పాక్‌తో జ‌రిగిన హాకీ మ్యాచ్‌లో భార‌త్ ప్లేయ‌ర్లు న‌ల్ల రిబ్బ‌న్లు ధ‌రించారు. ఎందుకో తెలుసా..?

లండ‌న్ లో జ‌రిగిన ఐసీసీ చాంపియ‌న్స్ ట్రోఫీలో భార‌త్ పాకిస్థాన్ చేతిలో చిత్తుగా ఓడినా హాకీలో మాత్రం అదే పాకిస్థాన్‌ను మ‌ట్టి కరిపించింది. అదే ఇంగ్లండ్ గ‌డ్డ‌పై జ‌రిగిన హాకీ వ‌రల్డ్ లీగ్ సెమీస్‌లో భార‌త హాకీ జ‌ట్టు పాకిస్థాన్‌ను 7-1 గోల్స్ తేడాతో చిత్తు చేసింది. అయితే మ‌న దేశంలో క్రికెట్‌కు ఉన్నంతగా అభిమానులు హాకీకి లేరు. ఇది చాలా విచారించాల్సిన విష‌యం. నిజానికి మ‌న దేశ జాతీయ క్రీడ హాకీ. అయిన‌ప్ప‌టికీ ఆ ఆట‌కు అంత‌గా ఆద‌ర‌ణ లేద‌నే చెప్ప‌వ‌చ్చు. ఇదెప్ప‌టి నుంచో అంద‌రికీ తెలిసిందే. అయితే జెంటిల్మ‌న్ గేమ్‌గా చెప్పుకునే క్రికెట్‌కు మించి మ‌న భార‌త హాకీ ఆట‌గాళ్లు జెంటిల్మ‌న్ స్ఫూర్తిని ఆటలో క‌న‌బ‌రిచారు. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏమిటంటే…

మ‌న దేశ స‌రిహ‌ద్దుల్లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్ర‌వాదులు, సైనికులు ఎప్ప‌టిక‌ప్పుడు య‌థేచ్చ‌గా కాల్పులు జ‌రుపుతూ నిబంధ‌న‌ల‌కు పాత‌ర పెడుతున్నారు క‌దా. దీంతో మ‌న దేశ సైనికులు చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇదే విష‌యాన్ని ప్ర‌పంచానికి తెలియ‌జేయాల‌నే ఉద్దేశంతో మ‌న దేశ హాకీ ఆట‌గాళ్లు పాకిస్థాన్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో న‌ల్ల రిబ్బ‌న్ల‌ను ధ‌రించారు. చేతుల‌కు వాటిని ధరించి భార‌త హాకీ ఆటగాళ్లు ఓ వైపు నిర‌స‌న తెలుపుతూనే మ‌రో వైపు ఆట‌లో విజృంభించారు. దీంతో భార‌త్ పాక్‌ను మ‌ట్టి కరిపించింది.

ప్ర‌స్తుతం ఇదే విషయంపై సోష‌ల్ మీడియాలో టాపిక్స్ ట్రెండ్ అవుతున్నాయి. భార‌త హాకీ క్రీడాకారులు పాక్‌ను చిత్తు చేసి ఓడించ‌డ‌మే గాక‌, ఆ దేశ సైనికులు, ఉగ్ర‌వాదులు చేస్తున్న ప‌నులను న‌ల్ల రిబ్బ‌న్లు ధ‌రించి ప్ర‌పంచానికి చెప్పారు. దీంతో ఇప్పుడు మ‌న దేశ హాకీ ప్లేయ‌ర్ల‌పై ప్ర‌శంస‌లు కురుస్తున్నాయి. నిజానికి క్రికెట్‌లో ఓడినా హాకీలో గెలిచినందుకు, మ‌న ప్లేయ‌ర్లు అలా నిర‌స‌న తెలిపినందుకు స‌గ‌టు పౌరుడు కూడా ఎంత‌గానో హ‌ర్షిస్తున్నాడు. అవును మ‌రి, అలాంటి వేదిక‌పై పాక్ వైఖ‌రిని తెలిపితేనే క‌దా ప్ర‌పంచ దేశాల‌కు ఆ దేశం గురించిన నిజాలు తెలిసేది. ఏది ఏమైనా మ‌న హాకీ ప్లేయ‌ర్ల‌కు ఓ గ‌ట్టి సెల్యూట్ కొట్టాల్సిందే..!

Comments

comments

Share this post

scroll to top