ఎన్నిక‌ల దంగ‌ల్‌లో కుల స‌మీక‌ర‌ణ‌లే కీల‌కం.!!

తెలంగాణ దంగ‌ల్‌లో కుల స‌మీక‌ర‌ణ‌లే కీల‌కం పోషించ బోతున్నాయి. మొత్తం 119 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల్లో అన్ని పార్టీలు గెలుపు కోసం ఉవ్విళ్లూరుతున్నాయి. ఈసారి జ‌ర‌గ‌బోతున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో అన్ని పార్టీలు కులాల వారీగా అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించారు. ఇందుకు ఏ ఒక్క పార్టీ మిన‌హాయింపు కాదు. రెడ్లు, వెల‌మ‌, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల‌కు ఎక్కువ సీట్ల‌ను పొందినా అధిక శాతం రెడ్ల‌కే ద‌క్కాయ‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. మ‌హాకూటమిగా ఏర్ప‌డిన పార్టీలు చావో రేవో తేల్చుకునేందుకు సిద్ద‌మ‌య్యాయి. సీట్ల కేటాయింపులో స‌యోధ్య కుద‌ర‌క పోవ‌డంతో ప్ర‌చారంలో కొంత ఆల‌స్యం జ‌రిగింది. ఓ ర‌కంగా ఆయా ఓట‌ర్ల‌ను ప్ర‌భావితం చేసేందుకు ఇబ్బంది ఏర్ప‌డింది. కొన్నేళ్లుగా కులాల వారీగా దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. పేరుకే సంఘాలుగా ఉన్న‌ప్ప‌టికీ అవ‌న్నీ పార్టీల‌కు, నేత‌ల‌కు జేబు సంస్థ‌లుగా పేరొందాయి. వారి వారి కులాల‌కు ఆధిప‌త్యం చెలాయిస్తున్న వాళ్లు ఇప్ప‌టికే బేరసారాల‌కు దిగుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లున్నాయి. ఎన్నిక‌ల సంఘం ఈ విష‌యంలో కొంచెం సీరియ‌స్‌గానే ఉన్నా గ్రామ స్థాయి నుండి ఢిల్లీ స్థాయి వ‌ర‌కు కులాలు, జాతులు, మ‌తాల వారీగా చీలిపోయిన వారే ముఖ్య భూమిక‌ను పోషిస్తూ వ‌స్తున్నారు.

Elections in telanagana

ఉమ్మ‌డి రాష్ట్రంలో కమ్మ‌, రెడ్లు ఆధిప‌త్యం వ‌హిస్తే..ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రంలో వెల‌మ‌లు త‌మ ప‌వ‌ర్‌ను చూపించారు. మై హోం రామేశ్వ‌ర్ రావు ఆప‌ద్ధ‌ర్మ సీఎం కేసీఆర్‌కు వెన్ను ద‌న్నుగా నిలిచారు. గ్లోబెల్ గురువుగా వినుతికెక్కిన చిన‌జీయ‌ర్ స్వామీజీ ఆశీస్సులు అందుకున్నారు. తిరిగి అధికారంలోకి వ‌చ్చేందుకు దీవించాల‌ని విన్న‌వించారు. ముదిరాజుల‌కు చేప పిల్ల‌ల పంపిణీ, చెరువుల్లో బ‌తుకు దెరువు క‌ల్పించేలా చ‌ర్య‌లు చేప‌ట్టారు. గొల్ల‌, కురుమ‌ల‌కు గొర్రెలు, మేక‌ల‌ను ఇచ్చేలా చూశారు. విశ్వ బ్రాహ్మ‌ణుల కోసం ప్ర‌త్యేకంగా విశ్వ బ్రాహ్మ‌ణ కార్పొరేష‌న్ ఏర్పాటు, క్రిష్ణ‌య‌న్ల కోసం , మైనార్టీల సంక్షేమం కోసం నిధులు కేటాయించారు. తెలంగాణ‌లో ఎంతో కొంత ఓటు బ్యాంకు క‌లిగిన ప్ర‌తి ఒక్క కులానికి ఏదో ఒక ప్ర‌యోజ‌నాన్ని చేకూర్చేలా కేసీఆర్ ప్ర‌ణాళిక త‌యారు చేశారు. ఆ దిశ‌గా సంక్షేమ ప‌థ‌కాల పేరుతో తాయిలాలు స‌మ‌ర్పించారు. ఇదంతా ఓ ఎత్తుగ‌డ‌. ఇండ్లు లేని వారికి డ‌బుల్ బెడ్ రూం ఇండ్లు కేటాయింపు. షాదీ ముబార‌క్ పేరుతో నేరుగా ముస్లిం పెండ్లి చేసుకునే జంట‌కు అమ్మాయి పేరుతో డ‌బ్బులందించ‌డం. రైతు బంధు ప‌థ‌కం పేరుతో రైతులు, కౌలు రైతుల‌కు పంట సాయం అందించ‌డం చేశారు. ఈ కార్య‌క్ర‌మం కింద పెద్ద‌, మ‌ధ్య త‌ర‌గ‌తి రైతుల‌కే ఎక్కువ లబ్ధి చేకూరింద‌న్న ఆరోప‌ణ‌లున్నాయి.

