చొక్కాలు ధరించడం అనేది ఇప్పటి మాట కాదు. ఎప్పటి నుంచో వాటిని మనం ధరిస్తున్నాం. ఆ మాటకొస్తే అవి అసలు ఎప్పుడు, ఎక్కడ, ఎలా వాడుకలోకి వచ్చాయో మనకు తెలీదు. కానీ ఫ్యాషన్ ప్రపంచంలో అవి చలామణీ అవుతూనే ఉన్నాయి. ఒకప్పుడంటే వేరే కానీ, ఇప్పుడు ఆడ, మగ ప్రతి ఒక్కరూ షర్ట్స్ ధరిస్తున్నారు. అయితే ఇప్పుడు చెప్పబోయేది కూడా షర్ట్స్‌కు సంబంధించిన ఓ మ్యాటరే. అదేమిటంటే…
మీరెప్పుడైనా చొక్కా వెనుక భాగంలో కాలర్ కింద ఓ ఉచ్చులాంటి అమరికను చూశారా? చూసే ఉంటారు లెండి. కానీ దాని గురించి తెలిసి ఉండదు. చిత్రంలో చూపించాం కదా. అదే. అసలు ఆ ఉచ్చును షర్ట్ వెనుక ఎందుకు పెడతారో తెలుసా? తెలీదా? అయితే దానికి ఓ రీజన్ ఉంది. అదేమిటో ఇప్పుడు చూద్దాం.
ఇప్పుడంటే కప్ బోర్డులు, బీరువాలు, హ్యాంగర్ల వంటి వస్తువులు మనకు దుస్తులను తగిలించుకునేందుకు అందుబాటులో ఉన్నాయి, కానీ ఒకప్పుడు అస్సలు ఇవి లేవట. ఆ కాలంలో చొక్కాలను కుట్టినప్పుడు అందుకే వాటి వెనుక భాగంలో కాలర్ కిందుగా అలాంటి ఉచ్చును పెట్టేవారట. ఆ ఉచ్చు ఉండడం వల్ల ఏ మేకుకో చొక్కాను తగిలించేవారట. కానీ ఇప్పుడు రకరకాల హ్యాంగర్లు మనకు అందుబాటులోకి వచ్చినా ఆ ఉచ్చు అనేది అలాగే కొనసాగుతోంది. దీంతో ఇప్పటి వారు అధిక శాతం మంది దాన్ని ఒక ఫ్యాషన్ అని భావిస్తున్నారట.
1960లలో చొక్కాలకు ఇలా ఉచ్చు పెట్టి కుట్టడం ప్రారంభించారట. మొదటగా అమెరికాలో ఈ ట్రెండ్ రాగా అనంతరం అది ఇతర దేశాలకూ వ్యాపించిందట. కాగా ఈ ఉచ్చులను లాకర్ లూప్స్, ఫ్రూట్ లూప్స్ అని కూడా పిలుస్తారట. అయితే కొంత మందికి మాత్రం ఇవంటే అస్సలు ఇష్టం ఉండదట. అందుకే వారు షర్ట్స్‌ను కొన్న వెంటనే వాటిని తీసివేస్తారట. ఇప్పుడు తెలిసిందా, చొక్కా ఉచ్చు వెనుక ఉన్న అసలు కథా కమామీషు!