ఒకప్పుడంటే ఏదైనా వస్తువు కొనాలంటే నాలుగు షాపులు తిరిగో లేదంటే ఎవరో చెబితేనో ఆ వస్తువును పరీక్షగా చూసి మరీ కొనుగోలు చేసేవాళ్లం. కానీ ఇప్పుడంతా ఆన్లైన్ మయం. మరి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఏదైనా వస్తువు నాణ్యంగా ఉందో, లేదో ఎలా తెలుసుకోవడం? ఇక్కడే యూజర్ రేటింగ్ కీలక పాత్ర పోషిస్తుంది.
ఆన్లైన్లో ఏదైనా ఈ-కామర్స్ సైట్లో మనం కొనుగోలు చేయాలనుకున్న వస్తువును ముందే కొందరు కొనుగోలు చేసి ఉంటారు కదా. ఆ, అవును వారే. వారు ఆ వస్తువు ఎలా ఉందో సదరు వెబ్సైట్లో తమ రివ్యూ, రేటింగ్‌ను ఇస్తారు. ఆ వస్తువు బాగుంటే 5 పాయింట్లకు గాను 5 లేదా 4, యావరేజ్ క్వాలిటీ అయితే 3, ఇక అస్సలు బాగోకపోతే 2, 1 … ఇలా రేటింగ్ ఇస్తారు. దీంతో అలా యూజర్లు ఏదైనా నిర్దిష్ట వస్తువుకు ఇచ్చిన రేటింగ్స్ అన్నింటినీ చూసి కొందరు ఆ వస్తువును కొనాలో వద్దో నిర్ణయించుకుంటారు. అంటే రేటింగ్ బాగుంటే ఆ వస్తువు బాగుంటుందని, లేకపోతే అస్సలు బాగోదని అర్థం అన్నమాట. అయితే ఇది ఎంతమాత్రం నిజం కాదని అంటున్నారు ఆ శాస్త్రవేత్తలు.
అమెరికాలోని కొలరాడో బౌల్డర్ యూనివర్సిటీ పరిశోధకులు కొందరు 120 విభాగాలకు చెందిన దాదాపు 1272 వస్తువుల ఆన్లైన్ యూజర్ రేటింగ్‌లు, ఆఫ్‌లైన్‌లో వాటి నాణ్యత, ధర ఇలా పలు అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేశారు. చివరిగా తెలిసిందేమిటంటే ఈ-కామర్స్ సైట్లలో ఏదైనా ఒక వస్తువు యొక్క నాణ్యత, ప్రదర్శన అనేది యూజర్ రేటింగ్ మీద ఆధార పడదని తెలిసింది. ఆ వస్తువుకు సంబంధించిన కంపెనీ పేరు, వ్యాపార రంగంలో ఆ కంపెనీకి ఉన్న ప్రాధాన్యత, అంతకు ముందు తయారు చేసిన వస్తువుల ధరలు, ఉత్పాదకత వంటి అంశాలే ఏదైనా వస్తువు యొక్క క్వాలిటీని నిర్ణయిస్తాయని తెలిసింది. అంతేకానీ ఆయా సైట్లలో అమ్మే వస్తువులకు సంబంధించి యూజర్లు ఇచ్చే రేటింగ్‌లో కచ్చితత్వం ఉండదని వారు తేల్చేశారు. సో, ఇక మీదట ఆన్లైన్లో మీరు ఏదైనా వస్తువును కొనాలనుకుంటే దాని యూజర్ రేటింగ్‌ను కాక, ఆ కంపెనీ పేరు, బ్రాండ్ నేమ్ వంటి వాటిని చూసి కొనుగోలు చేయండి. అలాగే చేస్తారుగా!