అది 1962వ సంవత్సరం నవంబర్ 18. జమ్మూ కాశ్మీర్లోని లదాఖ్ ప్రాంతం. అందులో చూషూల్ ఏయిర్ ఫీల్డ్ అనే ప్రాంతాన్ని 120 మంది భారత సైనికులు రక్షిస్తూ ఎల్లవేళలా పహారా కాస్తున్నారు. అప్పటికే చైనా సైనికులు అనేక సార్లు ఆ భాగంలోకి చొచ్చుకు రావడంతో మన సైనికులు ఈ సారి తమ నిఘాను ముమ్మరం చేశారు. అయితే అనుకోకుండా చైనా ఆర్మీ 5600 మంది సైనికులను అప్పటికే అందుబాటులో ఉన్న అత్యంత అధునాతన ఆయుధాలతో మరోసారి చూషూల్ ఏయిర్ ఫీల్డ్ ను ముట్టడించింది. అప్పుడు అర్థరాత్రి 3 గంటలవుతోంది. అయినా మన సైనికులు అప్రమత్తంగానే ఉన్నారు. చైనా ఆర్మీ చేసిన దాడికి భారత సైనికులు విరుచుకు పడ్డారు. మొత్తం సైన్యాన్నంతా తుత్తునియలు చేశారు. కానీ ఆ యుద్ధంలో మన సైనికులు ఆరుగురు వీర మరణం పొందారు. మరో 114 మంది మాత్రమే మిగిలారు. ఈ క్రమంలో వారి వద్ద ఆయుధాలు లేకుండా పోయాయి. ఇంకా 1300 మంది చైనా సైనికులు మిగిలారు. ఈ క్రమంలో వారిని ఉత్త చేతుల్తోనే ఎదుర్కోవడం కోసం మన సైనికులు సిద్ధమయ్యారు. అందుకు వారిని ఏకతాటిపై నడిపించిన మేజరే షైతాన్ సింగ్.
పేరుకు తగినట్టుగానే మేజర్ షైతాన్ సింగ్ శత్రుదేశాల సైనికుల పట్ల సైతాన్ లాగే ఉండేవాడు. భారత భూభాగాన్ని ఆక్రమించాలని చూస్తే ఏ దేశానికి చెందిన సైనికుడినైనా విడిచిపెట్టే వాడు కాదు. అంతటి ధీరత్వం, శూరత్వం అతని సొంతం. ఈ క్రమంలోనే చైనా ఆర్మీ అర్థరాత్రి పూట చూషూల్ ఏయిర్ ఫీల్డ్ ప్రాంతంపై విరుచుకు పడినా, లదాఖ్ను ఆక్రమించాలని ప్రయత్నించినా అందులో వారు సఫలీకృతులు కాలేదు. 114 మంది సైనికులు మాత్రమే ఉన్నా, ఎలాంటి ఆయుధాలు లేకపోయినా మేజర్ షైతాన్ సింగ్ నాయకత్వంలో భారత ఆర్మీ చైనా సైనికులపై విరుచుకు పడ్డారు. కనిపించిన శత్రు సైనికున్నల్లా ఊచకోత కోశారు. అలా వారు ఒక్కొక్కరు నేలకొరుగుతూనే మొత్తం 1300 మంది చైనా సైనికులను మట్టి కరిపించారు. దీంతో లదాఖ్ అన్యాక్రాంతం కాలేదు.
1962 నవంబర్లో జరిగిన ఈ యుద్ధం చరిత్రలోనే Greatest Last Stand Battle గా పేరుగాంచింది. యుద్ధంలో వీర మరణం పొందిన షైతాన్ సింగ్ కృషికి జ్ఞాపకార్థంగా ఆయనకు పరమవీర చక్ర ఇచ్చారు. సైనికులందరికీ వీరచక్ర, సేనా అవార్డులు వచ్చాయి. కానీ వాటిని వారి కుటుంబ సభ్యులు అందుకున్నారు. అయితేనేం… ఆ సైనికుల వీరత్వం మరువలేనిది. వారు మనకందించిన లదాఖ్ ప్రాంతం ఇప్పటికీ మన ఆధీనంలోనే ఉందంటే అది ఆ సైనికుల చొరవే. వారి యుద్ధ విజయాన్ని ప్రతి భారతీయుడు గుర్తు పెట్టుకోవాల్సిందే. వారికి శాల్యూట్ చేయాల్సిందే..!