వ‌ర‌క‌ట్న వేధింపుల కార‌ణంగా 3 ఏళ్ల‌లో మృత్యువాత ప‌డిన 25వేల మంది బాధిత మ‌హిళ‌లు… ఇంకెప్పుడు ఇలాంటి దురాచారాలు ఆగేది..?

ఫ‌లానా రంగంలో ఆ దేశాన్ని మనం మించి పోతున్నాం. ఇంకో రంగంలో శ‌రవేగంగా అభివృద్ధి సాధిస్తున్నాం. మ‌రో రంగంలో అన్ని దేశాల‌తో పోటీ పడుతున్నాం. దాంట్లో అది సాధించాం, దీంట్లో అది సాధించాం… ఇలా అని మ‌నం గొప్ప‌లు చెప్పుకుంటున్నామే త‌ప్ప శ‌తాబ్దాల కాలం నాటి సాంఘిక దురాచారాల‌ను రూపుమాప‌డంలో మాత్రం ఇంకా వెనుకబ‌డే ఉన్నాం. నేటి ఆధునిక సాంకేతిక యుగంలోనూ ఇంకా ఇలాంటి ఆచారాలు త‌గ్గ‌లేదంటే అది మ‌న స‌మాజంలో నెల‌కొన్న ఓ జాడ్యంగానే భావించాలి. ప్ర‌ధానంగా వ‌ర‌క‌ట్నం తీసుకోవ‌డ‌మనే దురాచారం ఇప్ప‌టికీ త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలో వ‌ర‌క‌ట్నం పేరిట మ‌హిళ‌ల‌ను వేధింపుల‌కు గురి చేసే వారు కూడా అధిక‌మ‌య్యారు. దీంతో కేవలం గ‌త 3 ఏళ్ల కాలంలోనే ఏకంగా 25వేల మంది మ‌హిళ‌లు వ‌రకట్న వేధింపుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డమో లేదా చ‌నిపోవ‌డ‌మో జ‌రిగిందంటే ఈ దురాచార తీవ్ర‌త ఇంకా ఏవిధంగా ఉందో మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు.

కేంద్ర మంత్రి మేన‌కా గాంధీ ఇటీవ‌ల జ‌రిగిన పార్ల‌మెంట్ స‌మావేశాల్లో వ‌ర‌కట్న వేధింపుల‌కు గురైన బాధిత మ‌హిళ‌ల వివ‌రాల‌ను వెల్ల‌డించారు. 2012-14 మ‌ధ్య కాలంలో 25వేల మంది మ‌హిళ‌లు వ‌రకట్న వేధింపుల కార‌ణంగా ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డ‌మో, అత్తింటి వారు చంప‌డ‌మో జ‌రిగింద‌ట. ఇది చాలా దిగ్భ్రాంతిని క‌లిగించే విష‌యం. దీన్ని ఎంపీలంద‌రూ ఖండించారు. కాగా అదే స‌మ‌యంలో వ‌ర‌క‌ట్న వేధింపుల కేసులు 30వేల వ‌ర‌కు న‌మోద‌య్యాయి.

dowry-deaths

నేష‌న‌ల్ క్రైం రికార్డ్స్ బ్యూరో లెక్క‌ల ప్ర‌కారం 2012, 2013, 2014 సంవ‌త్స‌రాల్లో వ‌రుస‌గా 9038, 10709, 10050 కేసులు వ‌రక‌ట్న నిషేధ చ‌ట్టం 1961 కింద న‌మోదు కాగా, అందులో వ‌ర‌క‌ట్న వేధింపుల చావులు 8233, 8083, 8455గా న‌మోద‌య్యాయి. ఈ అంకెల‌ను బ‌ట్టి చూస్తే చాలు ఏటా ఈ దురాచ‌రం వ‌ల్ల ఎంత మంది మ‌హిళ‌లు బ‌ల‌వుతున్నారో తెలుస్తుంది. ఏటా వీరి సంఖ్య పెరుగుతుంది కానీ త‌గ్గ‌డం లేదు.

దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వ‌ర‌క‌ట్నాన్ని నిషేధించేలా చూసే ప్ర‌త్యేక అధికారులు ఉన్నా వారు ఆ దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్టు దాఖ‌లాలు ఏమీ క‌నిపించ‌డం లేదు. ప్ర‌భుత్వాలు ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్నా వ‌రక‌ట్న వేధింపుల కార‌ణంగా సంభ‌విస్తున్న మ‌హిళ‌ల మ‌ర‌ణాల‌ను మాత్రం ఆప‌లేక‌పోతున్నాయి. స‌మాజంలో చైత‌న్యాన్ని తీసుకువ‌చ్చేందుకు ఎన్నో కార్య‌క్ర‌మాలు చేప‌డుతున్నామ‌ని సంబంధిత అధికారులు చెప్పుకొస్తున్నాఅవి ఏమేర‌కు స‌త్ఫ‌లితాల‌నిస్తున్నాయో అది వారికే తెలియాలి. ఈ క్ర‌మంలో అస‌లు ఇలాంటి వేధింపులు, మ‌ర‌ణాలు ఇక‌పై ఆగుతాయా? అంటే అది కాల‌మే నిర్ణ‌యించాలి. అంతే త‌ప్ప‌, ఎవ‌రో వ‌స్తార‌ని, ఏదో చేస్తార‌ని ఎదురు చూస్తే అప్పుడు అడియాశే ఎదుర‌వుతుంది.

Comments

comments

Share this post

scroll to top