న‌ల్ల‌గా ఉంటే బాధ ప‌డ‌న‌క్క‌ర లేదు… సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన అన్‌ఫెయిర్ అండ్ లవ్లీ క్యాంపెయిన్‌…

‘మా కంపెనీ క్రీం వాడితే న‌ల్ల‌గా ఉన్న మీరు కేవ‌లం కొద్ది రోజుల్లోనే తెల్ల‌గా అయిపోతారు… మా క్రీంలో మీ ముఖాన్ని తెల్ల‌గా చేసే ఎన్నో ఔష‌ధ గుణాలు ఉన్నాయి… మా క్రీం వాడితే మీరు తెల్ల‌గా అవుతారు, దాంతో మీలో ఉన్న ఆత్మ‌విశ్వాసం పెరిగి ఏదైనా చేయ‌గ‌లుగుతారు, సాధించ‌గ‌లుగుతారు…’ ఏంటివ‌న్నీ… ఇప్పుడు ఈ డైలాగ్స్ చెబుతున్నారెందుకు? అని అడగ‌బోతున్నారా..? అయితే ఆ డైలాగ్‌ల‌ను ఒక‌సారి జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించండి. గ‌మ‌నించారా, అవేమిటో గుర్తు ప‌ట్టారా? అవేనండీ, నిత్యం మ‌నం టీవీలో చూసే బ్యూటీ క్రీం యాడ్స్ అన‌బోతున్నారా? అయితే మీరు చెప్పేది క‌రెక్టే. రోజూ టీవీలోనే చూడ‌లేక‌పోతున్నాం, మ‌రి వాటి గురించి ఇప్పుడెందుకు అంటున్నారా? అయితే మీరు విసుగు చెందినా స‌రే, వాటి గురించి ఇప్పుడు చెప్పాల్సిందే. ఎందుకంటే టాపికే వాటి గురించి కాబ‌ట్టి.

instagram-unfairandlovely

అందంగా, తెల్ల‌గా మార‌వ‌చ్చ‌ని చెబుతూ ర‌క ర‌కాల కంపెనీలు ఎన్నో క్రీంలను, పౌడ‌ర్‌ల‌ను ప్ర‌జ‌ల‌కు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నాయి. వాటిని వాడితే నిజంగా అందంగా, తెల్ల‌గా అవుతార‌న్న గ్యారంటీ లేదు. అయినా ఆయా కంపెనీలు ఇచ్చే ఆక‌ర్ష‌ణీయ‌మైన ప్ర‌క‌ట‌న‌లకు, వాటిలో న‌టించే వారి హావ‌భావాల‌కు, అంద‌చందాల‌కు ఆక‌ర్షితులై బ్యూటీ క్రీంలు, పౌడ‌ర్‌ల‌ను కొనుగోలు చేస్తున్నారు. దీని వ‌ల్ల కంపెనీలు లాభాలు గ‌డిస్తున్నాయే కానీ వాటిని వాడిన వారు అందంగా మారిన దాఖ‌లాలైతే లేవు. ఈ క్ర‌మంలో ‘మ‌న‌కు పుట్టుక‌తో వ‌చ్చిన స‌హ‌జ‌మైన రంగే ముఖ్య‌మైంద‌ని, దాన్నే మ‌న‌కు వ‌చ్చిన నిజ‌మైన రంగు అని భావించాల‌ని, మ‌నుషుల అందం ముఖంలో, రంగులో ఉండ‌ద‌ని, అది మన‌స్సులో మాత్ర‌మే ఉంటుంద‌ని చాటి చెబుతూ ఇన్‌స్టాగ్రాంలో ‘అన్‌ఫెయిర్ అండ్ ల‌వ్లీ (#unfairandlovely)’ పేరిట ఓ హాష్‌ట్యాగ్ క్యాంపెయిన్ ర‌న్ అవుతోంది. అమెరికా లోని టెక్సాస్ ప్రాంతానికి చెందిన పాక్స్ జోన్స్‌ అనే ఓ లేడీ ఫొటోగ్రాఫ‌ర్ దీన్ని ప్రారంభించింది.

dark-skin

ఈ హాష్‌ట్యాగ్‌తో డార్క్ స్కిన్ క‌ల‌ర్ ఉన్న మ‌హిళ‌లు ఎవ‌రైనా త‌మ ఫొటోల‌ను పోస్ట్ చేయ‌వ‌చ్చు. అందంగా క‌నిపించాల‌నే క్రీంల‌ను వాడాల్సిన ప‌నిలేద‌ని, పుట్టుక‌తో వ‌చ్చిన రంగు ఏదైతే ఉంటుందో దాన్నే ఉంచుకోవాల‌ని, న‌ల్ల‌గా ఉన్నార‌ని అవ‌హేళ‌న చేసే వారికి చెంప పెట్టులా ఫొటోలను పోస్ట్ చేయాల‌ని అందులో ఫొటోల‌ను ఉంచుతున్న మ‌హిళ‌లు త‌మ త‌మ సందేశాల‌ను పెద్ద ఎత్తున వినిపిస్తున్నారు. న‌ల్ల‌గా ఉన్న వారిని స‌మాజం చూసే ధోర‌ణిలో మార్పు రావాల‌ని వారు త‌మ గ‌ళం వినిపిస్తున్నారు. ‘చ‌ర్మాన్ని తెల్ల‌గా క‌నిపించేలా చేసుకోండి’ అంటూ త‌మ‌కు స‌ల‌హాలు కూడా ఇవ్వ‌వ‌ద్ద‌ని, తాము త‌మ ఒరిజిన‌ల్ క‌ల‌ర్‌తో అలాగే ఉంటామ‌ని వారు సోష‌ల్ మీడియాలో ఆ హాష్‌ట్యాగ్‌కు అనుసంధానంగా పోస్ట్‌లు పెడుతున్నారు. సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్ల‌లో ఇప్పుడీ హాష్‌ట్యాగ్ వైర‌ల్‌గా మారింది. అంతేగా మరి, నిజంగా ఆ క్రీంలు, పౌడ‌ర్‌ల‌కు మ‌నుషులను తెల్ల‌గా మార్చేలా చేసే గుణ‌మే ఉంటే ఇప్పుడీ లోకంలో అంద‌రూ తెల్ల‌గానే ఉండేవారు. మ‌రి అంద‌రూ అలా లేరెందుకు? అంటే… అది… మీకు అర్థ‌మైంది క‌దా!

Comments

comments

Share this post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

scroll to top