ఫేస్‌బుక్ ఫ్రెండ్స్ అంతా ఒక్క‌ట‌య్యారు.. వృద్ధురాలికి ఇల్లును క‌ట్టించారు.. ఎక్క‌డో తెలుసా..?

నిత్యం ఫేస్‌బుక్‌లో ఉండేవారంటే ఎప్పుడూ కొంద‌రికి చుల‌క‌నే. ఏం ఫేస్‌బుక్ రా… అస్త‌మానం అదేనా..? వేరే ప‌నేం లేదా..? అని దెప్పి పొడుస్తుంటారు. అయితే అంద‌రి సంగ‌తేమోకానీ… కొంద‌రు మాత్రం అలా కాదు. ఫేస్‌బుక్‌లో విహ‌రించ‌డ‌మే కాదు, ఆప‌ద‌లో ఉన్న వారికి స‌హాయం చేస్తామని కూడా కొంద‌రు ఫేస్‌బుక్ యూజ‌ర్లు నిరూపిస్తున్నారు. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. ఆ ప్రాంతంలో ఉన్న ఫేస్‌బుక్ యూజ‌ర్లు అంతా క‌లిసి ఏకంగా అంధురాలైన ఓ వృద్ధురాలికి ఇల్లు క‌ట్టించారు తెలుసా..? అంతేకాదు, స్థానిక పోలీస్ అధికారి స‌హాయంతో ఆ ఇంటిని గృహ ప్ర‌వేశం చేయించారు. ఆ ఆఫీస‌ర్ హామీతో వృద్ధురాలికి ఆర్థిక స‌హాయం కూడా అందించ‌నున్నారు. ఇంత‌కీ ఆ వృద్ధురాలు ఎవ‌రంటే…

ఆమె పేరు మంద‌పెళ్లి గౌర‌క్క‌. తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల వాసి. జగిత్యాల జిల్లాలోని ధ‌ర్మ‌పురి మండ‌లం రాజారం గ్రామంలో నివాసం ఉంటోంది. ఆమె భ‌ర్త పేరు రాజ లింగు. అయితే ఇటీవ‌లే రాజ లింగు చ‌నిపోయాడు. దీంతో అత‌నికి వ‌చ్చే రూ.1వేయి పెన్ష‌న్ ఆగిపోయింది. దీంతో గౌర‌క్క క‌ష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఆదుకునే వారు లేరు. పూట తిండికి కూడా నోచుకోలేదు. దీనికి తోడు అంధురాలు కావడంతో ఇక ఆమె ప‌డ్డ ఇబ్బందుల‌ను మాట‌ల్లో చెప్ప‌లేం. ఉన్న ఒక్క కొడుకు ఎప్పుడో చ‌నిపోవ‌డంతో అత‌ని భార్య.. అంటే.. గౌర‌క్క కోడ‌లు ఆమెను వ‌దిలిపెట్టి పిల్ల‌ల్ని తీసుకుని వేరే ద‌గ్గ‌ర నివాసం ఉంటోంది. ఈ క్ర‌మంలో గౌర‌క్క భ‌ర్త‌తో ఉండ‌గా, ఇప్పుడు అత‌ను కూడా మృతి చెందాడు. దీంతో ఆమెకు ఒంట‌రిదైపోయింది.

అయితే గౌర‌క్క ప‌రిస్థితి గురించి వివ‌రిస్తూ, ఆమెను ఆదుకోవాల‌ని ఫేస్‌బుక్‌లో రేణికుంట ర‌మేష్‌ అనే ఓ స్థానిక వ్య‌క్తి పోస్టు పెట్టాడు. దీంతో ఆయ‌న‌కు ఉన్న చాలా మంది ఫేస్‌బుక్ యూజ‌ర్ల నుంచి స్పంద‌న వ‌చ్చింది. వారంతా రూ.1.10 ల‌క్ష‌ల వ‌ర‌కు చందా సేకరించారు. అలా సేక‌రించిన చందాతో గౌర‌క్క‌కు ఓ ఇల్లును క‌ట్టించారు. ఈ క్ర‌మంలో ఇటీవ‌లే ఆ ఇంటిని జిల్లా ఎస్పీ అనంత శ‌ర్మ‌చే గృహ ప్ర‌వేశం చేయించారు. ఆ సంద‌ర్భంగా ఆయ‌న‌తో హామీ తీసుకున్నారు. గౌర‌క్క‌కు కావల్సిన ఆర్థిక స‌హాయం అందిస్తాన‌ని అనంత శ‌ర్మ మాటిచ్చారు. ఈ క్ర‌మంలో గౌర‌క్కకు దూరంగా ఉంటున్న ఆమె కోడ‌ల్ని కూడా తీసుకువ‌చ్చారు. ఆమె గౌర‌క్క‌తోపాటు ఆ ఇంట్లో ఉండేందుకు అంగీక‌రించింది. చూశారుగా… ఫేస్ బుక్ అనేది కేవలం పోసుకోలు క‌బుర్లు చెప్పుకోవ‌డానికి మాత్ర‌మే కాదు, ఇలా ఆప‌ద‌లో ఉన్న వారికి స‌హాయం కూడా చేస్తుంది..!

Comments

comments

Share this post

scroll to top