వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ జాగ్రత్తలు పాటించండి, అందరికి తెలియజేయండి.

వడదెబ్బ ఎండాకాలంలో  ఈ మాట ఎక్కువగా వింటుంటాం. అధిక ఉష్ణోగ్రతకు గురికావడం వల్ల శరీర ఉష్ణోగ్రత నియంత్రణ సరిగా పనిచేయక చెమట పోయడం ఆగి, ఉష్ణోగ్రత అధికమై ఇతర లక్షణాలతో బాటు మూర్ఛ వచ్చి, మరణం సంభవిస్తుంది.సమ్మర్ ప్రారంభమవుతుందంటే చాలు రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రత వడదెబ్బ గురించి మరింత భయపెడుతుంది..కాబట్టి కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే వడదెబ్బ భారిన పడకుండా కాపాడుకోవచ్చు.

వృద్దులు,పిల్లలు ఎక్కువగా ఈ వడదెబ్బ బారిన పడుతుంటారు..పెద్దల్లో రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండడం,ఉక్కపోతకు తట్టుకోలేకపోవడం,పిల్లలు బయట ఆటలాడుకోవడం ఈ వడదెబ్బ బారిన పడడానికి గల ముఖ్య కారణాలుగా చెప్పవచ్చు..వడదెబ్బ ప్రభావం శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై పడుతుంది. గుండె, మూత్రపిండాలు, కండరాలు, కాలేయం, రక్తం గడ్డకట్టే వ్యవస్థ.. ఇలా అన్నింటిపై వడదెబ్బ దుష్ప్రభావాలు ఉంటాయి. ముందుగానే వడదెబ్బ లక్షణాలు గుర్తిస్తే ఆ దుష్ప్రభావాలను నివారించవచ్చు..వడదెబ్బ లక్షణాలు ఏంటో తెలుసుకోండి.

వడదెబ్బ లక్షణాలు:

 • విపరీతమైన దాహం
 •  తలనొప్పి, తల తిరుగడం
 •  మూత్ర విసర్జనలో మంట
 •  వాంతులు, నీళ్ల విరేచనాలు
 • ఒక్కోసారి ఫిట్స్ రావడం
 •  చర్మం ఎర్రగా మారి వేడిగా ఉండడం
 •  కొన్ని సందర్భాల్లో ముక్కు నుంచి రక్తం కారడం
 • అపస్మారక స్థితికి చేరడం
 •  శరీరం నీరసంగా ఉండడం

వడదెబ్బ తగలకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు

 • ఎక్కువ సమయం ఎండలో తిరుగకూడదు
 • నీళ్లు, మజ్జిగ, కొబ్బరిబోండాలు, పండ్ల రసాలు ఎక్కువగా తీసుకోవాలి.
 • ఎండకు వెళ్లేటప్పుడు గొడుగు, టోపీలాంటివి ధరించాలి.
 • సాధ్యమైనంతవరకు ముదురు రంగు దుస్తులకు దూరంగా ఉండాలి.
 • వదులుగా ఉండే కాటన్ దుస్తులను ధరించాలి.
 • ఇంటి గదుల్లో ఉష్ణోగ్రత తగ్గించేందుకు కిటికీలకు, తలుపులకు తెరలను వాడి వేడిని తగ్గించుకోవచ్చు.
 • శరీరం, నీటి శాతాన్ని కోల్పోకుండా ఇంట్లో లభించే ఉప్పు, చక్కెర కలిపిన ద్రావణాన్ని తీసుకోవాలి.
 • కలుషితమైన నీరు, ఆహారం ద్వారా టైఫాయిడ్, అతిసారం వస్తాయి. కాబట్టి జాగ్రత్త అవసరం.
 • ఆహారం తక్కువ మోతాదులో ఎక్కువసార్లు తీసుకోవాలి.

ప్రధమచికిత్స

 •  వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ, గాలి ఉన్న ప్రదేశానికి చేర్చాలి. తర్వాత శరీరంపై దుస్తులు తొలిగించి ఐస్‌ముక్కలతో లేదా చల్లని నీటితో తడిపిన బట్టతో శరీరమంతా తుడవాలి.
 • స్పృహ కోల్పోతే తక్షణమే వైద్యమందేలా చూడాలి.
 •  వీలైనన్ని ఎక్కువ కొబ్బరి నీళ్లు, నిమ్మరసం, మజ్జిగ, ఓఆర్‌ఎస్ ద్రావణం తాగించాలి.
 •  ప్రాథమిక చికిత్స చేసినప్పటికీ కోలుకోకపోతే ఆస్పత్రికి తరలించాలి.
 •  శరీరం కోల్పోయిన లవణాలను తిరిగి అందేలా ప్లూయిడ్స్ ఇవ్వాలి.

Comments

comments

Share this post

scroll to top