డెబిట్‌, క్రెడిట్‌ కార్డు ట్రాన్సాక్షన్‌ ఫెయిలైందా ? అయితే మీరు కోర్టులో కేసు వేయవచ్చు తెలుసా..?

సాధారణంగా మనం బయట ఏదైనా షాపు లేదా రెస్టారెంట్‌కు వెళ్లినప్పుడు క్యాష్‌ లేకపోతే కార్డులను స్వైప్‌ చేస్తాం. నేటి తరుణంలో డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల వాడకం ఎక్కువైనందున చాలా మంది క్యాష్‌ కన్నా కార్డుల స్వైపింగ్‌కే మొగ్గు చూపుతున్నారు. అయితే ఒక్కోసారి మనం ఆయా కార్డులను స్వైప్‌ చేస్తే మెషిన్‌ లేదా నెట్‌వర్క్‌ ఫెయిల్యూర్‌ వంటి కారణాల వల్ల కొన్నిసార్లు కార్డు స్వైప్‌ అవుతుంది. బ్యాలెన్స్‌ కట్‌ అవుతుంది. కానీ ట్రాన్సాక్షన్‌ మాత్రం ఫెయిల్‌ అవుతుంది. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ఎంత ట్రై చేసినా కార్డు ఫెయిల్యూర్‌ అనే వస్తుంది. మరో వైపు బ్యాంక్‌ అకౌంట్‌ లేదా క్రెడిట్‌ కార్డులో బ్యాలెన్స్‌ ఉంటుంది. కానీ ముందు చెప్పిన పలు కారణాల వల్ల కార్డులు స్వైప్‌ అవకుండా సతాయిస్తుంటాయి. ఈ క్రమంలో అలాంటి పరిస్థితి మనకు ఎదురైతే మెంటల్‌ టెన్షన్‌ వస్తుంది. ఏం చేయాలో అర్థం కాదు. కానీ అలాంటి స్థితినే ఎదుర్కొన్న ఆ యువతి మాత్రం వెనక్కి తగ్గలేదు. తనకు కార్డును ఇష్యూ చేసిన బ్యాంక్‌పై కన్‌జ్యూమర్‌ కోర్టులో పోరాడింది. చివరకు రూ.5 లక్షల నష్టపరిహారాన్ని పొందింది. ఎలాగంటే…

ఆమె పేరు దీపికా పల్లికల్‌. ప్రముఖ స్క్వాష్‌ ప్లేయర్‌. 2011 నవంబర్‌ లో క్యాథే పసిఫిక్‌ సన్‌ హుంగ్‌ కాయ్‌ స్క్వాష్‌ ఓపెన్‌ ఆడేందుకు విదేశాలకు వెళ్లింది. ఆమె బస చేసిన హోటల్‌లో 490 యూరోలు (దాదాపుగా రూ.3వేలు) చెల్లించాల్సి వచ్చింది. అయితే బిల్లును చెల్లించేందుకు ఆమె తన యాక్సిస్‌ బ్యాంక్‌ డెబిట్‌ కార్డును స్వైప్‌ చేసింది. ఆమె అకౌంట్‌లో రూ.2 లక్షలు ఉన్నాయి. అయినప్పటికీ లింక్‌ ఎర్రర్‌ అనే మెసేజ్‌ చూపించింది. దీనికి తోడు బ్యాంక్‌ అకౌంట్‌లో డబ్బు కట్‌ అయింది. దీంతో చుట్టూ ఉన్న స్నేహితుల ఎదుట ఆమె తనకు అవమానం జరిగినట్టు ఫీలైంది. స్వదేశానికి తిరిగి రాగానే వెంటనే కన్‌జ్యూమర్‌ కోర్టులో కేసు వేసింది. తనకు జరిగిన అవమానానికి, తాను ఎదుర్కొన్న మానసిక ఆందోళనకు రూ.10 లక్షల నష్ట పరిహారాన్ని బ్యాంక్‌ నుంచి ఇప్పించాలని ఆమె దరఖాస్తు చేసుకుంది.

