ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌ధానిగా అమ‌రావ‌తినే ఎందుకు ఎంపిక చేశారో తెలుసా..?

అమ‌రావ‌తి… నిర్మాణంలో ఉన్న ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని ఇది. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాలు విడిపోయాక కొత్త‌గా ఏర్ప‌డిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కోసం రాజ‌ధాని నిర్మాణం అవ‌స‌ర‌మై ఎన్నో అభిప్రాయాలు, సూచ‌న‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుని అమ‌రావ‌తి నిర్మాణాన్ని చేప‌ట్టారు. ఇందు కోసం ఎంతో మంది రైతులు త‌మ భూముల‌ను త్యాగం చేశారు కూడా. వారంద‌రికీ త‌గిన న్యాయం చేస్తామ‌ని ఏపీ సీఎం చంద్ర‌బాబు ప్ర‌క‌టించారు. కానీ సాయం ఇప్ప‌టికీ అంద‌లేద‌ని ప్ర‌తిప‌క్ష నేత‌లు, కొంద‌రు రైతులు ఆందోళన చేస్తున్నారు. స‌రే, ఈ విష‌యం ప‌క్క‌న పెడితే… అస‌లు కొత్త ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం కోసం రాజ‌ధానిగా అమ‌రావ‌తినే ఎందుకు ఎంచుకున్నారో తెలుసా..? స‌రిగ్గా ఇదే ప్ర‌శ్న‌ను ఓ సోష‌ల్ మీడియా సైట్‌లో కొంద‌రు యూజ‌ర్లు అడగ్గా అందుకు సాక్షాత్తూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి హోదాలో అఫిషియ‌ల్‌గా స‌మాధానం ఇచ్చారు. అదేమిటంటే…

పాత ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక కొత్త ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు రాజ‌ధాని ఏర్పాటు ఆవ‌శ్య‌క‌మైంది. దీంతో అప్ప‌ట్లో కేంద్ర ప్ర‌భుత్వం అమ‌రావ‌తి నిర్మాణానికి పెద్ద ఎత్తున స‌హాయం చేస్తామ‌ని ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగానే ఏపీ రీఆర్గ‌నైజేష‌న్ యాక్ట్ 2014 ప్ర‌కారం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో రాజ‌ధాని నిర్మాణానికి అనువైన స్థ‌లం ఎంపిక చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం ఓ క‌మిటీని ఏర్పాటు చేసింది. 5 మంది స‌భ్యులు ఉన్న ఆ క‌మిటీకి కేసీ శివ‌రామ‌కృష్ణ‌న్ నాయ‌కత్వం వ‌హించారు. ఈ క్రమంలోనే ఆ క‌మిటీ చాలా రోజుల పాటు అనేక మంది నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు, అభిప్రాయాల‌ను సేక‌రించింది. క్షేత్ర స్థాయిలో ఆ స‌భ్యులు ప‌ర్య‌టించారు కూడా.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని తెలపాలంటూ అంద‌రి నుంచి స‌ల‌హాల‌ను స్వీక‌రించారు ఆ స‌భ్యులు. దీంతో విజ‌య‌వాడ‌-గుంటూరు ప్రాంతం రాజ‌ధానికి అనువుగా ఉంటుంద‌ని చాలా మంది చెప్పారు. ఆ ప్రాంతానికి అనువుగా సుమారుగా 2191 మంది (46 శాతం) త‌మ అభిప్రాయం తెలిపారు. మిగిలిన ప్రాంతాల‌కు అంటే… విశాఖ‌ప‌ట్నంకు మ‌ద్ద‌తుగా 10.7 శాతం మంది, క‌ర్నూలుకు 7.6 శాతం మంది, ఒంగోలు 5.6 శాతం, రాజ‌మండ్రి 2.9, దొన‌కొండ 2.5 శాతం, తిరుప‌తి 2.4 శాతం, ఇత‌ర ప్ర‌దేశాల‌కు 2.2 శాతం అనువుగా అభిప్రాయాలు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలో ఈ రిపోర్టును ఆ స‌భ్యులు ఆగస్టు 27, 2014వ తేదీన కేంద్ర ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించారు. దీంతో కేంద్ర ప్ర‌భుత్వం విజ‌య‌వాడ‌-గుంటూరు ప్రాంతాన్ని రాజ‌ధాని నిర్మాణం కోసం ఎంపిక చేసింది. ఆ త‌రువాత రాజ‌ధానికి పేరు పెట్ట‌డం, దాని డిజైన్ కోసం ప్ర‌ముఖ విదేశీ కంపెనీల‌ను సంప్ర‌దించ‌డం, అనేక డిజైన్లు, న‌మూనాలు చూడ‌డం జ‌రిగింది.

అలా డిజైన్ల‌ను చూశాక అమ‌రావ‌తి నిర్మాణ ప్లాన్ల‌ను ఓకే చేశారు. దీంతో అమ‌రావ‌తిలో 3 మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీలు నిర్మాణం కానున్నాయి. అమ‌రావ‌తి నిర్మాణానికి గాను కేబినెట్ సబ్ క‌మిటీ ద్వారా ల్యాండ్ పూలింగ్ ప‌ద్ధ‌తిలో భూముల‌ను సేక‌రించారు. కేవ‌లం అమ‌రావ‌తి నిర్మాణం మాత్ర‌మే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అమ‌రావ‌తికి స‌మాంత‌రంగా అభివృద్ధి చేయనున్నారు.

Comments

comments

Share this post

scroll to top