ఆక‌లిగొన్న పేద‌ల‌కు ఉచితంగా భోజ‌నం పెట్టే కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్‌..!

మాజీ క్రికెట‌ర్ గౌతం గంభీర్‌. ఇత‌ని గురించి తెలియ‌ని వారుండ‌రు. 2007 వ‌రల్డ్ టీ20 క‌ప్‌, 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌లలో గంభీర్ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు. ఫ‌లితంగా టీమిండియా విజ‌యాల‌ను ద‌క్కించుకుంది. అయితే అటు ఆట‌లోనే కాదు, ఇటు రియ‌ల్ లైఫ్‌లోనూ ప‌లు సామాజిక సేవా కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతూ భేష్ అనిపించుకుంటున్నాడు. గ‌తంలో చ‌త్తీస్‌గ‌డ్‌లో న‌క్స‌ల్స్ దాడిలో మృతి చెందిన 25 మంది సీఆర్‌పీఎఫ్ జ‌వాన్ల కుటుంబాల‌కు చెందిన పిల్ల‌ల బాధ్య‌త‌ను గంభీర్ తీసుకున్నాడు. ఈ క్ర‌మంలోనే తాజాగా మ‌రో గొప్ప సేవా కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు గంభీర్‌.

ఢిల్లీలోని వెస్ట్ ప‌టేల్ న‌గ‌ర్ లో ‘ఏక్ ఆషా’ పేరిట గంభీర్ ఓ ఉచిత కమ్యూనిటీ కిచెన్‌ను ఏర్పాటు చేశాడు. దీని ద్వారా ఆక‌లిగొన్న పేద‌ల‌కు రోజూ భోజ‌నం పెడుతున్నాడు. ఈ మ‌ధ్యే ఈ కిచెన్ ప్రారంభ‌మైంది. ఇందులో మ‌ధ్యాహ్నం 1 నుంచి 3 గంటల వ‌రకు పేద‌ల‌కు ఉచితంగా మీల్స్ అందిస్తారు. గంభీర్ త‌న ఫౌండేష‌న్ ద్వారా ఈ కిచెన్‌ను ఏర్పాటు చేశాడు. దీంతో చాలా మంది పేద‌ల‌కు ఒక పూట మంచి భోజ‌నం దొరుకుతోంది.

అయితే గంభీర్ ఈ కిచెన్ ప్రారంభం సంద‌ర్భంగా త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో ప‌లు విష‌యాల‌ను ట్వీట్ చేశాడు. వ‌ర‌ల్డ్ క‌ప్‌ల‌ను గెలిచిన‌, ఐపీఎల్ టోర్న‌మెంట్ గెలిచిన‌ ఆనందం కంటే, ఇప్పుడిలా పేద‌ల‌కు ఉచితంగా భోజ‌నం పెట్ట‌డం అమితంగా ఆనందాన్ని ఇస్తుంద‌ని చెబుతున్నాడు గంభీర్‌. ఆకలితో ఉన్న క‌డుపుతో ఎవ‌రూ నిద్రించ‌కూడ‌ద‌నే తాను ఈ నిర్ణ‌యం తీసుకున్నాన‌ని తెలిపాడు. సంవ‌త్స‌రంలో 365 రోజులూ ఈ కిచెన్ ఉంటుంద‌ని, ఆక‌లిగొన్న వారి ఆక‌లి తీరుస్తుంద‌ని అత‌ను చెప్పాడు. అత‌ను చేస్తున్న ఈ ప‌నిని మ‌నం అభినందించాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top