పొర‌పాటున డ‌బ్బును వేరే ఖాతాలోకి ట్రాన్స్‌ఫ‌ర్ చేశారా..? అయితే ఏం చేయాలో తెలుసా..?

నేటి త‌రుణంలో చాలా మంది ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ చేస్తున్నారు. వీటి వ‌ల్ల ఎంతో స‌మ‌యం ఆదా అవ‌డ‌మే కాదు, చాలా సుల‌భంగా బ్యాంకింగ్ లావాదేవీల‌ను నిర్వ‌హించుకునేందుకు వీలు క‌లుగుతోంది. న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్‌, బిల్లు చెల్లింపులు వంటి ఎన్నో లావాదేవీల‌ను మ‌నం ఈ మాధ్య‌మాల్లో నిర్వ‌హించుకుంటున్నాం. అయితే అంతా బాగానే ఉంటుంది కానీ, న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్స్ చేసే విష‌యంలో మాత్రం చాలా జాగ్ర‌త్త వ‌హించాల్సిందే. న‌గ‌దును అవ‌త‌లి వ్య‌క్తికి పంపేట‌ప్పుడు క‌చ్చితంగా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. లేదంటే మ‌నం పంపాల‌నుకున్న అకౌంట్ కాకుండా వేరే అకౌంట్‌లో డ‌బ్బులు జమ అయితే అప్పుడు చాలా ఇబ్బందులు ప‌డాల్సి వ‌స్తుంది. ఈ క్రమంలో అస‌లు న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్స్ చేసిన‌ప్పుడు అలా పొర‌పాటున వేరే అకౌంట్‌లోకి డ‌బ్బులు పంపితే మ‌ళ్లీ మ‌నం ఆ డ‌బ్బును వెన‌క్కి తీసుకోవ‌చ్చా..? ఇది వీల‌వుతుందా..? అన్న విష‌యాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ప్ర‌స్తుతం మ‌న‌కు ఇంట‌ర్నెట్ లేదా మొబైల్ బ్యాంకింగ్ సేవ‌ల్లో న‌గ‌దు పంపుకునే వెసులుబాటును బ్యాంకులు కల్పిస్తున్నాయి. ఇవి కాకుండా ఈ మ‌ధ్య కాలంలో అనేక డిజిట‌ల్ వాలెట్ యాప్‌లు, సైట్‌లు వ‌చ్చాయి. వీటిల్లో డ‌బ్బును లోడ్ చేసుకుని కూడా అవ‌త‌లి వ్య‌క్తుల బ్యాంక్ అకౌంట్ల‌కు డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే న‌గ‌దును ఎలా ట్రాన్స్‌ఫ‌ర్ చేసినా అందుకు మ‌నకు ప్ర‌స్తుతం ప‌లు ర‌కాల ట్రాన్స్‌ఫ‌ర్ మెథ‌డ్స్ అందుబాటులో ఉన్నాయి. అవేమిటంటే… IMPS, NEFT, RTGS, UPI, Aadhar Pay, MMID అనే పేమెంట్ విధానాలు మ‌న‌కు అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో IMPS, NEFT, RTGS వంటి పేమెంట్ మెథ‌డ్ల‌లో డ‌బ్బును ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలంటే అవ‌త‌లి వ్య‌క్తి బ్యాంక్ అకౌంట్ నంబ‌ర్‌, IFSC నంబ‌ర్ క‌చ్చితంగా కావాలి. అయితే కొన్ని బ్యాంకుల్లో IMPS ద్వారా జ‌రిపే న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ల‌లో కేవ‌లం అవ‌త‌లి వ్య‌క్తి అకౌంట్ నంబ‌ర్‌ను మాత్ర‌మే ఈ మ‌ధ్య అడుగుతున్నారు. వాటికి IFSC నంబర్‌ను అడ‌గ‌డం లేదు. ఇక UPI మెథ‌డ్‌లో అవ‌త‌లి వ్య‌క్తి UPI ఐడీ ఉంటే చాలు. Aadhar Payకు ఆధార్ నంబ‌ర్, మొబైల్ నంబ‌ర్‌ ఉంటే చాలు. MMID కి అవ‌తలి వ్య‌క్తి MMID, ఫోన్ నంబ‌ర్ కావాలి.

