బడ్జెట్ రోజున “ఫైనాన్స్ మినిస్టర్” బ్రీఫ్ కేసుతో ఎందుకు వస్తారో తెలుసా.? వెనకున్న కారణం ఇదే..!

Siva Ram

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఈ మధ్యే పార్లమెంట్‌లో రాబోయే సంవత్సరానికి గాను దేశ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు కదా. ఈ క్రమంలోనే ఆ బడ్జెట్‌పై పలువురు నేతలు హర్షం వ్యక్తం చేయగా, కొందరు మాత్రం బడ్జెట్‌ను విమర్శించారు. అయితే ఈ విషయం పక్కన పెడితే అసలు ఎప్పుడు ఎవరు బడ్జెట్‌ను ప్రవేశపెట్టినా, ఏ ప్రభుత్వంలోని కేంద్ర ఆర్థిక మంత్రి అయినా బడ్జెట్‌ ప్రవేశపెట్టే రోజున పార్లమెంట్‌కు బ్రీఫ్‌ కేస్‌తో వస్తారు, గమనించారు కదా. అవును, కరెక్టే. అయితే ఈ సంప్రదాయం ఎప్పుడు ప్రారంభమైందో, అసలు అలా బ్రీఫ్‌కేస్‌ను మంత్రులు ఎందుకు పార్లమెంట్‌కు తెస్తారో మీకు తెలుసా..? అదే ఇప్పుడు తెలుసుకుందాం.

పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజు బ్రీఫ్‌కేస్‌తో మంత్రులు రావడం అనే సంప్రదాయం ఇప్పుడు కాదు 18వ శతాబ్దంలోనే ప్రారంభమైంది. అది ఇక్కడ కాదు, ఇంగ్లండ్‌లో స్టార్ట్‌ అయ్యింది. అప్పట్లో బ్రిటన్‌ బడ్జెట్‌ చీఫ్‌ విలియమ్‌ ఇ.గ్లాడ్‌స్టోన్‌ను బడ్జెట్‌ ప్రవేశపెట్టమని ప్రభుత్వం అడిగిందట. దీంతో ఆయన బ్రిటన్‌ రాణి బొమ్మను ముద్రించిన ఓ ఎరుపు రంగు సూట్‌ కేస్‌లో బడ్జెట్‌ పత్రాలు పెట్టుకుని పార్లమెంట్‌కు వెళ్లి అందులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇక అప్పటి నుంచి (1860 నుంచి) అలా బ్రిటన్‌ పార్లమెంట్‌లో ఆ సూట్‌కేస్‌తో వెళ్లి మంత్రులు బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొదలు పెట్టారు. అయితే ఆ సూట్‌కేస్‌ను 2010 వరకు వాడారు. ఆ సంవత్సరంలో దాన్ని మార్చారు.

ఇక బ్రిటిష్‌ వారు మన దేశాన్ని పాలించడంతో వారి తరహానే మన దేశ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం మొదలు పెట్టారు. ఈ క్రమంలోనే 1947వ సంవత్సరంలో అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి ఆర్‌కే షణ్ముఖం చెట్టి మొదటి సారిగా నవంబర్‌ 26వ తేదీన పార్లమెంట్‌లో బ్రీఫ్‌కేస్‌తో అడుగు పెట్టి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. తరువాతి కాలంలో అధికారంలో కి వచ్చిన ప్రభుత్వాల్లోనూ కేంద్ర ఆర్థిక మంత్రులు ఇలాగే బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. కాకపోతే వాటి రంగుల్లో మార్పులు వచ్చాయి. అంతే తేడా. అలా బ్రిటన్‌ సాంప్రదాయాన్నే మన దేశంలో ఆర్థిక మంత్రులు నేటికీ అనుసరిస్తున్నారు..!

Comments

comments