వీరు మెడ‌లో వేసుకున్న పుర్రెరు ఎవ‌రివో తెలుసా? దేశ‌రాజ‌ధాని సాక్షిగా హృద‌య‌విదార‌క దృశ్యం!!

స్వాతంత్ర్యం వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్నో సంవ‌త్స‌రాలు గ‌డిచాయి. ఎన్నో ప్ర‌భుత్వాలు మారాయి. నాయ‌కులు వ‌చ్చారు. వెళ్లారు. అయినా రైతుల స‌మ‌స్య‌లు మాత్రం అలాగే ఉన్నాయి. ఎన్నిక‌ల‌లో రైతులను ఆక‌ర్షించేలా ఆయా రాజ‌కీయ పార్టీలు ఎన్నో హామీల‌ను గుప్పిస్తున్నాయి. కానీ ఎన్నిక‌లు ముగిసి ఏదైనా పార్టీ అధికారంలోకి వ‌స్తే మాత్రం ఇక రైతుల వైపు చూడ‌డం లేదు. దీంతో మ‌న దేశంలో రైతుల ప‌రిస్థితి నానాటికీ దిగ‌జారుతోంది. త‌మిళ‌నాడులో ప్ర‌స్తుతం రైతులు ఎదుర్కొంటున్న ప‌రిస్థితే ఇందుకు ఉదాహ‌ర‌ణ‌. గ‌త కొద్ది రోజులుగా త‌మిళ‌నాడుకు చెందిన కొంద‌రు రైతులు ఢిల్లీలో ఆమ‌ర‌ణ దీక్ష చేస్తూ నిర‌స‌న తెలుపుతున్నా కేంద్ర ప్ర‌భుత్వ పెద్ద‌లు అటు వైపు చూసిన పాపాన పోలేదు. అదీ… రైత‌న్న‌ల‌కు నేతలు ఇస్తున్న విలువ‌..!

త‌మిళ‌నాడులో ఇటీవ‌లి కాలంలో క‌ర‌వు కోర‌లు చాచింది. గ‌త 140 ఏళ్ల‌లో ఎన్న‌డూ లేని విధంగా తీవ్ర‌మైన క‌రువుతో అక్క‌డి రైత‌న్న‌లు అల్లాడుతున్నారు. గత రెండు నెల‌ల కాలంలోనే 65 మంది రైతులు బ‌ల‌వ‌న్మ‌ర‌ణాల‌కు పాల్ప‌డ్డారంటే ప‌రిస్థితి ఎంత ద‌య‌నీయంగా మారిందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు. అయితే అందుకు అక్క‌డి ప్ర‌భుత్వం చెబుతున్న లెక్క‌లు మాత్రం వేరేలా ఉన్నాయి. అక్క‌డ కేవ‌లం 17 మంది మాత్ర‌మే ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్నార‌ట‌. ఈ క్ర‌మంలో స‌ద‌రు 65 మంది రైతులు చ‌నిపోవ‌డంపై జాతీయ మాన‌వ హ‌క్కుల క‌మిష‌న్ సీరియ‌స్ అయింది. ఆ సంఘ‌ట‌న‌ల‌ను సుమోటోగా స్వీక‌రించి కేసు ద‌ర్యాప్తు చేయాల‌ని త‌మిళ‌నాడు ప్ర‌భుత్వానికి ఆదేశాలు ఇచ్చింది. అయితే అవి ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఈ క్ర‌మంలోనే త‌మిళ‌నాడులోని ట్రికీ, కారూర్‌, తంజావూర్ జిల్లాల‌కు చెందిన సుమారు 150 మంది రైతులు ఢిల్లీకి చేరుకుని ప్ర‌ధాని నివాసం ఎదుట ఆమ‌ర‌ణ దీక్ష‌కు దిగారు. అయితే అక్క‌డి నుంచి అధికారులు పంపివేయ‌డంతో వారు ఢిల్లీలోనే ఉన్న జంత‌ర్ మంత‌ర్‌కు చేరుకుని అక్క‌డ ఈ నెల 14 నుంచి ఆమ‌ర‌ణ దీక్ష చేస్తున్నారు. అంత‌కు ముందు చ‌నిపోయిన రైతుల పుర్రెల‌ను వారు మెడ‌లో వేసుకుని త‌మ నిర‌స‌న తెలుపుతున్నారు. అయినా నేతలు క‌రుణించ‌డం లేదు. వారి వైపు క‌న్నెత్తి కూడా చూడ‌డం లేదు. మ‌రోవైపు ఆ రైతుల కుటుంబాల్లోని మ‌హిళ‌లు కూడా నిర‌స‌న‌కు దిగ‌డం గ‌మ‌నార్హం. గ‌త కొద్ది రోజుల నుంచి వారు అలా దీక్ష చేస్తున్నా ఎవ‌రూ పట్టించుకున్న పాపాన పోలేదు. తాము బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల‌ను ర‌ద్దు చేయాల‌ని, బ్యాంకులు రైతుల‌పై విధిస్తున్న క‌ఠిన నియ‌మాల‌ను తీసేయాల‌ని, కొత్త పంట‌ల‌కు రుణాలు ఇవ్వాల‌ని, ద‌ళారులు లేకుండా చేయాల‌ని, మ‌ద్ద‌తు ధ‌ర క‌ల్పించాల‌ని వారు వేడుకుంటున్నారు. అయినా మ‌న నేత‌లు మారితేనా..! ఇక వారి బాధ‌ల‌ను వినేందుకు సాక్షాత్తూ ఆ దేవుడే దిగి రావాలి..! అంతే త‌ప్ప‌… నేత‌లెవ‌రూ క‌నిక‌రించ‌ర‌ని వారికి తెలియ‌దు పాపం..!

Comments

comments

Share this post

scroll to top