పైన‌ చెప్పిన అన్ని పేమెంట్ విధానాల్లో దేని ద్వారా అయినా మ‌నం న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు. అయితే ఎలా చేసినా అవ‌తలి వారి వివ‌రాల‌ను ఒక‌సారి క‌చ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. అకౌంట్ నంబ‌ర్‌, IFSC నంబ‌ర్, UPI అయితే దాని ఐడీ, ఆధార్ నంబ‌ర్‌, మొబైల్ నంబ‌ర్‌, MMID అయితే దాని ఐడీ వంటి వివ‌రాల‌ను ఒక‌టికి రెండు సార్లు సరి చూసుకోవాలి. పంపుతున్న‌ది చిన్న మొత్తం లేదా పెద్ద మొత్తం ఎంత అయినా వివ‌రాల‌ను మాత్రం స‌రిచూసుకోవాల్సిందే. అలా చేశాక పంపాల‌నుకున్న డ‌బ్బును ఎంట‌ర్ చేసి న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌వ‌చ్చు. అయితే అంత చెక్ చేసిన‌ప్ప‌టికీ తెలియ‌కుండా పొర‌పాటున వేరే అకౌంట్‌కి డ‌బ్బు పంపితే ఎలా..? అంటే అందుకు మార్గాలు కూడా ఉన్నాయి.

డ‌బ్బును పొర‌పాటున వేరే అకౌంట్‌కు పంపిస్తే అప్పుడు ఏం చేయాలంటే వెంట‌నే ఈ విష‌యాన్ని మీ బ్యాంక్ శాఖ‌కు చెప్పాలి. ట్రాన్స్‌ఫర్ త‌ప్పుగా అయింద‌ని లిఖిత పూర్వ‌కంగా కంప్లెయింట్ ఇవ్వాలి. దీంతో వారు అవ‌త‌లి వ్య‌క్తిని కాంటాక్ట్ చేస్తారు. వారికి స‌మ‌స్య‌ను వివ‌రిస్తారు. దీంతో అవ‌త‌లి వ్య‌క్తుల అంగీకారం మేర‌కు మీ బ్యాంక్ వారు ఆ న‌గదు ట్రాన్స్‌ఫ‌ర్‌ను రివ‌ర్స్ చేస్తారు. దీంతో పోయిన మొత్తం మ‌ళ్లీ వ‌స్తుంది. అయితే బ్యాంకు శాఖ వారు స్పందించ‌క‌పోతే అదే బ్యాంకు ఉన్న‌తాధికారుల‌కు ఫిర్యాదు చేయ‌వ‌చ్చు. లేదంటే మీరు పంపిన అకౌంట్ దారుడి బ్యాంక్‌కు వెళ్లి అక్క‌డ రిక్వెస్ట్ పెట్ట‌వ‌చ్చు. అందుకు మీ వెంట బ్యాంక్ పాస్‌బుక్‌, చెక్‌బుక్‌, ఏటీఎం కార్డు, ఐడీ ప్రూఫ్ వంటి వివరాల‌ను తీసుకెళ్లాలి. దీంతో త‌ప్పుడు ట్రాన్స్‌ఫ‌ర్‌ను వారు రివ‌ర్స్ చేసి డ‌బ్బును తిరిగి ఇచ్చేస్తారు.

