డ‌బ్బింగ్ స్టార్స్.! వీలైతే నాలుగు మాటలు ,కుదిరితే కప్పు కాఫీ ….ఈ మాట‌లెవ‌రివో తెలుసా??

వీలైతే నాలుగు మాటలు ,కుదిరితే కప్పు కాఫీ..ఈ మాటలు,బొమ్మరిల్లులో జెనీలియా అల్లరి చాలా ఫేమస్..కానీ నిజానికి ఆ గొంతు డబ్బింగ్ ఆర్టిస్టు సవితా రెడ్డివి.. హీరోయిన్ సిమ్రాన్‌కు తెలుగు, తమిళ భాషల్లో ప్రతి సినిమాకూ దాదాపు తనే డబ్బింగ్ చెప్పిందనే విషయం ఎలా తెలుస్తుంది? రెడీ సినిమాలో జెనీలియాకు… మొన్ననే వచ్చిన ‘‘లయన్’’ సినిమాలో త్రిషకు కూడా ఆమెనే డబ్బింగ్ చెప్పిందనే అంశం తెలిసేది ఎలా? “బొమ్మాళీ నిన్నొదలా “అని రవిశంకర్ ఎంత ఫేమస్ అయ్యారో మనకు తెలుసు .రవిశంకర్ కెరీర్ అరుందతికి ముందు ,ఆ తర్వాత అనుకోవచ్చు అంతలా పేరు తెచ్చిపెట్టింది తన గొంతు … వీళ్లే కాదు తెర ముందు నటిస్తూ తెర వెనుక తోటి నటులకు గొంతు దానం చేసిన నటులు కూడా ఉన్నారు ,అదేవిధంగా తమ గొంతుతో చాలా ఫేమస్ అయిపోయిన  వారెవరో తెలుసుకోండి..

పాత తరం హీరోయిన్ సరిత డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించింది. ఒకవైపు కెరీర్ ఆదినుంచినే వరస హిట్లతో.. ఆ తరం యువతలో తనకంటూ ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకొన్న సరిత అదే సమయంలో తన తోటి హీరోయిన్లకు డబ్బింగ్ చెబుతూ వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు.. తమిళం నుంచి వచ్చిన అనేక మంది హీరోయిన్లకు సరిత డబ్బింగ్ చెప్పారు. సుజాత, సుహాసిని వంటి హీరోయిన్లకు అనేక సినిమాల్లో వాయిస్ ఇచ్చింది సరితే! అయితే ఆ సినిమాలను చూస్తున్నప్పుడు ఎక్కడా సరిత గుర్తుకు రాదు. మరీ పరిశీలనగా వింటే మాత్రం సరిత మాట్లాడుతున్న విషయం స్పష్టంగా అర్థం అవుతుంది.

‘‘ లేచిపోదామన్నామొనగాడా…’’ అంటూ గీతాంజలిలో కవ్వించే గొంతుతో రోహిణి ఆకట్టుకొంది. ‘‘ఇష్క్’’ సినిమాలో నితిన్ లేచిపోదామన్నావాళ్ల ఆంటీ రోల్‌లో కనిపించిన రోహిణి డబ్బింగ్ విషయంలో తనకంటూ ప్రత్యేక పుటలను కలిగి ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ ఒత్తిడి చేసి మరీ ‘‘శివ’’ సినిమాలో అమలకు డబ్బింగ్ చెప్పించుకొన్నాడట. అదీ రోహిణి వాయిస్ లో ఉన్న మహత్యం. ఇష్క్‌లో కూడా రోహిణి తన వాయిస్ తోనే ఆ పాత్రను సగం పండించింది!అలా మొదలైందిలో నానీ కి అమ్మగా నటించిన రోహిణి,ప్రముఖ నటుడు రఘువరన్ భార్యాభర్తలు.ఇకపోతే సినిమాలలో మనం వినే రఘువరన్ గొంతు ఎవరిదో తెలుసా  ‘బొమ్మాళీ’’ రవిశంకర్ ది.. ఎన్నో సినిమాలకు.. ఎన్నో పాత్రధారులకు గాత్రదానం చేస్తున్న రవి రఘువరన్ పాత్రకు వాయిస్ సిగ్నేచర్ అయ్యాడు.

