బుల్లెట్ నే దేవుడిగా చేసి, పూజలు చేస్తున్న గ్రామస్తులు, దీని వెనక పెద్ద కథే ఉంది.!

ఫ‌లానా ప్ర‌దేశంలో ఫ‌లానా దేవుడు లేదా దేవ‌త ఒక‌ప్పుడు తిరిగార‌నో, కాలుమోపార‌నో లేదంటే అక్క‌డ వారి విగ్ర‌హాలు వెలిశాయ‌నో భ‌క్తులు ఆయా దేవుళ్లు, దేవ‌త‌ల పేరిట గుళ్లు క‌ట్టించ‌డం సాధార‌ణంగా జ‌రిగే విష‌య‌మే. అయితే రాజస్థాన్‌లోని ఆ ప్రాంతంలో మాత్రం ఏకంగా రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్‌నే దైవంగా వెల‌సింద‌ని భావిస్తూ అక్కడి ప్ర‌జ‌లు కొలుస్తున్నారు. ఆ బుల్లెట్ బైక్‌కు నిత్యం పూజలు, అభిషేకాలు చేయ‌డం, హార‌తులు ప‌ట్టడం, గాజులు, దుస్తులు వంటివి స‌మ‌ర్పించి కోర్కెలు తీర్చ‌మ‌ని వేడుకోవ‌డం… ఇప్పుడ‌క్క‌డ జ‌రుగుతున్న తంతు. ఈ క్ర‌మంలో ఆ బైక్‌ను ద‌ర్శించుకునేందుకు చాలా మంది భ‌క్తులు రోజూ అక్క‌డికి చేరుకుంటున్నారు కూడా. వినేందుకు షాకింగ్‌గా ఉన్నా మేం చెబుతోంది నిజ‌మే. ఇంత‌కీ ఆ బుల్లెట్ బైక్ ఎవ‌రిది..?  దాని క‌హానీ ఏంటి..? ఓ లుక్కేద్దామా..!

bullet-baba-3
రాజ‌స్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 1991లో ఓం సింగ్ రాథోడ్ అలియాస్ ఓం బ‌న్నా అనే ఓ యువ లీడ‌ర్ ఉండేవాడు. అత‌నికి రాయ‌ల్ ఎన్‌ఫీల్డ్ 350 సిసి బైక్ ఉండేది. అయితే ఒక‌రోజు బ‌న్నా అనుకోకుండా ఓ చౌర‌స్తాలోని చెట్టుకు త‌న బైక్‌తో ఢీకొని అక్క‌డిక‌క్క‌డే మృతి చెందాడు. ఈ క్ర‌మంలో పోలీసులు వ‌చ్చి ఆ బైక్‌ను సీజ్ చేసి పోలీస్ స్టేష‌న్‌కు త‌ర‌లించారు. కానీ ఎవ‌రూ తీసుకు రాకుండానే ఆ బైక్ యాక్సిడెంట్ అయిన ప్ర‌దేశానికి దానంత‌ట అదే రాత్రి పూట వ‌చ్చింద‌ట‌. మ‌రుసటి రోజు పోలీసులు ఆ బైక్‌ను చైన్‌లతో క‌ట్టి తీసుకెళ్లారు. అయినా బైక్ మ‌ళ్లీ అలాగే వ‌చ్చింద‌ట‌. దీంతో పోలీసులు దాన్ని అలాగే వ‌దిలేశారు. అయితే అప్ప‌టి స్థానికులు మాత్రం ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గానే తీసుకున్నారు.
bullet-baba-2

bullet-baba-1
త‌మ లీడ‌ర్ బ‌న్నా దుర‌దృష్ట‌వ‌శాత్తూ చ‌నిపోవ‌డంతో బైక్ రూపంలో మ‌ళ్లీ త‌న వ‌ద్ద‌కు వ‌చ్చాడ‌ని స్థానికులు భావించి ఆ బైక్‌ను యాక్సిడెంట్ అయిన చెట్టు వ‌ద్దే ఉంచి దాన్ని పూజించ‌డం మొదలు పెట్టారు. దీంతో ఆ బైక్ ఉన్న ప్ర‌దేశం కాస్తా బుల్లెట్ బాబా పుణ్య‌క్షేత్రంగా మారిపోయింది. ఈ క్ర‌మంలో ఆ బైక్‌కు రోజూ పూజ‌లు చేయ‌డం కోసం ఓ అర్చ‌కున్ని కూడా నియ‌మించారు స్థానికులు. అత‌ను రోజూ వ‌చ్చి బుల్లెట్ బైక్‌ను తుడిచి, క‌డిగి పూజ‌లు చేస్తాడు. స్థానికులు కూడా ఆ బైక్‌కు దండ‌లు వేసి ప్రార్థిస్తారు. కొంద‌రైతే గాజులు, దుస్తులు స‌మ‌ర్పిస్తూ త‌మ కోర్కెల‌ను తీర్చాల‌ని ఆ బుల్లెట్ బాబాను వేడుకుంటున్నారు. దీంతో రోజూ అక్క‌డికి వ‌స్తున్న‌భ‌క్తుల సంఖ్య కూడా పెరుగుతుండ‌డం విశేషం. అయితే ఆ బుల్లెట్ బాబాకు స్థానికులు స‌మర్పిస్తున్న నైవేద్యం ఏంటో తెలుసా..? మ‌ద్యం… అవును, మీరు విన్న‌ది క‌రెక్టే. బీర్‌, బ్రాందీ, విస్కీ… ఇలా అదీ, ఇదీ అని తేడా లేదు.  ఏ ర‌కం మ‌ద్యాన్న‌య‌నా భ‌క్తులు నైవేద్యంగా స‌మ‌ర్పించ‌వ‌చ్చు. ఎందుకంటే… ఆ బుల్లెట్ బాబాకు, అదేనండీ… ఆ బ‌న్నాకు మ‌ద్యం అంటే ఇష్ట‌మ‌ట‌…అందుకే అదే నైవేద్యంగా పెడుతున్నారు. ఏది ఏమైనా… ఇలా ఓ మోటార్ బైక్‌ను దేవుడిగా భావించి పూజ‌లు చేయ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంది క‌దా..!

Comments

comments

Share this post

scroll to top