ఈసారి ఎలాగైనా స‌రే అధికారంలోకి రావాల‌ని కేసీఆర్ కంక‌ణం క‌ట్టుకున్నారు. ఇందు కోసం ప‌క్కా ప్లాన్ గీశారు. సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ఇక నియోజ‌క‌వ‌ర్గాల్లో బ‌రిలో నిలిచిన అభ్య‌ర్థులు మాత్రం గెలుపు కోసం నానా తంటాలు ప‌డుతున్నారు. కులాల వారీగా స‌భ‌లు, స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. కుల పెద్ద‌ల‌ను క‌లుస్తున్నారు. త‌మ‌కు ఓటు వేస్తే మ‌రిన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని హామీలు ఇస్తున్నారు. ఆయా సంఘాలకు భ‌వ‌నాలు నిర్మించేందుకు డ‌బ్బుల ఆశ చూపిస్తున్నారు.

మ‌రో వైపు మ‌హాకూట‌మిగా ఏర్ప‌డిన కాంగ్రెస్‌, టీడీపీలు సైతం కులాల వారీగా ఎలా ఓట్లు రాబ‌ట్టు కోవాలో ప్లాన్లు వేస్తున్నారు. విస్తృతంగా ఇల్లిల్లు తిరుగుతూ ఓట్లు వేస్తే మ‌రింత ప్ర‌యారిటీ ఇస్తామంటూ ప్ర‌చారం చేస్తున్నారు. అధికార పార్టీకి ధీటుగా గెలుపే ల‌క్ష్యంగా దూసుకెలుతున్నారు. కులాల వారీగా లెక్క‌లు వేస్తూ..ఏ కులానికి ఎన్నెన్ని ఓట్లు ఉన్నాయో లిస్టులు ప‌ట్టుకుని మీరే మాకు ఆప్తులంటూ వేడుకుంటున్నారు. ప్ర‌ధాన పార్టీల‌కు ధీటుగా బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎల్ ఎఫ్ కూడా ఆయా అభ్య‌ర్థులు, వారి అనుచ‌ర‌గ‌ణం, బంధుగ‌ణం, శ్రేయోభిలాషుల పేరుతో ఓట్లు రాబ‌ట్టుకునేందుకు నానా తంటాలు ప‌డుతున్నారు. పూర్తి సెక్యుల‌రిజం పేరు జ‌పిస్తున్న ఈ పార్టీల‌న్నీ ఓట్ల వ‌ర‌కు వ‌చ్చే స‌రిక‌ల్లా కులమే కీల‌కం అంటూ జ‌పం చేస్తున్నాయి.

మొత్తం మీద కుల స‌మీక‌ర‌ణ‌లు ప‌ని చేస్తాయా..లేక పార్టీలు అంద‌జేసే తాయిలాలు ప్ర‌భావం చూప‌నున్నాయా..అభ్య‌ర్థులు ఎలా గ‌ట్టెక్కుతారో కొద్ది రోజులు వేచి చూడాల్సిందే. బ‌ల‌మైన సామాజిక వ‌ర్గంగా ఉన్న బ‌హుజ‌నులు కేవ‌లం ఓటు బ్యాంకుగా చూడ‌డంతో ఆధిప‌త్య కులాల హ‌వా ఇంకా కొన్నేళ్ల పాటు కొన‌సాగుతూనే ఉంటుంద‌న్న వాస్త‌వాన్ని బ‌హుజ‌న మేధావులు హెచ్చ‌రిస్తున్నారు. ఎవ‌రు ఎన్ని ర‌కాలుగా వ్యాఖ్యానించినా కులాలు..స‌మీక‌ర‌ణ‌లే ప్ర‌ధాన పాత్ర పోషించ బోతున్నాయ‌న్న‌ది వాస్త‌వం.

Comments

comments

Share this post

scroll to top