చక్కెర అనగానే…మనకు ఈమె పేరు గుర్తుకురావాలి.! ఎందుకో తెలుసా?

ఆమె పేరు చెబితే వృక్షాలు పుల‌కించిపోతాయి. మొగ్గ‌లు పువ్వుల్లా చిగురిస్తాయి. చ‌క్కెర తీపిద‌నం నోటికి త‌గిలిన‌ప్పుడ‌ల్లా ఆమె పేరే మ‌న‌కు గుర్తుకు వ‌స్తుంది. ఆమే, ఎడ‌వ‌లెత్ క‌క్క‌త్ జానకి అమ్మాల్. బోట‌నీ (వృక్ష‌శాస్త్రం)లో పీహెచ్‌డీ చేసిన మొద‌టి భార‌త‌ మ‌హిళగానే కాదు, ప‌ద్మ‌శ్రీ అందుకున్న భార‌త మ‌హిళా సైంటిస్టుల్లో ఈమే మొద‌టి స్థానంలో నిలుస్తుంది. అప్ప‌ట్లో మ‌హిళ‌లు హై స్కూల్ చ‌ద‌వులు చ‌ద‌వ‌డ‌మే గొప్ప‌. అలాంటిది ఈమె ఏకంగా పీహెచ్‌డీ చేసింది, అదీ అమెరికాలోని ప్ర‌ముఖ యూనివ‌ర్సిటీలో. అంతే కాదు తాను ఎంచుకున్న రంగంలో అద్భుతాలు చేసి చూపింది.

janaki-ammal

జాన‌కి అమ్మాల్ 1897లో నవంబ‌ర్ 4న కేర‌ళ‌లోని తెలిచెరీ (ఇప్పుడు త‌ల‌సెరి) లో జ‌న్మించింది. ఆమె తండ్రి దివాన్ బ‌హ‌దూర్ ఏక్ క్రిష్ణ‌న్‌, అప్ప‌టి మ‌ద్రాస్ కోర్టులో స‌బ్ జ‌డ్జి. అత‌నికి ఇద్ద‌రు భార్య‌లు. శార‌ద‌, దేవీ అమ్మాల్‌లు. మొత్తం అత‌నికి 19 మంది పిల్ల‌లు. మొద‌టి భార్య శార‌ద‌కు ఆరుగురు జ‌న్మించ‌గా, రెండో భార్య దేవీ అమ్మాల్‌కు 13 మంది జ‌న్మించారు. వారిలో 10వ సంతాన‌మే జాన‌కి అమ్మాల్‌. ఈమె తెలిచెరీలో పాఠ‌శాల విద్య‌ను అభ్య‌సించింది. అనంత‌రం మ‌ద్రాస్‌లోని క్వీన్స్ మేరీ కాలేజ్ నుంచి బ్యాచిల‌ర్స్ డిగ్రీ, 1921లో ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి బోట‌నీలో హాన‌ర్స్ డిగ్రీ పొందింది. ఓ వైపు వుమెన్స్ క్రిస్టియ‌న్ కాలేజీలో అధ్యాప‌కురాలిగా ప‌నిచేస్తూనే ప్ర‌ఖ్యాత మిచిగ‌న్ యూనివ‌ర్సిటీ నుంచి స్కాల‌ర్‌షిప్‌ను అందుకుని అదే యూనివ‌ర్సిటీలో 1925లో మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేసింది. అక్క‌డే పీహెచ్‌డీ విద్య‌ను కూడా అభ్య‌సించింది. తిరిగి భార‌త్‌కు వ‌చ్చి మ‌హారాజాస్ కాలేజ్ ఆఫ్ సైన్స్‌లో బోట‌నీ ప్రొఫెస‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె 1932 నుంచి 1934 వ‌ర‌కు రెండేళ్ల పాటు అక్క‌డ కొనసాగింది. అనంత‌రం కోయంబ‌త్తూర్‌లో ఏర్పాటు చేసిన షుగ‌ర్‌కేన్ బ్రీడింగ్ స్టేష‌న్‌లో చెరుకు వంగ‌డాల‌పై ప‌రిశోధ‌కురాలిగా చేరింది. అయితే జాన‌కి అమ్మాల్ అప్ప‌టికే సైటో జెనెటిక్స్‌లో నిపుణురాలైంది. ఈ క్ర‌మంలో ఆమె అత్యంత తీపిద‌నంతోపాటు ఎక్కువ దిగుబ‌డిని ఇచ్చే ఓ కొత్త‌ర‌క‌మైన చెరుకు వంగ‌డాన్ని సృష్టించింది. ఇప్పుడు మ‌నం తింటున్న చ‌క్కెర‌కు వ‌చ్చిన తీపి ఆమె పుణ్య‌మే.

