యూఏఈలో తీవ్ర‌త‌ర‌మైన నీటి స‌మ‌స్య‌. దాన్ని తీర్చేందుకు ఆ దేశం ఏం చేస్తుందో తెలుసా..?

రాను రాను త‌రిగిపోతున్న భూగ‌ర్భ జ‌ల వ‌న‌రుల కార‌ణంగా ప్ర‌పంచ వ్యాప్తంగా ఆయా దేశాల్లో నీటికి నేడు ఎంత‌గా డిమాండ్ ఉందో అంద‌రికీ తెలిసిందే. కొన్ని చోట్ల‌న‌యితే అవ‌స‌రాల మాట అటుంచి క‌నీసం తాగేందుకు చుక్క నీరు కూడా దొర‌క‌ని ప‌రిస్థితి నెల‌కొంది. దీంతో నీటిని జ‌నాల‌కు అందించేందుకు ఆయా దేశాల ప్ర‌భుత్వాలు అనేక చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. అయితే యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) మాత్రం కొంచెం విభిన్నంగా ఆలోచించింది. ఆ దేశంలోనూ ఎప్ప‌టి నుంచో నీటి క‌ట క‌ట ఉంది. మ‌రో 25 సంవ‌త్స‌రాల వ‌ర‌కు అక్క‌డ నీటికి విపరీత‌మైన స‌మ‌స్య ఉంటుంద‌ని సైంటిస్టులు చెప్పడంతో ఆ దేశ ప్ర‌భుత్వం ఏం చేస్తుందో తెలుసా..? అదేంటో మీరే చ‌దివి తెలుసుకోండి..!

యునైటెడ్ అర‌బ్ ఎమిరేట్స్ (యూఏఈ) త‌మ దేశంలో నెల‌కొన్న నీటి స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు వినూత్న ప్ర‌యోగం చేయ‌నుంది. అంటార్కిటికా నుంచి ఓ భారీ ఐస్ బ‌ర్గ్ (మంచు కొండ‌)ను స‌ముద్ర మార్గం ద్వారా త‌మ దేశానికి తెచ్చుకోవాల‌ని భావిస్తోంది. అందుకు ఇప్ప‌టి నుంచే ప్ర‌య‌త్నాల‌ను కూడా ప్రారంభించింది. దీనికి గాను ప్రాజెక్ట్ ఐస్‌బ‌ర్గ్ అనే పేరు కూడా పెట్టింది. ఈ క్ర‌మంలో 2018వ సంవ‌త్స‌రంలో ఈ ప్రాజెక్టు ప్రారంభం కానుంది.

అలా ప్రాజెక్ట్ ఐస్‌బర్గ్ ద్వారా ఓ భారీ మంచుకొండ‌ను త‌మ దేశానికి తేవాల‌ని యూఏఈ భావిస్తోంది. అయితే అందుకు 1 ఏడాది ప‌డుతుంద‌ట‌. దీంతో త‌మ దేశంలో ఉన్న నీటి స‌మ‌స్య చాలా వ‌ర‌కు పోతుంద‌ని వారు భావిస్తున్నారు. అలా తెచ్చిన మంచు కొండ‌ను ప‌గ‌ల‌గొట్టి, మంచును న‌లిపి దాన్నుంచి నీటిని తీసి, ఆ నీటిని ఫిల్ట‌ర్ చేసి ఉప‌యోగించుకోనున్నార‌ట‌. మ‌రి అంత సుదీర్ఘ ప్ర‌యాణం చేస్తే ఆ మంచు కొండ క‌ర‌గ‌దా..? అస‌లే ఆ దేశంలో ఎడారి కార‌ణంగా ఎండ మండిపోతుంది క‌దా..! అంటే అవును, అది క‌రెక్టే. అయితే అందుకు వారు ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లు చేయ‌నున్నార‌ట‌. దీంతో చాలా వ‌ర‌కు కొండ క‌ర‌గ‌కుండానే దాన్ని ఒడిసి ప‌ట్టి త‌మ దేశానికి తేనున్నారు. అలా తెచ్చే కొండ నుంచి వచ్చే నీటి ప‌రిమాణం స‌మారుగా 757 కోట్ల లీటర్ల‌కు పైనే ఉంటుంద‌ట‌. దీంతో ఆ నీరు 5 ఏళ్ల పాటు సుమారుగా 10 ల‌క్ష‌ల మందికి స‌రిపోతుంద‌ట‌. అలా అంచ‌నా వేసి మంచుకొండ‌ను తేనున్నారు.

అయితే ఇక్క‌డ మ‌నం ఆలోచించాల్సిన విష‌యం ఇంకోటుంది. మంచుకొండ‌ను తెస్తారు స‌రే..! మ‌రి అస‌లు దాన్ని అలా తెచ్చుకునేందుకు వారికి అధికారం, హ‌క్కు ఉన్నాయా..? అంత‌టి భారీ మంచుకొండ తెస్తే ప‌ర్యావ‌ర‌ణం దెబ్బ తిన‌దా..? అంటే ఏమో… ఈ విష‌యంపై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది..! ఏది ఏమైనా… జ‌నాల‌కు నీటి క‌ష్టాలు త‌ప్పేలా లేవు..!

Comments

comments

Share this post

scroll to top