ప్రస్తుతం జనాలందరూ తమ వద్ద ఉన్న పాత పెద్ద నోట్లను మార్చుకునేందుకు ఓ వైపు ఆందోళన చెందుతుంటే, మరోవైపు కొత్తగా అందుబాటులోకి వచ్చిన రూ.2వేల నోటుకు కొందరు కేటుగాళ్లు అప్పుడే నకిలీలను సృష్టించడం కూడా మొదలు పెట్టేశారు. మొన్న 8వ తేదీ నాడు ప్రధాని మోదీ నోట్ల రద్దు నిర్ణయంతో నల్ల కుబేరులకు షాక్ ఇస్తే, ఇప్పుడు ఈ డూపుగాళ్లు అమాయక జనాలకు రూ.2వేల నోటు పేరిట కుచ్చుటోపీ పెడుతున్నారు. అంతా చేసి కొత్త నోటు వచ్చి 5 రోజులు కూడా పూర్తిగా అవలేదు. అంతలోనే కొందరు ప్రబుద్ధులు రూ.2వేల నోటుకు నకిలీ నోట్లను ప్రింట్ చేసి ఎంచక్కా మార్కెట్లో చెలామణీ చేస్తున్నారు.
అది కర్ణాటకలోని చిక్ మంగళూరు ఏపీఎంసీ మార్కెట్. అశోక్ అనే రైతు తాను పండించిన ఉల్లిపాయలను ఆ మార్కెట్లో అమ్ముకునేందుకు వచ్చాడు. అప్పుడే ఓ వ్యక్తి అశోక్ వద్దకు వచ్చి రూ.2వేలతో ఉల్లిపాయలను కొనుగోలు చేశాడు. అందుకు గాను సదరు వ్యక్తి కొత్తగా వచ్చిన రూ.2వేల నోటు అని చెప్పి అశోక్‌కు ఇచ్చాడు. అయితే కొత్త నోట్లను అప్పటి వరకు చూడకపోవడం, కేవలం టీవీలో మాత్రమే చూడడంతో, సదరు నోటు నకిలీదా, అసలుదా అని అశోక్ గుర్తించలేకపోయాడు. దీంతో ఆ వ్యక్తి ఇచ్చిన నోటును అతను తీసుకున్నాడు. అనంతరం ఆ వ్యక్తి వెళ్లిపోగానే అశోక్ ఆ నోటును ఇరుగు పొరుగు రైతులకు చూపించగా వారు అనుమానం వ్యక్తం చేశారు. అది కలర్ జిరాక్స్ అని, అసలు నోటు కాదని తేలడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అశోక్ రూ.2వేలను నష్టపోవాల్సి వచ్చింది.
మరో సంఘటన మహబూబాబాద్‌లో చోటు చేసుకుంది. ఆ జిల్లాలో ఉన్న కురవి అనే ప్రాంతంలోని ఓ పెట్రోల్ బంక్‌కు ఓ వ్యక్తి పెట్రోల్ కోసం వచ్చాడు. వాహనంలో పెట్రోల్ నింపమని చెప్పి రూ.2వేల నోటును అక్కడి సిబ్బందికి ఇచ్చాడు. అయితే ఆ పెట్రోల్ బంక్ సిబ్బంది దాన్ని నకిలీ నోటుగా గుర్తించారు. కానీ అప్పటికే ఆ వ్యక్తి అక్కడి నుంచి ఉడాయించాడు. ఈ రెండు సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు రూ.2వేలు, రూ.500 కొత్త నోట్ల పట్ల ఎంత వీలైతే అంత జాగ్రత్తగా ఉండడం మంచిది.