ఇలా డబ్బింగ్ లో ప్రత్యేక పంథాను చాటిన సినీ నటుల్లో మరొకరు రేవతి. తెలుగులో కాదు కానీ.. తమిళంలో అనేక మంది హీరోయిన్లకు రేవతి డబ్బింగ్ చెప్పారు. ఆర్టిస్టుగా జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న రేవతి ఐశ్వర్యరాయ్‌తో సహా అనేక మంది ఉత్తరాది హీరోయిన్లకు తమిళ సినిమాల్లో డబ్బింగ్ చెప్పారు.

తెలుగులో టబుకు డబ్బింగ్ చెప్పడం ద్వారా ఎస్పీ శైలజ కొత్త కెరీర్‌ను ప్రారంభించారు. ‘‘నిన్నే పెళ్లాడతా’’ సినిమాలో టబుకు శైలజ డబ్బింగ్ చెప్పారు.గ్రీకువీరుడు అని టబూ నోటి నుండి వచ్చే మాట ఇప్పటికీ అభిమానులకు ,కుర్రాళ్లకు గిలిగింతలు పెడుతూనే ఉంటుంది. ఆ తర్వాత కృష్ణవంశీ మార్కు ఎమోషన్స్‌ను హీరోయిన్ల వాయిస్ లో పలికించడంలో శైలజ తన ప్రత్యేకతను నిరూపించుకొన్నారు. మురారి సినిమాలో సోనాలిబింద్రేకు ఈ గాయకురాలే డబ్బింగ్ చెప్పింది. అలాగే ‘‘ప్రియురాలు పిలిచింది’’  సినిమా డబ్బింగ్ వెర్షన్‌లో టబు పాత్రకు డబ్బింగ్ చెప్పింది కూడా శైలజనే. ఇక ఇదే సినిమా తమిళ వెర్షన్‌కు చియాన్ విక్రమ్ డబ్బింగ్ చెప్పారు. అప్పటికే నటుడిగా కొద్ది పాటి గుర్తింపు ఉండిన విక్రమ్ ఆ సినిమాలో అబ్బాస్ క్యారెక్టర్‌కు డబ్బింగ్ చెప్పాడు.

అచ్చం విక్రమ్ వలే.. కెరీర్ ఆరంభంలో డబ్బింగులు చెప్పిన వాళ్లలో ప్రముఖుడు రాజేంద్ర ప్రసాద్. మద్రాస్ లోని యాక్టింగ్ స్కూల్‌లో శిక్షణ పూర్తి చేసుకొన్న తర్వాత వేస్తే హీరో వేషాలే వేయాలని వేషాల కోసం తిరుగుతున్న సమయంలో.. అవకాశాలు దొరక్క.. తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్య రాజేంద్రుడు అనుకోకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా మారిపోయాడు. తమిళం నుంచి డబ్ అయ్యే కొన్ని వందల సినిమాలకు తనే డబ్బింగ్ చెప్పాడు. హీరో కాస్త బక్కగా.. రివటలా ఉంటే.. ఆ పాత్రకు రాజేంద్ర ప్రసాదే డబ్బింగ్ చెప్పిన పరిస్థితి అది. అప్పట్లో ఈ హీరో కూడా అలాగే బక్కగా ఉండటంతో మాడ్యులేషన్ బాగా సెట్ అయ్యింది.

