ఈ సెక్యురిటీ గార్డ్… మంచి మ‌న‌సున్న రియ‌ల్ హీరో.! అత‌ని ఆలోచ‌న‌కు సెల్యూట్.!

న‌లుగురుకి సాయం చేయాలంటే ధ‌న‌వంతుడై ఉండాలా? స‌మాజం మేలు కోరుకోవాలంటే బాగా చ‌దువుకుని ఉండాలా?
ఇత‌నికైతే ఇవేవీ లేవు. కానీ స‌మాజంపై స్పృహ ఉన్న‌ది. అవ‌గాహ‌న ఉన్న‌ది. అందుకే వాళ్ల‌కంటే ఓ అడుగు ముందున్నాడు.
ధ‌న‌వంతులు.. చ‌దువుకున్న‌వాళ్లు సైతం చేయ‌లేని గొప్ప కార్య‌క్ర‌మ‌మే చేస్తున్నాడు జామే ఉస్మానియాకు చెందిన అశోక్‌.
అత‌నో సెక్యూరిటీ గార్డు. పుట్టి పెరిగిందంతా సికింద్రాబాద్ బ‌స్తీలో…

నిత్యం ర‌ద్దీగా ఉండే హైద‌రాబాద్‌లో ఏదో ఒక‌చోట రోడ్డు ప్ర‌మాదం జ‌రుగుతూనే ఉంటుంది. రోజూ వార్త‌ల్లో మ‌నం చూస్తూనే ఉన్నాం. ప్ర‌థ‌మ చికిత్స ఆల‌స్యంగా జ‌ర‌గ‌డం వ‌ల్ల ప్రాణాలు వ‌దిలిన‌వాళ్ల‌ను ఎంతోమందిని చూస్తున్నాం. విష‌యం తెలుసుకుని అయ్యో అని బాధ‌ప‌డ‌ట‌మే గానీ ఆ పరిస్థితిని మార్చేందుకు ఎవ‌రూ ప్ర‌య‌త్నం చేయ‌డం లేదు. నేనూ అంద‌రిలా ఉంటే ప్ర‌యోజ‌న‌మేంది? పొట్ట‌కూటి కోసం చిన్న ఉద్యోగ‌మే చేస్తున్నా.. నావంతుగా ఏదైనా చేత‌నైన సాయం చేస్తే బాగుంటుంది క‌దా అనుకున్నాడు అశోక్‌! ప్రాణం విలువ తెలిసిన‌వాడిగా.. ఒక వ్య‌క్తి ప్రమాదంలో ఉన్న‌ప్పుడు ప్ర‌థ‌మ చికిత్స తెలిసిన‌వాడిగా హైద‌రాబాద్ ప్ర‌ధాన కూడ‌ళ్ల‌లో ఫ‌స్ట్ ఎయిడ్ కిట్స్ ఏర్పాటు చేసి.. స‌మాజం ప‌ట్ల బాధ్య‌త చాటుకున్నాడు!

వీఎస్టీ.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌.. చిక్క‌డ‌ప‌ల్లి.. నారాయ‌ణ‌గూడ‌.. హిమాయ‌త్ న‌గ‌ర్‌.. ల‌క్డీకాపూల్‌.. మాసాబ్ ట్యాంక్‌.. బంజారాహిల్స్‌.. జూబ్లీహిల్స్ వంటి ట్రాఫిక్ సిగ్న‌ల్స్ వ‌ద్ద ప్ర‌థ‌మ చికిత్సకు అవ‌స‌ర‌మ‌య్యే బాక్స్‌లు పెడుతున్నాడు! పొద్దున్నే లేచి.. వీట‌న్నింటినీ చెక్ చేస్తాడు. ఏదైనా మెటీరియ‌ల్ అయిపోతే వెంట‌నే తీసుకొచ్చి ఆ బాక్స్‌లో ఉంచుతాడు! అన్నిసార్లు ఆంబులెన్స్‌లు స‌మ‌యానికి రాక‌పోవ‌చ్చు.. ఆంబులెన్స్‌పైనే పూర్తిగా ఆధార‌ప‌డకుండా ఇలాంటి ప్ర‌త్యామ్నాయ‌ అవ‌కాశం ఉంటే బాగుంటుంద‌నే త‌న ఆలోచ‌న నిజంగా గొప్ప‌గా ఉంది! అశోక్ చేస్తున్న మంచి ప‌నికి చాలామంది అభినందిస్తున్నారు. ఇత‌ను సెక్యూరిటీ గార్డే అయుండొచ్చు.. కానీ స్థోమ‌త ఉండీ సాయం చేయ‌లేనివాళ్ల‌కంటే న‌యం! అశోక్ ఇచ్చే సామాజిక సందేశం అమూల్య‌మైన‌ది.. అత‌న్ని అభినందించి.. మ‌రింత‌మంది ఇలాంటి ప‌నులు చేస్తే ప్ర‌మాద‌ర‌హిత న‌గ‌రాన్ని నిర్మించొచ్చు.

అశోక్ ఫోన్ నెంబ‌ర్ (8897439178)

Story By: Daayi Sreeshailam

Comments

comments

Share this post

scroll to top