ఇక‌పై హోట‌ల్స్‌, రెస్టారెంట్ల‌లో మీకు న‌చ్చితేనే స‌ర్వీస్ చార్జి చెల్లించండి..!

వారాంతంలోనో లేదంటే న‌లుగురు స్నేహితులు లేదా ప్రత్యేక‌మైన వ్య‌క్తులు క‌లిసిన‌ప్పుడు, ఏదైనా వేడుక‌ను సెల‌బ్రేట్ చేసుకుంటేనో… లేదంటే మ‌రే ఇత‌ర సంద‌ర్భంలోనైనా చాలా మంది హోట‌ల్స్‌, రెస్టారెంట్స్‌లో భోజ‌నం చేస్తారు. అయితే ఎవ‌రు ఏ హోట‌ల్ లేదా రెస్టారెంట్‌కు వెళ్లినా అక్క‌డ మ‌నం తిన్న ఆహారంతోపాటు స‌ర్వీస్ చార్జి అని, వ్యాట్ అని ర‌క ర‌కాల ట్యాక్స్‌లు మ‌న‌పై వేసి వాటిని ముక్కు పిండి వ‌సూలు చేస్తారు. కొన్ని పెద్ద హోట‌ల్స్‌, రెస్టారెంట్ల‌లో ఈ చార్జిలు భారీగా ఉంటాయి. అస‌లు బిల్లు క‌న్నా ఆ చార్జిల మోతే ఎక్కువ‌. అయితే ఇక‌పై భోజ‌న ప్రియులు అలాంటి చార్జిల‌ను క‌ట్టాల్సిన ప‌నిలేద‌ట‌. వారి ఇష్టం ఉంటేనే క‌ట్ట‌వ‌చ్చ‌ట‌. అవును, మీరు విన్న‌ది నిజ‌మే. హోట‌ల్‌లో మ‌నం భోజ‌నం చేశాక వ‌చ్చే బిల్లులో ఉండే స‌ర్వీస్ చార్జిను క‌ట్టాల్సిన ప‌నిలేద‌ని, వినియోగ‌దారులు త‌మ‌కు న‌చ్చితేనే ఆ చార్జిను క‌ట్ట‌వ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం కొత్త‌గా ఆదేశాలు జారీ చేసింది.

service-charge-in-hotels

హోట‌ల్స్‌, రెస్టారెంట్స్‌ల‌లో వేస్తున్న బిల్లులు, వాటికి సర్వీస్ చార్జిలు అసంబ‌ద్దంగా ఉంటున్నాయని, కొంద‌రైతే ఏకంగా టిప్స్‌ను కూడా బిల్లుల్లోనే క‌లిపి వేస్తున్నారని కేంద్ర ఆహార పౌర సరఫరాల మంత్రిత్వశాఖకు కొంద‌రు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ క్ర‌మంలో ఆ ఫిర్యాదుల‌ను ప‌రిశీలించిన స‌ద‌రు మంత్రిత్వ శాఖ దేశ‌వ్యాప్తంగా ఉన్న హోట‌ల్స్‌, రెస్టారెంట్స్ య‌జ‌మానుల సంఘాల‌తో చ‌ర్చ‌లు జ‌రిపింది. దీంతో ఆ శాఖ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. అదేమిటంటే… ఇక‌పై ఎవ‌రైనా హోట‌ల్ లేదా రెస్టారెంట్‌కి వెళ్లి భోజ‌నం చేస్తే వ‌చ్చే బిల్లులో స‌ర్వీస్ చార్జి క‌ట్టాల్సిన ప‌ని లేద‌ట‌. ఒక వేళ ఎవ‌రైనా ఆ హోట‌ల్ లేదా రెస్టారెంట్ స‌ర్వీస్ న‌చ్చితే త‌మ ఇష్ట ప్ర‌కారం బిల్లుతోపాటు ఆ చార్జి క‌ట్ట‌వ‌చ్చ‌ని, ఇందులో బ‌ల‌వంతం ఏమీ లేద‌ని స‌ద‌రు శాఖ అధికారులు ఆర్డ‌ర్ జారీ చేశారు.

అయితే ఈ ఆదేశాలు వ‌చ్చాక కూడా ఎవ‌రైనా హోట‌ల్ య‌జ‌మానులు బ‌లవంతంగా స‌ర్వీస్ చార్జి వ‌సూలు చేస్తే త‌మ‌కు ఫిర్యాదు చేయాల‌ని ఆ శాఖ అధికారులు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం ప‌ట్ల చాలా మంది హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. అయితే ఇక్క‌డి వ‌ర‌కు బాగానే ఉన్నా ఒక వేళ మ‌నం నిజంగానే స‌ర్వీస్ చార్జి క‌ట్ట‌కుండా వెళ్తామంటే అప్ప‌టికే బిల్లు వ‌చ్చి ఉంటుంది క‌నుక హోట‌ల్స్ య‌జ‌మానులు దాన్ని అంగీక‌రిస్తారా? లేదా? అన్న విష‌యంలో మాత్రం ఎలాంటి స్ప‌ష్ట‌త లేదు. మ‌రి ఈ విష‌యంలో ఆ శాఖ అధికారులు ఏం చేస్తారో వేచి చూడాలి. ఏది ఏమైనా ఈ నిర్ణ‌యం కొంత వ‌ర‌కు జ‌నాల‌కు ఉప‌యోగ‌ప‌డేదే..! అవును క‌దా..!

Comments

comments

Share this post

scroll to top