Onlineలో డ‌బ్బులు ట్రాన్ఫ‌ర్ చేస్తున్నారా? అయితే వీటి గురించి త‌ప్ప‌క తెల్సుకోవాలి.

నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో ఈ మ‌ధ్య కాలంలో చాలా మంది ఆన్‌లైన్ బాట ప‌ట్టారు. నిధుల ట్రాన్స్‌ఫ‌ర్ మొద‌లు కొని అనేక ప‌నుల‌ను ఇప్పుడు ఆన్‌లైన్‌లోనే నిర్వ‌హించుకుంటున్నారు. అయితే ఎప్ప‌టి నుంచో ప‌లు ర‌కాల ట్రాన్స్‌ఫ‌ర్ ప‌ద్ధ‌తులు అందుబాటులో ఉన్నా ఈ మ‌ధ్య కాలంలో మ‌న‌కు NEFT, RTGS, IMPS, UPI … వంటి ప‌లు బ్యాంకింగ్ లావాదేవీల‌కు సంబంధించిన మాట‌లు ఎక్కువ‌గా వినిపిస్తున్నాయి. ఈ క్ర‌మంలో చాలా మంది ఈ ప‌ద్ధ‌తుల్లో ఒక అకౌంట్ నుంచి మ‌రొక అకౌంట్‌కు డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తున్నారు కూడా. అయితే డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకునేందుకు ఒకే ఒక ప‌ద్ధ‌తి ప్ర‌వేశ‌పెట్ట‌వ‌చ్చుగా. ఇవ‌న్నీ విధానాలు ఎందుకు..? వాటితో మ‌న‌కు ఉప‌యోగం ఏమిటి..? ఎవ‌రు ఏ ప‌ద్ధ‌తిలో ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకుంటే మంచిది..? వ‌ంటి వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

payment-gateways

NEFT (నెఫ్ట్‌)…
దీన్ని నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్ ఫండ్ ట్రాన్స్‌ఫ‌ర్ అంటారు. ఈ ప‌ద్ధ‌తిలో గ‌రిష్టంగా రూ.10 ల‌క్ష‌ల వ‌ర‌కు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. ఉద‌యం 8 నుంచి సాయంత్రం 4.30 గంట‌ల మ‌ధ్య‌లో మాత్ర‌మే నెఫ్ట్ అందుబాటులో ఉంటుంది. నెఫ్ట్ ద్వారా డ‌బ్బులు పంపితే అవ‌త‌లి వ్య‌క్తికి చేరేందుకు గ‌రిష్టంగా ఒక రోజు స‌మ‌యం ప‌డుతుంది. కొన్ని సంద‌ర్భాల్లో 30 నిమిషాలు లేదా 1, 2 గంట‌ల్లోనే డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ అవుతాయి. అయితే ఎవ‌రైనా టైం దాటిపోతున్న‌ప్పుడు నెఫ్ట్ ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే అది మ‌రుస‌టి రోజు ప్రాసెస్ అవుతుంది. నెఫ్ట్ ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలంటే అవ‌త‌లి వారికి చెందిన బ్యాంక్ అకౌంట్ నంబ‌ర్‌, ఐఎఫ్ఎస్‌సీ నంబ‌ర్, పేరు వంటి వివ‌రాలు కావాలి. దీనికి తోడు అవ‌త‌లి వ్య‌క్తుల‌ను బెనిఫిషియ‌రీ అకౌంట్ కింద ముందే యాడ్ చేసుకోవాలి. రూ.5 ల‌క్ష‌ల పైన నెఫ్ట్ ద్వారా ట్రాన్స్‌ఫ‌ర్ చేస్తే త‌క్కువ ఛార్జి అవుతుంది.

RTGS (రియ‌ల్ టైం గ్రోస్ సెటిల్‌మెంట్‌)…
ఇది కూడా నెఫ్ట్ త‌ర‌హాలోనే ప‌నిచేస్తుంది. కాక‌పోతే నెఫ్ట్ క‌న్నా ఎక్కువ మొత్తంలో డ‌బ్బును పంపుకునేందుకు వీలుంటుంది. అయితే దీని ద్వారా డ‌బ్బులు పంపాలంటే క‌నీసం రూ.2 ల‌క్ష‌లైనా ట్రాన్స్‌ఫ‌ర్ చేయాల్సి ఉంటుంది. నెఫ్ట్ టైమింగ్స్‌, ఇత‌ర నియ‌మాలు దీనికి వ‌ర్తిస్తాయి. రూ.2 ల‌క్ష‌ల నుంచి రూ.5 ల‌క్ష‌ల వ‌రకు డ‌బ్బు పంపితే రూ.30, రూ.5 ల‌క్ష‌ల‌కు పైన అయితే రూ.55 వ‌ర‌కు ఒక ట్రాన్సాక్ష‌న్‌కు చార్జి అవుతుంది.