మణిరత్నం డబ్బింగ్ సినిమా ‘‘ఓకే బంగారం’’లో హీరో దుల్కర్ సల్మాన్‌కు డబ్బింగ్ చెప్పింది ఎవరనుకుంటున్నారూ మన నేచురల్ స్టార్ నాని. . స్వతహాగా హీరోగా గుర్తింపు ఉన్న నాని మణిరత్నం సినిమాలో ఈ రకంగా భాగస్వామై ఆనందించాడు. మరి ఇదే సినిమాలో హీరోయిన్‌గా నటించిన నిత్యామీనన్ తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకొంటూ ఉంటుంది. విశేషం ఏమిటంటే.. నిత్య తన పాత్రకు తను మాత్రమే కాకుండా వేరే హీరోయిన్‌కు వాయిస్ ఇచ్చింది. మరీ విశేషం ఏమిటంటే ఆ సినిమాలో నిత్య కూడా నటించింది. తను హీరోయిన్ గా నటిస్తూ ‘‘గుండెజారి గల్లంతయ్యిందే’’ సినిమాలోని తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకొన్న నిత్య అదే సినిమాలో మరో హీరోయిన్ ఇషా తల్వార్‌కు కూడా డబ్బింగ్ చెప్పింది. బాగా పరిశీలిస్తేనే ఈ విషయం అర్థం అవుతుంది.  ఒకే సినిమాలో రెండు పాత్రలకు వాయిస్ ఇవ్వగలగడం..  వాటిలో ఎక్కడా పోలిక లేకుండా చూసుకోకపోవడం నిత్యామీనన్ ప్రతిభకు తార్కాణం.

సింగర్లు సునీత,చిన్మయి తమ పాటలతోనే కాదు మాటలతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.సునీతకు సింగర్‌గా ఉన్న గుర్తింపు, గ్లామర్లు.. ఆమెను సెలబ్రిటీ డబ్బింగ్ ఆర్టిస్టుగా చేశాయి. ఇక ‘‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’’ సినిమాలో సమీరారెడ్డికి డబ్బింగ్ చెప్పడం ద్వారా గుర్తింపు సంపాదించుకొన్న చిన్మయికి ఆ తర్వాత గౌతమ్ మీనన్ మరో సినిమా ‘‘ఏం మాయ చేశావే’’లో సమంతకు డబ్బింగ్ చెప్పడం ద్వారా స్టార్ అయిపోయింది.

వీరితో పాటు పెద్ద హీరోలకు డబ్బింగ్ చెప్పేవారి గురించి కూడా తెలుసుకుందాం.కమల్ హాసన్‌కు కెరీర్ ఆది నుంచి ఎస్పీబీ వాయిస్ అచ్చివచ్చింది. తెలుగులో సొంతంగా డబ్బింగ్ చెప్పుకొనే సత్తా ఉన్న కమల్ బిజీగా ఉన్నప్పుడు ఎస్పీబీతోనే డబ్బింగ్ చెప్పించుకొంటూ ఉంటాడు. అయితే ‘‘బ్రహ్మచారి’’ వంటి సినిమా విషయంలో మాత్రం కమల్‌కు మనో వాయిస్ సూపర్‌గా సెట్ అయ్యింది. ఆ పాత్ర వేషాధారణకు, మేనరిజమ్స్‌కు మనో స్వరం వందశాతం యాప్ట్ అయ్యింది. ఇక మనో వాయిస్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు సిగ్నేచర్ టోన్ అని వేరే చెప్పనక్కర్లేదు. ‘‘కథానాయకుడు’’ వంటి సినిమాకు మాత్రం రజనీకి ఎస్పీబీ డబ్బింగ్ చెప్పారు. అలాగే పాత డబ్బింగ్ సినిమాల్లో కార్తీక్ వంటి హీరోలకు ఘంటసాల రత్నకుమార్ డబ్బింగ్ చెప్పడం వినిపిస్తుంది. రాజశేఖర్ ప్రతి సినిమాలకు సాయికుమార్ డబ్బింగ్ చెప్తారన్న విషయం మనకు తెలిసిందే…

Comments

comments

Share this post

scroll to top