అయితే అనేక నెలల పాటు సాగిన ఈ కేసు విచారణలో చివరికి దీపికకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఆమె అనుభవించిన మానసిక ఆందోళనకు గాను ఆమెకు రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లించాలని, దాంతోపాటు ఆమెకు అయిన ఖర్చుల నిమిత్తం ఆమెకు మరో రూ.5వేలను చెల్లించాలని జిల్లా కన్‌జ్యూమర్‌ కోర్టు తీర్పునిచ్చింది. అయితే కేవలం దీపికనే కాదు, మన దేశంలో ఎవరైనా ఇలాంటి స్థితిని ఎదుర్కొంటే బ్యాంక్‌లపై కేసు వేసి విజయం సాధించవచ్చు. కార్డులను మన దేశంలోనే కాదు, ప్రపంచంలో ఎక్కడ వాడినా సర్వీస్‌ బాగాలేకపోతే, వినియోగదారులు మానసిక ఒత్తిడి ఎదుర్కొంటే బ్యాంక్‌లకు వ్యతిరేకంగా కన్‌జ్యూమర్‌ కోర్టులలో కేసులు వేయవచ్చు.

అయితే కన్‌జ్యూమర్‌ కోర్టులలో కేసు వేసేందుకు ముందు లాయర్‌ను కలిసి ఆ బ్యాంక్‌కు లీగల్‌ నోటీస్‌ పంపాలి. తాము ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా ఇబ్బందిని ఎదుర్కొన్నామో తెలియజేస్తూ అన్ని వివరాలను ఆ నోటీస్‌లో తెలియజేయాలి. దాంతో బ్యాంకు వారు స్పందించి కేసు సాల్వ్‌ చేస్తారు. ఒక వేళ వారు స్పందించకపోతే అప్పుడు ఆ నోటీస్‌తోపాటు ఇతర వివరాలతో కూడిన దరఖాస్తును కన్‌జ్యూమర్‌ కోర్టులో ఇవ్వాలి. ఇందుకు చాలా తక్కువ ఖర్చులే ఉంటాయి.

వినియోగదారులు కోరే నష్ట పరిహారం కేసు తీవ్రతను బట్టి వారు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయి కన్‌జ్యూమర్‌ కోర్టులలో కేసు వేయాల్సి ఉంటుంది. ఇక జిల్లా స్థాయిలో రూ.1 లక్ష వరకు నష్టపరిహారం ఇవ్వాలని కోరితే దరఖాస్తు దారుడు రూ.100 వరకు ఫీజు చెల్లించాలి. అదే అంత్యోదయ అన్న యోజన కార్డు దారులకైతే ఈ ఫీజు ఉండదు. ఇక రూ.5 లక్షల వరకు నష్ట పరిహారం కోరదలిస్తే కోర్టు ఫీజు రూ.200 చెల్లించాలి, అలాగే రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు నష్టపరిహారం కోరితే రూ.400 ఫీజు, రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నష్టపరిహారం కోరితే రూ.500 వరకు ఫీజును కోర్టుకు చెల్లించాలి. ఇక్కడి వరకు ఏ కేసును అయినా జిల్లా కన్‌జ్యూమర్‌ కోర్టు పరిష్కరిస్తుంది.

ఇక నష్టపరిహారం రూ.20 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు అడగదలిస్తే రూ.2వేలు, రూ.50 లక్షల నుంచి రూ.1 కోటి వరకు నష్టపరిహారం అడిగితే రూ.4వేల ఫీజును కోర్టుకు చెల్లించాలి. ఈ కేసులను రాష్ట్ర స్థాయి కన్‌జ్యూమర్ కోర్టులో పరిష్కరిస్తారు. అలాగే రూ.1 కోటి పైన నష్టపరిహారం కోరదలిస్తే బాధితులు జాతీయ స్థాయి కోర్టులో కేస్‌ వేయాలి. అందుకు రూ.5వేల వరకు ఫీజు అవుతుంది. ఇక ఫీజు చెల్లించి కోర్టులో కేసు వేశాక, బాధితులు లాయర్లతో కేసు వాదించుకోవచ్చు. లేదా సొంతంగా కూడా వాదించుకునే అవకాశాన్ని కూడా రాజ్యాంగం కల్పించింది. అలాగే పెద్ద కంపెనీలను ఢీకొంటున్నప్పుడు ఒక్కోసారి వారు కేస్‌ విత్‌ డ్రా చేసుకోమని ప్రలోభాలకు గురి పెడతారు. కేసును ఎక్కువ కాలం విచారణ సాగేలా పొడిగిస్తారు. ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కోగలమని భావిస్తే ఎవరైనా న్యాయ పోరాటం చేయవచ్చు. ఎప్పుడైనా కార్డు ట్రాన్సాక్షన్లు ఫెయిలైతే ఎవరైనా ఇలా కన్‌జ్యూమర్‌ ఫోరంలో కేసు వేయవచ్చు..!

Comments

comments

Share this post

scroll to top