IMPS (ఇమ్మిడియ‌ట్ పేమెంట్ స‌ర్వీస్‌)…
నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్ లా కాకుండా దీని ద్వారా డ‌బ్బుల‌ను వెంట‌నే పంపుకోవ‌చ్చు. అవ‌త‌లి వ్య‌క్తుల అకౌంట్ నంబ‌ర్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లేదా ఎంఎంఐడీ ల‌ను ఎంట‌ర్ చేసి దీని ద్వారా వెంట‌నే డ‌బ్బులు పంపుకోవ‌చ్చు. అవ‌త‌లి వ్య‌క్తుల‌కు కొన్ని సెక‌న్ల‌లోనే డ‌బ్బులు చేరిపోతాయి. అయితే దీని ద్వారా రోజుకు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు మాత్ర‌మే పంపుకునే వీలుంది. ప‌రిమితి దాటితే మ‌రొక రోజు వ‌ర‌కు ఆగాలి. నెఫ్ట్‌, ఆర్‌టీజీఎస్ లా కాకుండా దీని ద్వారా డ‌బ్బుల‌ను రోజులో ఎప్పుడైనా పంపుకోవ‌చ్చు. అయితే ఒక ట్రాన్సాక్ష‌న్‌కు రూ.5 వ‌ర‌కు చార్జి అవుతుంది. మొబైల్ బ్యాంకింగ్‌, ఎన్‌యూయూపీ వంటి సేవ‌ల‌ను వాడేవారికి ఐఎంపీఎస్ ఉప‌యుక్తంగా ఉంటుంది. దీని వ‌ల్ల బెనిఫిషియ‌రీలను యాడ్ చేసుకోవాల్సిన ప‌ని లేదు. వెంట‌నే ఎవ‌రికి కావాలంటే వారికి ఫండ్స్ పంపుకోవ‌చ్చు.

UPI (యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్‌)…
ఈ ప‌ద్ధ‌తిలో రోజుకు రూ.1 ల‌క్ష వ‌ర‌కు పంపుకోవ‌చ్చు. ఇది కూడా ఐఎంపీఎస్ లాగే ప‌నిచేస్తుంది. కాక‌పోతే స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా దీన్ని వాడుకోవాలి. ఆయా బ్యాంకుల‌కు చెందిన యూపీఐ యాప్‌లు గూగుల్ ప్లే స్టోర్‌, యాపిల్ స్టోర్‌ల‌లో యూజ‌ర్ల‌కు ల‌భిస్తున్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకుంటే యూజ‌ర్ త‌నకు చెందిన ఏదైనా బ్యాంక్ డిటేయిల్స్‌ను యాప్‌లో ఎంట‌ర్ చేయాలి. దీంతో యూజ‌ర్‌కు ఓ ప్ర‌త్యేక‌మైన వ‌ర్చువ‌ల్ పేమెంట్ ఐడీ (వీపీఏ) క్రియేట్ అవుతుంది. ఇలా అవ‌త‌లి వారు కూడా క్రియేట్ చేసుకుంటే వారికీ ఓ ఐడీ వస్తుంది. ఈ క్ర‌మంలో ఎవ‌రైనా యూజ‌ర్ డ‌బ్బు పంపాల‌నుకుంటే స‌ద‌రు మొత్తాన్ని యాప్‌లో ఎంట‌ర్ చేసి అవ‌త‌లి వ్య‌క్తుల వీపీఏ ఎంట‌ర్ చేస్తే చాలు, దాంతో వారికి వెంట‌నే పేమెంట్ అందుతుంది. ఈ విధానాన్ని ఇప్పుడు చాలా మంది వ‌ర్త‌కులు అనుస‌రిస్తున్నారు. అయితే పెద్ద మొత్తంలో డ‌బ్బు ట్రాన్స్‌ఫ‌ర్ అయితే దానికి అనుగుణంగా చార్జీలు ప‌డే అవ‌కాశం ఉంటుంది.

యూఎస్ఎస్‌డీ, ఈ-వాలెట్స్‌…
ఇవే కాకుండా యూఎస్ఎస్‌డీ, ఈ-వాలెట్స్ తో కూడా ఎవ‌రైనా డ‌బ్బులు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే యూఎస్ఎస్‌డీని వాడుకోవాలంటే యూజ‌ర్ త‌న‌కు చెందిన ఏదైనా బ్యాంక్ అకౌంట్‌లో మొబైల్ బ్యాంకింగ్ యాక్టివేట్ అయి ఉండాలి. అనంత‌రం *99# అనే బ‌ట‌న్‌ను ఫోన్‌లో డ‌య‌ల్ చేసి అనంత‌రం వ‌చ్చే ఆదేశాల‌ను పాటిస్తే డ‌బ్బులు పంప‌వ‌చ్చు. ఇందులో గ‌రిష్టంగా ఒక ట్రాన్సాక్షన్‌కు రూ.5వేల‌ను పంపుకునేందుకు వీలుంది. అదే విధంగా ఈ-వాలెట్స్ అంటే పేటీఎం, ఫ్రీ చార్జ్‌, మొబిక్విక్‌, రిల‌య‌న్స్ మ‌నీ వంటి వాటిలో యూజ‌ర్లు త‌మ డెబిట్‌, క్రెడిట్ లేదా ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా డ‌బ్బులు లోడ్ చేస్తే వాటిని గ‌రిష్టంగా ఒక ట్రాన్సాక్ష‌న్‌కు రూ.5వేల వ‌ర‌కు, నెల‌కు రూ.20వేలకు మించ‌కుండా పంపుకోవ‌చ్చు. ఇందుకు గాను ఆయా వాలెట్లు ఇప్పుడు ఎలాంటి చార్జీల‌ను కూడా వ‌సూలు చేయ‌డం లేదు.

Comments

comments

Share this post

scroll to top