క్రికెటర్ “శ్రీశాంత్” పై కోర్టు నిషేధం ఎత్తేసింది…! కానీ బీసీసీఐ మాత్రం…?

శంత‌కుమ‌ర‌న్ శ్రీ‌శాంత్‌. ఈ పేరు చాలా మందికి తెలుసు. క్రికెట్ చూసే వారంద‌రికీ శ్రీ‌శాంత్ తెలుసు. త‌నదైన శైలిలో బౌలింగ్ వేయ‌డ‌మే కాదు, ప‌లు వివాదాల్లో చిక్కుకుని కూడా ఈ క్రికెట‌ర్ చాలా మందికి తెలిసిపోయాడు. సౌతాఫ్రికా టూర్‌లో ఒక‌ప్పుడు ఆండ్రూ నెల్ బౌలింగ్ లో సిక్సర్ బాది విన్యాసం చేసిన‌ప్పుడు, ఆ త‌రువాత ఐపీఎల్‌లో భ‌జ్జీ చెంప దెబ్బ కొట్టిన‌ప్పుడు, తిరిగి అదే ఐపీఎల్‌లో ఫిక్సింగ్‌కు పాల్ప‌డ్డాడ‌నే ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్పుడు శ్రీ‌శాంత్ పేరు మారుమోగింది. దీంతో అత‌నిపై బీసీసీఐ నిషేధం విధించింది. అయితే ఇప్పుడు బీసీసీఐకి షాక్ త‌గిలింది.

ఫిక్సింగ్ ఆరోప‌ణ‌లతో బీసీసీఐ నిషేధానికి గురైన శ్రీ‌శాంత్‌కు భారీ ఊర‌ట ల‌భించింది. త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల్లో నిజం లేద‌ని, తాను ఏ త‌ప్పూ చేయ‌లేద‌ని పేర్కొంటూ శ్రీశాంత్ కేర‌ళ హైకోర్టుకు వెళ్లాడు. దీంతో చాలా రోజుల నుంచి కేసును విచారించిన కోర్టు తాజాగా అందులో తీర్పునిచ్చింది. శ్రీ‌శాంత్‌పై విధించిన నిషేధాన్ని ఎత్తి వేయాల‌ని కోర్టు బీసీసీఐకి ఆదేశాలు జారీ చేసింది. ఈ క్ర‌మంలో శ్రీ‌శాంత్ చాలా ఉత్సాహంగా క‌నిపించాడు.

2013లో శ్రీశాంత్‌తోపాటు ఇద్ద‌రు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ ఆట‌గాళ్లు అజిత్ చండీలా, అంకిత్ చ‌వాన్‌ల‌ను స్పాట్ ఫిక్సింగ్ కేసులో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ త‌ర్వాత బీసీసీఐ శ్రీశాంత్‌పై నిషేధం విధించింది. హైకోర్టు తీర్పు త‌ర్వాత శ్రీశాంత్ ట్విట్ట‌ర్‌లో ఆనందం వ్య‌క్తంచేశాడు. అయితే కోర్టు తీర్పు చెప్పినా శ్రీ‌శాంత్‌పై ఇంకా నిషేధం ఎత్తివేయ‌లేదు. దీని ప‌ట్ల కూడా శ్రీ‌శాంత్ స్పందించాడు. త‌న‌పై వెంట‌నే నిషేధం ఎత్తేయాలని అత‌ను బీసీసీఐని కోరాడు. మ‌రి ఈ విష‌యంలో బీసీసీఐ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో వేచి చూడాలి. ఇక నిషేధం ఒక వేళ ఎత్తేస్తే గ‌న‌క మ‌ళ్లీ శ్రీ‌శాంత్ జ‌ట్టులోకి వ‌స్తాడా, రాడా అన్న‌ది కూడా తేలాల్సి ఉంటుంది..!

Comments

comments

Share this post

scroll to top