సార్‌..ఆటో కావాల్నా? మేడం ఆటో చాహియే.?ఈ పదాల వెనకున్న అసలు ఆటో డ్రైవర్ జీవితం..ఏమిటో తెలుసా..?

ఏం జెప్ప‌మంట‌వ్ సార్……?
మూడు రోజుల సంది అడ్డ మీద పొద్ద‌టిపూట
ఒక చాయ, రెండు ఉస్మానియా బిస్కెట్లు తిని నాలుగొంద‌లు సంపాయించిన అని జెప్పాల్నా ?
ట్రాఫికోడు చ‌లాన్ల మీద చ‌లాన్లు రాస్తే… బిడ్డ‌కు ‘చెప్పులు కొనుక్కొస్తా’ అని దాశిన 120 రూపాయ‌లు
వాని ‘దినాల‌కు స‌దివిచ్చుకున్నా’ అని జెప్పాల్నా?
మీకేంది సార్‌… ఎన్క కూసోని నిమ్మ‌లంగ పాన్ న‌వులుకుంట
‘ఏంటి బాబూ విశేషాలూ’… అని టైంపాస్ కోసం అడుగుత‌రు?
మేమేమో మా రెక్క‌ల నొప్పంతా దాచిపెట్టుకుని,
గుండెల ఎతంతా… ఉగ్గ‌బ‌ట్టుకుని
మిమ్మ‌ల్ని న‌వ్వియ్య‌నీకె నాలుగు మ‌జాక్ ముచ్చ‌ట్లు చెప్పాలె.!
ఏసుకున్న ఖాకీ అంగికి చెమ్ట‌, ఆయిలు, మ‌న్ను, మ‌షానం అన్నీ అంటుతై!
బ‌ట్ట‌లు గ‌లీజుగుంటే ఏడ మీ అసంటి సార్లు, మేడాలు ఎక్క‌రో అని …
ఏద‌న్న గ‌ల్లీల బోరింగు కాడ రాత్రిపూట అంగి ఉతుక్కోని బ‌రిబ‌త్త‌ల‌నే పండుకుంటం…
ఫుట్‌పాత్‌ల మీద అని జెప్పాల్నా?
దంద కాని ట‌య‌మ్‌ల ఆక‌లైతె బండి మీద ఛాయ్‌బిస్కెట్ తింటం అని జెప్పాల్నా?
అయి చెప్తే మీకు మ‌న‌సున పడ్త‌దా ? ఇష్ట‌మైత‌దా ?
నీ లొల్లంతా.. నాకెందుకు చెప్తున్న‌వ్ రా బై ? అంట‌రు…!
అందుకే ఎన్ని ఎత‌లున్నా,… ఎన్ని క‌త‌లున్నా… క‌డుపుల‌నే పెట్టుకోని
పెదుముల మీద న‌వ్వు పూసుకుని (మీరు లిప్‌స్టిక్‌లు, లిప్‌బామ్‌లు పూసుకున్న‌ట్టు)
ప‌ట్న‌మంతా తిరుగుతుంటం…’సార్‌… ఆటో కావాల్నా… మేడం ఆటో చాహియే… అనుకుంట‌!’
– ప్ర‌వీణ్‌కుమార్ సుంక‌రి
(ఓ ఆటోడ్రైవ‌ర్ కొడుకు)

Comments

comments

Share this post

scroll to top