ఆధార్ కార్డు… ఒకప్పుడంటే… దీన్ని కేవలం వంట గ్యాస్ సబ్సిడీ కోసం మాత్రమే ఉపయోగించేవారు. అప్పట్లో ఈ కార్డులపై అనేక విమర్శలు వచ్చాయి కూడా. కొందరైతే ఆధార్ కార్డులను ఎందుకు పనికి రాని కార్డులని ఎద్దేవా చేశారు. కానీ ఇప్పుడు ఆ కార్డులే ఎంతో మందికి అనేక అవసరాలను తీరుస్తున్నాయి. ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ గానే కాదు, పలు ప్రభుత్వ, ప్రైవేటు రంగాలకు చెందిన సంస్థలు ఆధార్ కార్డులనే గుర్తింపుగా స్వీకరించి మనకు పనులు చేసిపెడుతున్నాయి. అయితే ఇది ఎలా సాధ్యమవుతుందో తెలుసా..? మన ఆధార్ కార్డు వివరాలను, బయోమెట్రిక్ డేటాను ఆన్లైన్లో పొందుపరచడం వల్లే ఇదంతా జరుగుతుంది. మరి, ఆన్లైన్లో ఉన్న మన ఆధార్ వివరాలు సురక్షితమా అంటే..? అందుకు ప్రశ్నే సమాధానంగా వస్తుంది. ఈ క్రమంలో ఆన్లైన్లో ఉన్న మన ఆధార్ వివరాలను, బయోమెట్రిక్ డేటాను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో, అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం…
ఆన్లైన్ డేటాబేస్‌లో ఉన్న మన ఆధార్ కార్డ్ వివరాలను, బయోమెట్రిక్ డేటాను ఎవరు పడితే వారు యాక్సెస్ చేయకుండా ఉండాలంటే… అందుకు కింద చెప్పిన స్టెప్స్ పాటించాలి.
1. ముందుగా HTTPS://UIDAI.GOV.IN/BETA/ వెబ్సైట్లోకి వెళ్లాలి. అందులో కింద ఉండే ఆధార్ సర్వీసెస్ అనే విభాగంలో LOCK/UNLOCK BIOMETRICS అనే ఆప్షన్ దర్శనమిస్తుంది. దాన్ని క్లిక్ చేయాలి.
2. తరువాత వచ్చే విండోలో వినియోగదారులు తమ 12 అంకెల ఆధార్ నంబర్‌ను, కింద ఉండే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీ బటన్‌ను ప్రెస్ చేయాలి.
3. మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని అక్కడే కింద ఇచ్చిన బాక్స్‌లో ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.
4. అనంతరం మరో స్క్రీన్ ఓపెన్ అవుతుంది. అందులో కూడా ముందు లాగే సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్ చేసి అనంతరం కిందే ఉండే ENABLE అనే బటన్‌ను ప్రెస్ చేయాలి.
అంతే, మీ ఆధార్ నంబర్‌కు చెందిన బయోమెట్రిక్ డేటా లాక్ అవుతుంది. దీంతో ఎవరు పడితే వారు మీ ఆధార్ కార్డు వివరాలను తీసుకునేందుకు వీలుండదు. దీంతో ఐడెంటిటీ థెఫ్ట్ వంటి సైబర్ క్రైంల బారిన పడకుండా సురక్షితంగా ఉండవచ్చు.