ఆధార్ కార్డులో మార్పులు, చేర్పులు… సింపుల్‌గా ఇలా చేసుకోండి..!

ఆధార్‌..! ఇప్పుడు మ‌న‌కు ఏ చిన్న ప‌ని కావాల‌న్నా ఆధార్ క‌చ్చితంగా అవ‌స‌రం అవుతోంది. ఫొటో ఐడీగా, అడ్ర‌స్ ఐడీగా ఇప్పుడు మ‌నం దీన్ని చాలా ర‌కాలుగా ఉప‌యోగించుకుంటున్నాం. అయితే ఆధార్ కార్డుల్లో పేరు, చిరునామా వంటి వాటిలో త‌ప్పులు ఉన్నా, లేదంటే కార్డులో ఉన్న చిరునామా కాకుండా వేరే అడ్ర‌స్‌లో ఉంటున్నా దాంతో ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ఈ క్ర‌మంలో ఆయా అంశాల‌ను మార్పు చేసుకోవ‌డం త‌ప్ప‌నిస‌రి అయింది. అయితే అందుకు దిగులు చెంద‌వ‌ల‌సిన ప‌నిలేదు. ఆన్‌లైన్‌లోనే సింపుల్‌గా ఆధార్ కార్డు మార్పులు, చేర్పులు చేసుకోవ‌చ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

aadhar-update

ఆధార్ కార్డులో మార్పులు కావాల‌నునే వారు ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి ఆన్‌లైన్‌లో uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాలి. ‘ఆధార్‌ అప్‌డేట్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది. దాని కింద ఉన్న ‘ఆధార్‌ అప్‌డేట్‌ డిటైల్స్‌ (ఆన్‌లైన్‌)’ను క్లిక్‌ చేయాలి. అప్పుడు ఓ పేజీ ఓపెన్‌ అవుతుంది.. అందులో ఆధార్‌ నంబర్‌ను నమోదు చేయాలి. తర్వాత కింద ఇచ్చిన వెరిఫికేషన్‌ కోడ్‌ను ఎంట్రీ చేయగానే మొబైల్‌కు వన్‌ టైం పాస్‌ వర్డ్‌ వస్తుంది. ఆ ఎస్‌ఎంఎస్‌ మనం ఆధార్‌ తీసుకునేటప్పుడు ఇచ్చిన సెల్‌ నంబర్‌కు మాత్రమే వస్తుంది. వన్‌ టైం పాస్‌వర్డ్‌ను నమోదు చేయగానే ఇంకో పేజీ ఓపెన్‌ అవుతుంది. అందులో మీరు మార్పులు, చేర్పులు చేసుకోవాల్సిన అంశాలను ఎంపిక చేసుకోవాలి. ఉదాహరణకు… చిరునామా మార్చుకోవాలంటే ‘అడ్రస్‌’ అన్న ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. కావాల్సిన ఆప్షన్‌ను ఎంచుకోగానే ఓ ఫాం ప్రత్యక్షం అవుతుంది. మనం ఏయే వివరాల్లో మార్పులు చేర్పులు చేయాలనుకున్నామో వాటిని నమోదు చేస్తే చాలు. అనంతరం సబ్మిట్‌ చేయాలి. సబ్మిట్‌ చేయగానే అవసరమైన పత్రాలను అప్‌లోడ్‌ చేయాల్సిందిగా సూచిస్తుంది. ఏ వివరాలు మార్చుకుంటున్నామో సంబంధించి పత్రాల ఒరిజినల్స్‌ను స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేస్తే చాలు. ఉదాహరణకు… మీరు చిరునామాలో మార్పు చేస్తుంటే… రేషన్‌ కార్డు, పాస్‌పోర్టు… ఇలా అక్కడ పేర్కొన్న ధ్రువీకరణ పత్రాల్లో ఏదో ఒకటి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్‌లోడ్ పూర్తి అవ‌గానే మీ మొబైల్‌కు ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ నంబర్‌’ వస్తుంది. ఆ నంబర్‌తో మీ ఆధార్‌ పరిస్థితేంటో ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అయితే చిరునామాను స్పష్టంగా పేర్కొనాలి.. ఎందుకంటే.. మార్పు చేసిన ఆధార్‌ కార్డును అదే చిరునామాకు పంపిస్తారు కాబట్టి అడ్ర‌స్ క్లియ‌ర్‌గా ఉండాలి.

