ఆఫీస్ కంప్యూటర్లో ఈ పనులు చేస్తున్నారా..? అయితే కష్టాలు తప్పవు…!

ఒకప్పుడంటే ఉద్యోగులు ఎక్కువగా ఫైల్స్‌పై వర్క్ చేసే వారు. కానీ ఇప్పుడలా కాదు. టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో అనేక కంపెనీలు తమ పనులను కంప్యూటర్ల ద్వారా చక్కబెట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఉద్యోగులు వాటిపై పనిచేయాల్సి వస్తోంది. అయితే అంత వరకు ఓకే. కానీ కంపెనీకి చెందిన కంప్యూటర్‌పై పనిచేసే సమయంలో మాత్రం ఉద్యోగులు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కనుక ఆ జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. ఆఫీసులో కంప్యూటర్లను వాడుతున్నప్పుడు ఉద్యోగులు తమ వ్యక్తిగత అకౌంట్లకు చెందిన పాస్‌వర్డ్‌లను ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిలో సేవ్ చేయరాదు. అలా చేస్తే ఉద్యోగుల పాస్‌వర్డ్‌లను ఎవరైనా సులభంగా తెలుసుకునేందుకు అవకాశం ఉంటుంది. దీంతో వారి సమాచారం తస్కరించబడుతుంది. ఆపైన నష్టం కలిగితే భరించక తప్పదు. కనుక వర్క్ ప్లేస్ కంప్యూటర్లలో ఉద్యోగులు తమ వ్యక్తిగత అకౌంట్లకు చెందిన పాస్‌వర్డ్‌లను సేవ్ చేయరాదు.

2. ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి సోషల్ సైట్లను ఉద్యోగులు తమ పనివేళల్లో వాడడం సహజమే. అయితే అలా చేయడం వల్ల కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఎందుకంటే ఉద్యోగుల కన్నా ఉన్నత స్థాయిలో ఉండే వారు వాటిని చూస్తే అప్పుడు జాబ్‌కే ముప్పు వచ్చే ప్రమాదం ఉంటుంది. దీనికి తోడు తోటి ఉద్యోగులు ఎవరైనా ఈ అంశాన్ని సాకుగా చూపి ఉన్నత స్థాయి అధికారులకు ఫిర్యాదు కూడా చేసేందుకు అవకాశం ఉంటుంది. కనుక వర్క్‌ప్లేస్‌లో అలాంటి సోషల్ సైట్లను వాడడం మానేస్తే మంచిది.

3. ఆఫీసులో కంప్యూటర్లను వాడుతున్న సమయంలో ఉద్యోగులు బ్యాంకింగ్ లావాదేవీలు చేస్తే జాగ్రత్త వహించాలి. వారి క్రెడిట్, డెబిట్ కార్డులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సమాచారాన్ని ఆ కంప్యూటర్‌లో సేవ్ చేయరాదు. అలా చేస్తే ఇతరులకు ఉద్యోగుల వివరాలు తెలిసేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు డబ్బు నష్టపోతే బాధపడీ ప్రయోజనం ఉండదు.

4. వేరే ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులకు ఉద్యోగులు తమ తమ ఆఫీస్ కంప్యూటర్లను రిమోట్ కనెక్షన్ కోసం ఇవ్వకూడదు. అలా ఇస్తే ఉద్యోగుల ఆఫీస్‌కు చెందిన ముఖ్యమైన వివరాలను హ్యాకర్లు తస్కరించేందుకు అవకాశం ఉంటుంది. అప్పుడు కంపెనీకి భారీ నష్టం కలిగేందుకు ఆస్కారం ఉంటుంది. కనుక ఇతరులెవరికీ ఆఫీస్ కంప్యూటర్‌ను రిమోట్‌గా ఆపరేట్ చేసేందుకు వీలు ఇవ్వకూడదు.

5. ఆఫీస్‌కు చెందిన కంప్యూటర్‌లో ఆఫీస్ పని కాకుండా ఇతరులకు చెందిన పని కూడా చేయకూడదు. ఒక వేళ ఆ పీసీలో ఉద్యోగి డేటా అంతా రికార్డ్ అయితే అప్పుడు ఆ ఉద్యోగికే ఇబ్బందులు ఎదురవుతాయి. అది జాబ్ కోల్పోయేందుకు కూడా దారి తీస్తుంది.

Comments

comments

Share this post

scroll to top