ఉసిరికాయ జ్యూస్ తాగితే ఎన్ని రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మన శరీరానికి కావల్సిన కీలక పోషకాలు అందడంతోపాటు పలు అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి. అయితే ఈ రోజుల్లో ఉసిరికాయ జ్యూస్ మనకు బాటిల్స్‌లో లభిస్తుండడంతో చాలా మంది వాటిని వాడుతున్నారు. అలాంటి ఉసిరి కాయ జ్యూస్ బాటిల్స్‌లో పతంజలి తయారుచేస్తున్న ఉసిరి కాయ జ్యూస్ బాటిల్స్ కూడా ఉన్నాయి. అయితే ఏంటంటారా..? ఏమీ లేదండీ… పతంజలి తయారు చేస్తున్న ఉసిరికాయ జ్యూస్ నాసిరకమైందట. అలా అని అది మేం చెప్పడం లేదు. ప్రభుత్వ అధికారులు చేపట్టిన పరీక్షల్లో తేలిన నిజమది.
ఢిల్లీలోని ఆర్మీ క్యాంటీన్లలో పతంజలికి చెందిన ఆమ్లా (ఉసిరి కాయ) జ్యూస్ బాటిల్స్‌ను సైనికులకు సప్లై చేస్తున్నారు. కాగా ఈ మధ్యే ఆ జ్యూస్‌పై కొందరికి అనుమానం రావడంతో దాన్ని టెస్టింగ్ నిమిత్తం పంపించారు. కోల్‌కతాలోని పశ్చిమ్ బంగా ప్రజారోగ్య లాబొరేటరీలో ఆ ఆమ్లా జ్యూస్‌కు పరీక్షలు నిర్వహించారు. దీంతో అవాక్కవడం అధికారుల వంతైంది. సదరు పతంజలికి చెందిన ఆమ్లా జ్యూస్ నాసికరమైందట. అలా అని సైంటిస్టులు ధృవీకరించారు.
ఈ క్రమంలోనే ఆర్మీ క్యాంటీన్లలో పతంజలి ఆమ్లా జ్యూస్ పంపిణీని నిలిపి వేశారు. ఆ బాటిల్స్ అన్నింటినీ సీజ్ చేశారు. కాగా ఇదే విషయమై పతంజలికి షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసినట్టు తెలిసింది. ఆ సంస్థ నుంచి సమాధానం కోసం వేచి చూస్తున్నామని అధికారులు తెలిపారు. అయితే పతంజలి మాత్రం ఈ వార్తను కొట్టి పారేస్తోంది. ఆమ్లా జ్యూస్‌ను ఆయుర్వేద ఉత్పత్తిగా పరిగణించాలని, దానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ నిబంధనలు వర్తించవని చెబుతోంది. ఇక ఈ విషయంలో నిర్ణయం తీసుకుని వాటిని వాడాల్సింది జనాలే. కనుక మీరు కూడా అలాంటి జ్యూస్ బాటిల్స్‌ను వాడుతుంటే… ఎందుకైనా మంచిది ఓసారి ఆలోచించండి. లేదంటే అనారోగ్యం పాలైతే ఆ తరువాత చేసేదేం ఉండదు.