aadhar-update-status

ఇక ఆఫ్ లైన్‌లో ఆధార్ మార్పులు, చేర్పులు చేయాల‌నుకునే వారు uidai.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లాల్సి ఉంటుంది. అక్కడ ఉండే ‘ఆధార్‌ అప్‌డేట్‌’ ఆప్షన్‌ కనిపిస్తుంది.. దాని కింద ఉన్న ‘అప్‌డేట్‌ రిక్వెస్ట్‌ బై పోస్ట్‌’ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. ‘ఆధార్‌ డేటా అప్‌డేట్‌/కరెక్షన్‌’ ఫాం వస్తుంది. ఆ దరఖాస్తును ప్రింట్‌ తీసుకోవాలి. దరఖాస్తులో తెలుగుతో పాటు ఆంగ్లంలోనూ వివరాలను రాయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ విధానంలో పాటించినట్లుగానే ఇక్కడా నిబంధనల్ని పాటించాలి. ఏ వివరాలు మార్చుకోవాలని అనుకొంటే వాటిని మాత్రమే నింపాలి. ఉదాహరణకు.. చిరునామాను మార్చుకోవాలనుకుంటే సంబంధిత కాలంలో ఆ వివరాలను రాస్తే చాలు. మొబైల్‌ నంబర్‌ కచ్చితంగా ఇవ్వాలి. దరఖాస్తు పరిస్థితేంటో ఆ నంబర్‌కు ఎస్ఎంఎస్‌ వస్తుంది. దరఖాస్తుతోపాటు ఏ వివరాలను మార్చుకొంటున్నారో.. సంబంధిత పత్రాల జిరాక్స్‌ కాపీలను జత చేయాలి. కవర్‌ మీద ‘ఆధార్‌ అప్‌డేట్‌/కరెక్షన్‌’ అని కచ్చితంగా రాయాలి. ఆ కవర్‌ను యూఐడీఏఐ, పోస్ట్‌ బాక్స్‌ నంబర్‌ 99, బంజారాహిల్స్‌, హైదరాబాద్‌ – 500034కు పోస్ట్‌ చేయాలి. దీంతో మీరు కోరుకున్న విధంగా ఆధార్ కార్డు మార్పులు, చేర్పుల‌తో మీకు పోస్టులో అందుతుంది.

ఇక చివ‌రిగా ఆధార్ అనుసంధానం… మీ ఆధార్ కార్డ్ నంబ‌ర్ బ్యాంకు ఖాతాతో అనుసంధానమైందా లేదా అన్నదీ సులువుగా తెలుసుకోవచ్చు. అందుకు ఏం చేయాలంటే… uidai.gov.inవెబ్‌సైట్‌లో ‘ఆధార్‌ సర్వీసెస్‌’ అనే ఆప్షన్‌ ఉంటుంది. దాని కింద చివర్లో ‘చెక్‌ ఆధార్‌ అండ్‌ బ్యాంక్‌ అకౌంట్‌ లింకింగ్‌ స్టేటస్‌’ను క్లిక్‌ చేయాలి. ఆధార్‌ నంబర్‌ నమోదు చేసి.. అక్కడే ఉన్న కోడ్‌ను ఎంట్రీ చేస్తే.. అప్పుడు ఏ బ్యాంకు ఖాతాతో ఆధార్‌ అనుసంధానమైందో తెలుస్తుంది.

Comments

comments

Share this post

scroll to top