పాముతో పోరాడి 7 ఏళ్ల చిన్నారిని రక్షించిన జర్మన్ షెఫర్డ్ కుక్క 'హాస్'…

తోటి మనుషుల ద్వారా సహాయం పొందిన ఇతర మనుషులే ఆ సహాయం చేసిన వారిని మరిచిపోతున్న రోజులివి. అంతెందుకు, నేడు రక్త సంబంధాలు కూడా వ్యాపారమయమై పోయాయి. ఈ నేపథ్యంలో తోటి మనుషులపై ఇతరులు నమ్మకం కూడా కలిగి ఉండడం లేదు. కానీ ఆ కుక్క మాత్రం అలా కాదు. తనను పెంచిన యజమానులపై అచంచలమైన విశ్వాసాన్ని చూపించింది. ఈ క్రమంలో తన ప్రాణం మీదకు వచ్చినా ఆ శునకం ఏ మాత్రం తగ్గలేదు. శత్రువుపై పోరాడి విజయం సాధించింది. ఓ చిన్నారిని కాపాడింది. ప్రస్తుతం ఆ కుక్క వెటర్నరీ హాస్పిటల్‌లో చికిత్స పొందుతోంది. దాని పేరు ‘హాస్’.

haus

అమెరికాలో నివాసం ఉండే డెలూకా కుటుంబ సభ్యులు ‘హాస్’ అనే పేరు గల జెర్మన్ షెఫర్డ్ జాతికి చెందిన ఓ కుక్కను దాని చిన్నప్పటి నుంచి పెంచుతున్నారు. ఇప్పుడు ఆ కుక్క వయస్సు 2 సంవత్సరాలు. కాగా గత బుధవారం మధ్యాహ్నం సమయంలో డెలూకా కుటుంబంలోని మాలీ అనే ఓ ఏడేళ్ల చిన్నారి తన బామ్మతో కలిసి తమ ఇంట్లో వెనుక వైపు ఉన్న తోటలో ఆడుకుంటోంది. ఆ సమయంలో అత్యంత విషపూరితమైన ర్యాటిల్ స్నేక్ ఒకటి అక్కడికి చర చరా పాక్కుంటూ వచ్చి మాలీని కాటు వేయబోయింది. అయితే హాస్ ఆ పాముతో పోరాడి చిన్నారిని రక్షించింది. ఈ క్రమంలో హాస్‌ను ఆ పాము 3 సార్లు కరిచింది. దీంతో హాస్ స్పృహ తప్పి పడిపోయింది.

haus

హాస్‌ను వెంటనే డెలూకా కుటుంబీకులు వెటర్నరీ హాస్పిటల్‌కు తరలించారు. పాము 3 సార్లు కాటు వేయడంతో పెద్ద ఎత్తున విషం హాస్ శరరీంలోకి చేరింది. ఓ దశలో హాస్ చనిపోతుందని అంతా భావించారు. కానీ అదృష్టవశాత్తూ హాస్ అపాయం నుంచి బయట పడింది. ఇప్పుడు హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ క్రమంగా కోలుకుంటోంది. అయితే హాస్ చికిత్సకు డబ్బు బాగా ఖర్చవుతుండడంతో డెలూకా కుటుంబ సభ్యులు దాతల నుంచి విరాళం సేకరించసాగారు. హాస్ చూపిన ధైర్యానికి, చేసిన సాహసానికి ఆశ్చర్యపోయిన ప్రజలు, దాతలు తమ వంతుగా విరాళాలను అందిస్తున్నారు. ఇప్పుడు హాస్ అక్కడ చాలా ఫేమస్ అయిపోయింది. మరి కొద్ది రోజుల్లో హాస్పిటల్ నుంచి హాస్ డిశ్చార్జి అయి తన యజమానుల దగ్గరికి వెళ్లనుంది. ఏది ఏమైనా హాస్ చూపిన విశ్వాసానికి, చేసిన సాహసానికి ఆ వండర్ డాగ్‌ను నిజంగా మనం మెచ్చుకోవాల్సిందే. ఏమంటారు!

Comments

comments

Share this post

scroll to top