అంత‌టితో జాన‌కి అమ్మాల్ రీసెర్చి ఆగ‌లేదు. 1935లో సీవీ రామన్ ఏర్పాటు చేసిన అకాడ‌మీ ఆఫ్ సైన్సెస్‌లో రీసెర్చ్ ఫెలోగా ప‌నిచేసింది. త‌దుప‌రి లండ‌న్‌కు వెళ్లి అక్క‌డ జాన్ ఇన్స్ హార్టిక‌ల్చ‌ర‌ల్ ఇనిస్టిట్యూట్‌లో అసిస్టెంట్ సైటాల‌జిస్ట్‌గా ప‌నిచేసింది. 1940 నుంచి 45 వ‌ర‌కు అక్క‌డే సైటాల‌జిస్ట్‌గా విధులు నిర్వ‌హించింది. ఆ స‌మ‌యంలో ఎన్నో మొక్క‌ల‌పై ఆమె ప‌రిశోధ‌న‌లు చేసింది. మాగ్నొలియా అనే మొక్క‌పై ఆమె చేసిన ప‌రిశోధ‌న‌ల‌కు గాను దానికి పూచే తెల్ల‌ని పూల‌కు మాగ్నొలియా కొబ‌స్ జాన‌కి అమ్మాల్ అని ఆమె పేరు పెట్టారు. 1951లో ఇండియాకు తిరిగి వ‌చ్చి బొటానిక‌ల్ స‌ర్వే ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) స్పెష‌ల్ ఆఫీసర్‌గా ప‌నిచేసింది. ఆ ప‌నిలో భాగంగా దేశం మొత్తం తిరుగుతూ అనేక ర‌కాల మొక్క‌ల‌పై ప‌రిశోధ‌న‌లు చేసింది. కొత్త ర‌కాల‌ను సృష్టించింది. ఆమె గొప్ప సైంటిస్టే కాదు, ప‌ర్యావ‌రణ వేత్త కూడా. ప‌ర్యావ‌ర‌ణానికి హాని క‌లిగించే ప‌నులు ఎవ‌రైనా చేస్తే అక్క‌డికి వెళ్లి అంద‌రితో చేరి తానూ నిర‌స‌న‌లు తెలిపేది.

వృక్ష‌శాస్త్రంలో జాన‌కి అమ్మాల్ చేసిన ప‌రిశోధ‌న‌ల‌కు గాను భార‌త ప్ర‌భుత్వం ఆమెకు 1977లో పద్మ‌శ్రీ పుర‌స్క‌రాన్ని అంద‌జేసింది. ఈ అవార్డును అందుకున్న మొద‌టి మ‌హిళా సైంటిస్టు ఈమే కావ‌డం విశేషం. అంతేకాదు పీహెచ్‌డీ పొందిన మొద‌టి మ‌హిళ‌గా కూడా ఈమె పేరుగాంచింది. యూనివ‌ర్సిటీ ఆఫ్ మిచిగ‌న్ గౌర‌వ డాక్ట‌రేట్‌ను కూడా ఈమెకు ప్ర‌దానం చేసింది. 1984, ఫిబ్ర‌వ‌రి 7 న‌ జాన‌కి అమ్మాల్ క‌న్ను మూశారు. అయిన‌ప్ప‌టికీ నేటికీ ఆమెను మ‌నం నిత్యం త‌ల‌చుకుంటూనే ఉంటాం. అదీ… చ‌క్కెర తీపి త‌గిలిన‌ప్పుడ‌ల్లా..!

Comments

comments

Share this post

scroll to top