రైతు రుణమాఫీ: 1.55ల‌క్ష‌ల‌కు 1పైసా.!

నిజంగా మ‌న దేశంలో ఏ శాఖ‌కు చెందిన ప్ర‌భుత్వ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది అయినా చేసే ప‌నులు చాలా నిర్ల‌క్ష్యంగా ఉంటాయి. వాటి గురించి గ‌తంలో మ‌నం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు చెప్ప‌బోయేది కూడా స‌రిగ్గా ఇదే కోవకు చెందుతుంది. అధికారుల నిర్ల‌క్ష్యం కార‌ణంగా కొన్ని వేల మంది రైతుల‌కు రుణ మాఫీ కాకుండా పోయింది. దీంతో అస‌లే క‌ష్టాల్లో ఉన్న ఆ రైతులకు ఇప్పుడు ఏం చేయాలో పాలు పోవ‌డం లేదు. ఇంత‌కీ అస‌లు జ‌రిగిందేమిటంటే…

అది ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని మ‌థుర అనే ప్రాంతం. అయితే ఆ రాష్ట్ర సీఎం యోగి గ‌త నెల కింద‌ట రైతుల‌కు రుణ మాఫీ చేసేందుకు ఓ ప‌థ‌కం ప్ర‌వేశ‌పెట్టారు. దాని పేరు కృషి రుణ్ మోచ‌న్ యోజ‌న‌. దీనికి 87 ల‌క్ష‌ల మంది రైతుల‌కు చెందిన రూ.36వేల కోట్ల రుణాల‌ను మాఫీ చేసేందుకు ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. అయితే ఆ ప‌థ‌కం కింద చాలా మంది రైతుల‌కు రుణ మాఫీ అయిన‌ట్టు స‌ర్టిఫికెట్లు కూడా మంజూరు అయ్యాయి. కానీ వారిలో చాలా మందికి మాఫీ అయిన రుణం ఎంతో తెలుసా..? రూ.100 లోపే. వారిలో ఒక రైతుకైతే మ‌రీ అన్యాయంగా కేవ‌లం 1 పైస రుణం మాత్ర‌మే మాఫీ అయింది. ఇది మేం చెబుతోంది కాదు, అలా రుణం మాఫీ అయిన‌ట్టు సాక్షాత్తూ అక్క‌డి అధికారులే రైతుల‌కు రుణ మాఫీ స‌ర్టిఫికెట్ల‌ను అందించారు. ఇక పైన చెప్పిన ప‌థ‌కం ప్రారంభ‌మైన‌ప్పుడు నిర్వ‌హించిన ఓ కార్య‌క్ర‌మంలో నాయ‌కుల నుంచి రుణ మాఫీ స‌ర్టిఫికెట్ల‌ను కొంద‌రు రైతులు వేదిక‌పై అందుకున్నారు. వాటిల్లో రుణం ఎంత మాఫీ అయిన‌ట్టు వివ‌రాలు ఇచ్చారో తెలుసా..?

కొంద‌రికి రూ.10 కాగా, కొంద‌రికి రూ.100, కొంద‌రికి రూ.200 రుణం మాఫీ అయినట్టు ఆ స‌ర్టిఫికెట్ల‌లో ఉంది. దీంతో వాటిని అందుకున్న రైతులు అప్పుడే విష‌యాన్ని నాయ‌కుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అధికారులు స్పందిస్తూ సాంకేతిక లోపం వ‌ల్లే ఇలా జ‌రిగింద‌ని చెప్పుకొచ్చారు. ముఖ్యంగా మ‌థుర ప్రాంతానికి చెందిన చిద్ది అనే ఓ రైతుకు రూ.1.55 ల‌క్ష‌ల అప్పు ఉండ‌గా అందులో కేవ‌లం 1 పైస రుణం మాత్ర‌మే మాఫీ అయింది. అలా అయిన‌ట్టు స‌ర్టిఫికెట్ ఇచ్చారు. ఇక రూ.1.55 ల‌క్ష‌ల రుణం ఉన్న మ‌రో రైతుకు రూ.10.37 ను మాఫీ చేశారు. మ‌రో రైతుకు ఉన్న రూ.40వేల రుణంలో రూ.215 మాఫీ అయింది. ఇలా దాదాపుగా 10వేల మంది రైతుల‌కు చాలా అత్య‌ల్పంగా రుణం మాఫీ అయిన‌ట్టు గుర్తించారు. మ‌రిప్పుడు వారి భ‌విష్య‌త్ ఏమిటో అక్క‌డి నాయ‌కులు, అధికారులే చెప్పాలి. ఏది ఏమైనా రైతుల ప‌ట్ల మ‌న ప్ర‌భుత్వాలు, నాయ‌కులు ప్ర‌ద‌ర్శిస్తున్న వైఖ‌రి మాత్రం తీవ్ర ఆక్షేప‌ణీయంగా ఉంది. ఇది మార‌నంత కాలం రైతుల జీవితాల్లోనూ మార్పు రాదు.

Comments

comments

Share this post

scroll to top