కొందరు చూడ్డానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావడంతోపాటు కొవ్వును కూడా కరిగించుకోవాలంటే మన రోజువారి కార్యకలాపాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి.దాంతో పాటు మనం చేసే వ్యాయామాల్లో కూడా చిన్న చిన్న మార్పులు చేసుకోవాలి .అప్పుడు కొవ్వు కరగడంతో పాటు కండరాలు కూడా దృఢంగా మారి మరింత ఆరోగ్యవంతంగా ఉంటారు.
- మనం ఒక సమయంలో ఒకే వ్యాయామం చేస్తుంటాం.అది కంప్లీట్ అయ్యాక వేరేది చేస్తాం కానీ ఇకపై ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ వ్యాయామాలను చేయడానికి ప్రయత్నించండి. ఇలా రెండు వేర్వేరు వ్యాయామాలు ఒకేసారి చేయడం వల్ల కండరాలు బలపడతాయి. ఉదాహరణకు జంపింగ్, పుల్అప్స్ కలిపి చేయండి. హృదయ కండరాలకు బలం చేకూరుతుంది.
- శరీరానికి నీరెంత అవసరమో మనకు తెలుసు. కావాల్సినంత నీరు అందకపోతే కణాలు ముడుచుకుపోతాయి. దాంతో కండరాలు బిగుతుగా మారి మీరు త్వరగా అలసిపోతారు. కాబట్టి శరీరానికి సరిపడా నీళ్లు తీసుకున్నప్పుడే మీ కండరాలు దృఢంగా ఉంటాయి.
- కొందరు రెస్ట్ లేకుండా వ్యాయామాలు చేస్తునే ఉంటారు.దాని ఫలితంగా శరీరం అలసిపోవడం తప్ప ఉపయోగం ఉండదు.కాబట్టి మన శరీరం కోలుకుని తిరిగి శక్తి పుంజుకోవాలంటే శరీరానికి తగినంత విశ్రాంతి అవసరం. కాబట్టి ప్రతిరోజూ దాదాపు ఏడెనిమిది గంటలు హాయిగా నిద్రపోవాలి. వారంలో ఒక్క రోజైనా వ్యాయామాలకు విరామం ఇవ్వడం వల్ల మరుసటి వారం అంతా మీరు నూతనోత్సాహంతో ఉండగలుగుతారు.
- ఈత, సైక్లింగ్, పరుగు లాంటివి క్రమం తప్పకుండా చేయడం వల్ల కొవ్వు కరిగి.. కండరాలు దృఢంగా తయారవుతాయి. అయితే వీటిని క్రమంగా పెంచుతూ, సమయాన్ని కూడా పొడిగించుకుంటూ వెళితే మీ ఊపిరితిత్తుల సామర్థ్యం పెరగడమే కాదు గుండె కండరాలు కూడా బలపడతాయి.
- రోజుల తరబడి ఒకే విధమైన వ్యాయామాలు చేయడం వల్ల పెద్దగా ఫలితం ఉండదు. కాబట్టి అప్పుడప్పుడూ వాటిని మార్చడం వలన కండరాలకు మంచిది..