‌మావేశానికి విద్యా శాఖ మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డి, విద్యాశాఖ ఉన్న‌తాధికారులు జ‌నార్ద‌న్ రెడ్డి, డాక్ట‌ర్ అశోక్ పాల్గొన్నారు. ఏ ప‌ద్ధ‌తిన ప్రైవేట్ సంస్థ‌కు అప్ప‌గించారో అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు ఆందోళ‌న ప‌డాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు. ప్ర‌భుత్వం విద్యార్థులకు అండ‌గా వుంటుంద‌ని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. స్టూడెంట్స్ ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవ‌డంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు.

అత్యంత దుర‌దృష్ట‌క‌ర‌మైన సంఘ‌ట‌న‌గా సీఎం అభివ‌ర్ణించారు. ప‌రీక్ష త‌ప్పితే ఎన్నిసార్ల‌యినా రాసు కోవ‌చ్చ‌ని, కానీ జీవితం పోతే ఇక రాద‌న్న విష‌యం గుర్తు పెట్టు కోవాల‌ని సూచించారు. పిల్ల‌లు ఆత్మ‌హ‌త్య‌లకు పాల్ప‌డిన త‌ర్వాత కేసీఆర్ స్పందించ‌డంపై ప‌లు విద్యార్థి సంఘాల నాయ‌కులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థుల‌కు ఉచితంగా రీ వెరిఫికేష‌న్, రీ కౌంటింగ్ చేయాల‌ని ఆదేశించారు. పాసైన స్టూడెంట్స్ రీ వెరిఫికేష‌న్ కోరినా చేయాల‌ని, ఈ అంశంలో గ‌త విధాన‌మే పాటించాల‌న్నారు. నీట్, జేఇఇ లాంటి దేశ వ్యాప్త ప్ర‌వేశ ప‌రీక్ష‌ల‌కు ఇంట‌ర్ మార్కులే కీల‌కం. వీలైనంత త్వ‌ర‌గా ముంద‌స్తు స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌లు నిర్వ‌హించి, ఫ‌లితాలు వెల్ల‌డించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు.

ఈ ఫ‌లితాల గంద‌ర‌గోళంలో ఎక్కువ‌గా ఆరోప‌ణ‌లు అశోక్ కుమార్ పై రావ‌డంతో రీ వెరిఫికేష‌న్, రీ కౌంటింగ్ , స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ల నుంచి ఆయ‌న‌ను త‌ప్పించారు. విద్యా శాఖ కార్య‌ద‌ర్శి జ‌నార్ద‌న్ రెడ్డికి సీఎం అప్ప‌గించారు. ప‌రీక్ష‌ల్లో ఇబ్బందులు చోటు చేసుకోకుండా వ్యూహాలు ఖ‌రారు చేయాల‌ని ఆదేశించారు. నియ‌మ నిబంధ‌న‌ల‌కు లోబ‌డే ప్రైవేట్ సంస్థ‌కు ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ బాధ్య‌త‌ను అప్ప‌గించామ‌ని, నిపుణుల క‌మిటీ సూచించిన త‌ర్వాతే నిర్ణ‌యం తీసుకోవ‌డం జ‌రిగింద‌ని ఈ సంద‌ర్భంగా బోర్డు కార‌ద్య‌ర్శి సీఎంకు తెలిపారు. మొత్తం వ్య‌వ‌హారం ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు తీసుకు వ‌చ్చేలా ఉండ‌డంతో త‌క్ష‌ణ‌మే చ‌ర్య‌లు చేప‌ట్టాల్సిందిగా ఆదేశించారు.

విద్యార్థుల ప‌ట్ల అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డ‌మే కాకుండా బాధ్య‌తా రాహిత్యంగా వ్య‌వ‌హ‌రించిన బోర్డు కార్య‌ద‌ర్శిని స‌స్పెండ్ చేయాల‌ని, విద్యా శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శిని తొల‌గించాల‌ని, మంత్రి జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిని మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేశాయి. అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌డం వ‌ల్ల‌నే ..రాజ‌కీయ నాయ‌కుల వ‌త్తిళ్లు ఉండ‌డం వ‌ల్ల‌నే ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి అనుభ‌వం లేని గ్లోబ‌రీనా సంస్థ‌కు ఎలా అప్ప‌గిస్తారంటూ ప్ర‌శ్నించారు. పిల్ల‌ల చావుల‌కు కార‌ణ‌మైన విద్యాశాఖ అధికారుల‌పై , గ్లోబ‌రిన్ సంస్థ సిఇఓల‌పై క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డిన కుటుంబాల‌కు న‌ష్ట ప‌రిహారం చెల్లించాల‌ని , వారిలో ఒక‌రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇవ్వాల‌ని కోరారు. చాలా మంది పిల్ల‌లు తాము క‌ష్ట‌ప‌డి చ‌దివినా మార్కులు త‌క్కువ వేశార‌ని వాపోయారు.

Comments

comments

Share this post

scroll to top