విరాట్ కోహ్లి… క్రికెట్ మ్యాచ్ పట్ల అతనికున్న అంకిత భావం చూస్తే అందరూ ఆశ్చర్యపోవాల్సిందే..!

ఏ పని చేసినా చిత్తశుద్ధితో, కృత నిశ్చయంతో చేయాలి. అలా చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలుగుతారు. అయితే ఆ పని చేసే సందర్భంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ధైర్యాన్ని, సంయమనాన్ని కోల్పోకూడదు. లక్ష్యం పైనే దృష్టి సారించాలి. కానీ ఇలా చేయడం అందరి వల్లా కాదు. లక్ష్యం కోసం ప్రతి ఒక్కరూ కష్ట పడతారు. కానీ విపత్కర పరిస్థితులు ఉన్నప్పుడు కూడా కేవలం లక్ష్యంపైనే దృష్టి సారించేవారు కొందరే ఉంటారు. అలాంటి కొందరిలో వర్ధమాన క్రికెటర్ విరాట్ కోహ్లి కూడా ఒకడు. ఇంతకీ కోహ్లి ఏం చేశాడు? అద్భుతమైన క్రికెట్ క్రీడాకారుడిగా ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటున్న కోహ్లి తన జీవితంలో ఎదుర్కొన్న ఆ విపత్కర సంఘటన ఏమిటి? అది అతని జీవితాన్ని ఎలా మలుపు తిప్పింది?

అది 2006వ సంవత్సరం డిసెంబర్ నెల. రంజీ ట్రోఫీ టోర్నమెంట్ నడుస్తోంది. ఆ టోర్నమెంట్‌లో భాగంగా ఢిల్లీ, కర్ణాటక జట్లు మైదానంలో హోరా హోరీగా తలపడుతున్నాయి. అప్పటికి విరాట్ వయస్సు 18 ఏళ్లు. ఢిల్లీ తరఫున ఆడుతున్నాడు. అయితే అప్పటికే తమ జట్టు ఫాలో ఆన్ ఆడుతోంది. ప్రత్యర్థి జట్టు చేసిన స్కోరును చేరుకునే క్రమంలో ఢిల్లీ బ్యాట్స్‌మెన్ వెంట వెంటనే పెవిలియన్ బాట పడుతున్నారు. అప్పుడు విరాట్ కోహ్లి బ్యాటింగ్‌కి దిగాడు. తన భాగస్వామి బ్యాట్స్‌మెన్ పునీత్ బిష్త్‌తో కలిసి జట్టును ఆదుకునే పనిలో పడ్డాడు. ఈ క్రమంలో ఆ మ్యాచ్ అతనికి కీలకంగా మారింది. అందులో సత్తా చాటితే జాతీయ జట్టులోకి వచ్చే అవకాశం ఉందంటూ కోచ్ చేతన్ చౌహాన్ అప్పటికే జట్టు సభ్యులందరికీ చెప్పాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లి ఆ లక్ష్యాన్ని సాధించాలనే తపనతో మైదానంలో పోరాడుతున్నాడు. కాగా అతను క్రీజులోకి దిగిన రోజు మ్యాచ్ ముగిసే సమయానికి 40 వ్యక్తిగత స్కోరు పూర్తి చేసుకున్నాడు. పార్ట్‌నర్‌తో కలిసి మంచి పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో జట్టు సభ్యులు విరాట్ కోహ్లి ప్రదర్శనపై ఆశలు పెట్టుకున్నారు. అయితే వారి నమ్మకం వమ్ము కాలేదు. కానీ విరాట్ జీవితంలో ఒక అనుకోని దురదృష్ట ఘటన చోటు చేసుకుంది.