డబ్బు అలా పొర‌పాటున ట్రాన్స్‌ఫ‌ర్ అయిన ప‌క్షంలో అవ‌త‌లి వ్య‌క్తి అంగీక‌రించ‌క‌పోతే అప్పుడు మీరు న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించ‌వ‌చ్చు. అయతే అక్క‌డ పొర‌పాటున ట్రాన్స్‌ఫ‌ర్ చేశామ‌ని మీరు నిరూపించుకోవాల్సి ఉంటుంది. సాధార‌ణంగా ఇలాంటి లావాదేవీల్లో వినియోగ‌దారులే పూర్తి బాధ్య‌త వ‌హించాలి. ఎందుకంటే బ్యాంక్ అకౌంట్ నంబ‌ర్‌, ఐఎఫ్ఎస్‌సీ నంబ‌ర్‌, ఆధార్‌, మొబైల్ నంబ‌ర్ వంటి వివ‌రాల‌ను క‌చ్చితంగా వెరిఫై చేసుకుని న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేయాలి. అది పూర్తిగా వినియోగ‌దారుడి చేతుల్లోనే ఉంటుంది. బ్యాంకులు ఏమీ చేయ‌లేవు. అందుక‌ని ఇలాంటి ట్రాన్స్‌ఫ‌ర్స్ విష‌యంలో త‌ప్పుగా ఏదైనా జ‌రిగితే అప్పుడు కోర్టు మ‌న‌కు మొట్టికాయ‌లు వేసేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక అప్పుడు పొర‌పాటు జ‌రిగింద‌ని క‌చ్చితంగా నిరూపించుకునే విధంగా ఉంటేనే మ‌న డ‌బ్బులు మ‌న‌కు వ‌స్తాయి. ఒక వేళ పంపింది పెద్ద మొత్తం అయి ఉంటే అప్ప‌టికే దాన్ని అవ‌త‌లి వ్య‌క్తి వాడుకుని ఉంటే అప్పుడు మ‌నం ఇక ఏమీ చేయ‌లేం. ఆ వ్య‌క్తిని డ‌బ్బు కోసం రిక్వెస్ట్ చేయాల్సిందే. అత‌ను ఇస్తే ఇస్తాడు, లేదంటే కోర్టు ద్వారానే తేల్చుకోవాలి. ఇదంతా గొడ‌వ ఎందుక‌ని అనుకుంటే మీరు న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసేట‌ప్పుడే ఒక‌టికి రెండు సార్లు స‌ద‌రు వివ‌రాల‌ను వెరిఫై చేసుకోవ‌డం బెట‌ర్‌. అయితే పెద్ద మొత్తంలో పంపేవారు ముందుగా రూ.10, రూ.100 అలా చిన్న మొత్తంలో ఒక‌సారి ట్రాన్స్‌ఫ‌ర్ చేయండి. అవ‌త‌లి వ్య‌క్తి విజ‌య‌వంతంగా దాన్ని అందుకుంటే దాన్ని మీరు వెరిఫై చేసుకుని మిగ‌తా మొత్తాన్ని కూడా ఒకేసారి పంప‌వ‌చ్చు. దీంతో న‌ష్టం జ‌ర‌గ‌కుండా ఉంటుంది.

ఇక వేరే ఎవ‌రైనా వ్య‌క్తి మ‌న అకౌంట్‌లోనే పొర‌పాటుగా జ‌మ చేస్తే..? అంటే అవును, అలా కూడా జ‌ర‌గ‌వ‌చ్చు. ఇలాంటి సంద‌ర్భాల్లో మ‌నం కూడా డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టి లేవ‌ని చెప్ప‌వ‌చ్చు. కానీ అది విజ్ఞ‌త అనిపించుకోదు. మ‌నం పొర‌పాటుగా అలా డ‌బ్బు పంపితే మ‌న‌కు కోర్టుకు వెళ్లేందుకు ఎలా అవ‌కాశం ఉంటుందో అవ‌తలి వ్య‌క్తులు కూడా మ‌న‌పై కోర్టుకు వెళ్లేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక అలా డ‌బ్బు మ‌న అకౌంట్‌లోకి పొర‌పాటుగా వ‌చ్చి ప‌డితే దాని గురించి వెంట‌నే మ‌న బ్యాంక్ శాఖ‌కు తెలియ‌జేయాలి. ఒక వేళ ఎవ‌రైనా త‌ప్పుడు ట్రాన్స్‌ఫ‌ర్ అయింద‌ని చెప్పి డ‌బ్బులు అడిగితే వారి వివ‌రాల‌ను, ట్రాన్సాక్ష‌న్ వివ‌రాల‌ను అడిగి తెలుసుకుని వాటిని అవ‌స‌ర‌మైతే బ్యాంక్ ద‌గ్గ‌రికెళ్లి వెరిఫై చేసుకోవాలి. అవి నిజ‌మే అయితే వెంట‌నే డ‌బ్బును తిరిగిచ్చేయాలి. అదే మ‌న‌కు కూడా మంచి చేస్తుంది.

Comments

comments

Share this post

scroll to top