తాడిని తన్నేవాడుంటే వాడి తల తన్నేవాడు ఇంకోడు ఉంటాడు అన్న చందంగా ప్రజలు ఎప్పటికప్పుడు జరుగుతున్న మోసాలను, దోపిడీలను తెలుసుకుని జాగ్రత్త పడుతున్నా, మోసం చేసే వారు కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు. అలాంటి వారు ఎప్పుడూ ఏదో ఒక విధంగా ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. అయితే ఇందుకు వ్యాపారస్తులు కూడా ఏమీ మినహాయింపు కాదు. ప్రధానంగా పెట్రోల్ బంకులు. అవును, పెట్రోల్, డీజిల్ కొట్టడంలో జరిగే మోసాన్ని ఎప్పటికప్పుడు వినియోగదారులు తెలుసుకుంటూనే ఉన్నారు. జాగ్రత్త పడుతూనే ఉన్నారు. అయినా ఆ మోసాలు ఆగడం లేదు. ఈ క్రమంలో పెట్రోల్ బంకుల్లో తాజాగా జరుగుతున్న ఓ మోసం గురించి మీరే తెలుసుకోండి..!
సాధారణంగా ఎవరైనా, ఏ వాహనంలోనైనా పెట్రోల్ లేదా డీజిల్ దేన్ని కొట్టించినా రూ.50, రూ.100, రూ.200, రూ.300, రూ.500 ఇలా రౌండ్ ఫిగర్స్ వచ్చేటట్టు కొట్టిస్తారు. అందుకు కారణాలు కూడా లేకపోలేదు. చిల్లర, అవును అదే. చిల్లర దొరకదనే కారణంగా ఎవరైనా రూ.50 లేదా రూ.100 నోట్ల గుణకంతో పెట్రోల్ లేదా డీజిల్‌ను కొట్టించుకుంటారు. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు మోసం చేస్తే పసిగడుతున్నారన్న కారణంగా ఇప్పుడు కొందరు పెట్రోల్ బంకుల యజమానులు కొత్త తరహా మోసానికి పూనుకున్నారు. అదేమిటంటే…
పైన చెప్పినట్టుగా మనం రౌండ్ ఫిగర్స్‌తో పెట్రోల్ కొట్టిస్తామని అందరికీ తెలుసు కదా. ఈ క్రమంలో పెట్రోల్ బంకు యజమానులు కూడా దాన్ని ఆసరాగా తీసుకుని వినియోగదారులు ఒక వేళ రౌండ్ ఫిగర్స్ తో పెట్రోల్, డీజిల్ కొట్టించుకుంటే 50 ఎంఎల్ నుంచి 200 ఎంఎల్ వరకు తక్కువ వచ్చేట్టు ముందుగానే మిషన్‌లో సెట్ చేసి ఉంచుతున్నారట. ఈ క్రమంలో రౌండ్ ఫిగర్స్‌లో పెట్రోల్, డీజిల్ పోయించుకుంటే వినియోగదారులకు ముందు చెప్పినట్టుగా కొంత పెట్రోల్, డీజిల్ తక్కువగా వస్తోంది. ఈ విషయంపై ఇప్పుడిప్పుడే సోషల్ మీడియాలోనూ వార్తలు గుప్పుమంటున్నాయి. కాబట్టి వినియోగదారులారా..! జాగ్రత్త పడండి. రౌండ్ ఫిగర్స్‌లో మాత్రం పెట్రోల్ పోయించకండి. రూ.60, రూ.110, రూ.220, రూ.310, ఇలా రౌండ్ ఫిగర్స్ లేకుండా పెట్రోల్ కొట్టించండి. దీంతో బంకు యజమానుల మోసాల నుంచి తప్పించుకోవచ్చు.