virat-kohli

మరుసటి రోజు మరికొద్ది సేపట్లో మ్యాచ్ ప్రారంభమవుతుందనగా అందుకు కొంత సేపటి ముందు సరిగ్గా తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో తన తండ్రి ప్రేమ్ కోహ్లి చనిపోయారనే వార్త విరాట్ కోహ్లికి తెలిసింది. అప్పటికే ఆయన నెల రోజులుగా హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆ రోజు అకస్మాత్తుగా వచ్చిన బ్రెయిన్ స్ట్రోక్‌తో మృతి చెందారని తెలిసింది. దీంతో విరాట్ కోహ్లి ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనయ్యాడు. మరికొన్ని గంటలైతే అత్యంత ముఖ్యమైన మ్యాచ్ జరగనుంది. తన భవిష్యత్తును ఎంతగానో మలుపు తిప్పే కీలకమైన మ్యాచ్ అది. కానీ మరోవైపు తండ్రి మరణవార్త. దీంతో కోహ్లికి ఏం చేయాలో పాలుపోలేదు. కోచ్ చేతన్ చౌహాన్‌కు ఫోన్ చేసి అదే విషయాన్ని చెప్పాడు. అయితే ఆయన మాత్రం క్రికెట్ ఆడమనే చెప్పాడు. ఎందుకంటే మ్యాచ్‌లలో అలాంటి చాన్స్ మరోసారి వచ్చేందుకు అవకాశం చాలా తక్కువగా ఉంటుందని, దాన్ని ఇప్పుడు వదులుకోవద్దని ఆయన కోహ్లికి చెప్పాడు. దీంతో కోహ్లి ఒక్కటే నిర్ణయించుకున్నాడు. ఎలాగైనా జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాలని. దీంతో తండ్రి వద్దకు వెళ్లాలనే తన ప్రయాణాన్ని కొంత సేపు వాయిదా వేసుకున్నాడు. మ్యాచ్‌లో ఓవర్‌నైట్ స్కోర్‌తో బరిలోకి దిగాడు. అనూహ్యంగా కోహ్లి 90 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే అప్పటికే అతని జట్టు ఢిల్లీ ఫాలో ఆన్ నుంచి తప్పించుకుని సేఫ్ జోన్‌లో పడింది. దీంతో ఆ జట్టు సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే కోహ్లిది మాత్రం ఔట్ కాదట. అంపైర్ తప్పిదం కారణంగా కోహ్లి ఔటయ్యాడు. కానీ ఇంకా ఎక్కువ పరుగులే చేసి ఉండేవాడు. అయినప్పటికీ తమ జట్టు గండం నుంచి బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

కాగా కోహ్లి తండ్రి మరణించాడని తెలుసుకున్న అతని తోటి క్రీడాకారులతోపాటు ప్రత్యర్థి కర్ణాటక జట్టు క్రీడాకారులు కూడా ఒకింత ఆవేదనకు గురయ్యారు. కోహ్లి తండ్రి మృతి పట్ల అతనికి సంతాపం తెలిపారు. మ్యాచ్ అనంతరం కోహ్లి నేరుగా తండ్రి అంత్యక్రియలకు వెళ్లి కార్యక్రమాలను పూర్తి చేశాడు. అయితే ఆ మ్యాచ్ సందర్భంగా జరిగిన ఆ విషాద సంఘటనే విరాట్ కోహ్లి జీవితాన్ని అనూహ్యంగా మలుపు తిప్పిందని చెబుతారు కోహ్లి మాతృమూర్తి. ఆ మ్యాచ్ తరువాత విరాట్ పూర్తిగా మారిపోయాడని, తన లక్ష్యం కోసం దేన్నయినా లెక్క చేయని మనస్తత్వాన్ని అలవాటు చేసుకున్నాడని, తండ్రి కన్న కలలను నెరవేర్చాలనే దిశగానే అతను ఈ రోజు అంతటి క్రికెటర్ అయ్యాడని ఆమె చెబుతారు. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సంయమనం కోల్పోకుండా లక్ష్యం పైనే దృష్టి పెట్టాలనే సత్యాన్ని చాటి చెప్పి, గొప్ప క్రికెటర్‌గా ఎదిగిన విరాట్ కోహ్లి అంకిత భావానికి నిజంగా మనం అభినందనలు తెలపాల్సిందే కదా! ఏమంటారు!

Comments

comments

Share this post

scroll to top