కాలంలో ప్రయాణించడం గురించి మీకు తెలుసా? ఆ తెలియకేముందీ, దాని గురించి అనేక సినిమాల్లో చూశాం అంటారా! అవును, మీరు చెప్పింది కరెక్టే. కాలంలో ప్రయాణించడం గురించి అనేక సినిమాలే వచ్చాయి. అందులోని నటులంతా ఓ ప్రత్యేకమైన మిషన్ ద్వారా భూత, భవిష్యత్ వర్తమాన కాలాలకు అలవోకగా ప్రయాణం చేస్తారు. ఆయా కాలాల్లో వారు ప్రయాణిస్తూ ఎన్నో సాహసాలు చేస్తూ ఎంజాయ్‌గా తిరుగుతారు కూడా. అయితే అవన్నీ నిజ జీవితంలో మాత్రం అసలు జరగని పని. సైన్స్, టెక్నాలజీ ఇప్పుడు ఎంతగా అభివృద్ధి చెందినా ఇప్పటి వరకు అలా కాలంలో ప్రయాణించే యంత్రాలను మాత్రం ఎవరూ కనిపెట్టలేకపోయారు. కానీ చరిత్రలో ఎంతో ప్రాచీన కాలంలో జరిగిన కొన్ని సంఘటనలను చూస్తే నిజంగా కాలంలో ప్రయాణించడం నిజమేననిపిస్తుంది. అలాంటి సంఘటనల గురించే ఇప్పుడు తెలుసుకుందాం.
హిందూ పురాణాల ప్రకారం ఒకానొకప్పుడు రైవతా కుకుడ్మిఅనే రాజు ఉండేవాడట. అతను బ్రహ్మ దేవున్ని కలవడం కోసం కాలంలో ప్రయాణించాడని చెబుతారు. అలా అతను వెళ్లి మళ్లీ భూమికి తిరిగి వచ్చే క్రమంలో దాదాపు 108 యుగాలు గడిచిపోయాయట. ఒక యుగం 40 లక్షల ఏళ్ల పాటు ఉంటుందని, ఇది ఆయా లోకాల్లో వివిధ రకాలుగా మారుతుందని చరిత్రకారులు, పండితులు చెబుతున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని చూస్తే రైవతుడు ఎన్ని లక్షల ఏళ్లు కాలంలో ప్రయాణించాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.
ప్రాచీన రోమన్ల కాలంలో 7 మంది క్రిస్టియన్ పురుషులు స్థానికంగా నెలకొన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఒక అడవిలోని కొండ గుహలో తలదాచుకునేందుకు వెళ్లారట. అలా వారు ఓ రోజు వెళ్లి ఆ రాత్రి పూట ఆ గుహలో నిద్రించారట. వారు తెల్లవారు జామున లేచే సరికి 200 ఏళ్లు గడిచిపోయాయట. అప్పటికీ అంతా మారిపోయి అందరూ కలసి మెలసి ఉన్నారట. ఈ క్రమంలో ఆ 7 మంది ఆ గుహలోనే చనిపోయారట. కాగా టర్కీలోని పనయిర్దాగ్ (Panayirdag) ప్రాంతంలో ఉన్న ఓ గుహలో ఇప్పటికీ ఆ 7 మంది వ్యక్తులకు చెందిన ఆనవాళ్లు ఉన్నాయట.
క్రీ.శ.250వ సంవత్సరంలో కొంత మంది క్రిస్టియన్లు కొందరు దుండగుల చేతిలో దాడికి, చిత్రహింసలకు గురవగా వారిని క్రీస్తే స్వయంగా అల్-కాఫ్ అనే పేరున్న ఓ గుహలో ఉంచి సంరక్షించినట్టు ఓ గ్రంథంలో ఉందట. అలా ఆ గుహలో ఉన్న వారు ఒక రోజు నిద్రించగా మరుసటి రోజు వారు లేచి చూసే సరికి అప్పటికే 309 ఏళ్లు గడిచిపోయాయట.
జపాన్ లోనూ కాలంలో ప్రయాణించిన ఓ వ్యక్తి కథ ప్రచారంలో ఉంది. ఉరషిమా టారో (Urashima Taro) అనే చేపలు పట్టే వ్యక్తి ఒకతను తమ సముద్ర దేవున్ని చూడడం కోసం సముద్రగర్భంలో అత్యంత లోతుకి వెళ్లాడట. అలా అతను అక్కడికి వెళ్లి వచ్చేటప్పటికి 300 ఏళ్లు గడిచిపోయాయట. ఈ క్రమంలో అతని కుటుంబమంతా కనిపించడకుండా పోవడంతోపాటు అతను ఉన్న ప్రదేశం కూడా పూర్తిగా మారిపోయిందట. కానీ అతనికి మాత్రం కేవలం 3 రోజులు మాత్రమే గడిచినట్టు అనిపించిందట.