కొత్త బట్టలు కొని వెంటనే వేసుకోవాలని చాలా మందికి ఉంటుంది. సందర్భం ఏదైనా కావచ్చు, బట్టలు కొన్నా, కుట్టించినా వాటిని వేసుకునే దాకా చాలా మందికి మనసు మనసులో ఉండదు. ఎప్పుడు వాటిని ధరించాలా అని ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అయితే ఇలా ఎదురు చూడడం తప్పు కాదు కానీ… కొత్త బట్టలను వేసుకునే ముందు ఓ విషయంలో మాత్రం మనం కచ్చితంగా జాగ్రత్త తీసుకోవాల్సిందే. అదేంటంటే… కొత్త బట్టలు ఏవి కొన్నా, ఎవరైనా వాటిని వేసుకునే ముందు ఒకసారి తప్పనిసరిగా ఉతకాలట. అవును, మీరు విన్నది నిజమే. అయితే అలా చేయడం వెనుక సైన్స్ పరంగా, మన పెద్ద వాళ్లు చెప్పే దాన్ని బట్టి దాగి ఉన్న అసలు కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా బట్టలను లేదా వాటి క్లాత్‌ను తయారు చేసే కంపెనీలు దుస్తులు ముడతలు పడకుండా, చూసేందుకు ఆకర్షణీయంగా కనిపించేందుకు పలు రకాల కెమికల్స్, డైలు వాడతారు. వాటిలో ప్రధానంగా ఫార్మాల్డిహైడ్ రెసిన్, అజో అనిలిన్ డైలు ఉంటాయి. ఇవి మన చర్మానికి హాని కలిగిస్తాయి. కొత్త బట్టల్లో ఈ కెమికల్స్ అలాగే ఉంటాయి. కనుక వాటిని మనం అలాగే వేసుకుంటే దాంతో ఆ కెమికల్స్ మన చర్మానికి తగిలి చర్మంపై దురదలు, దద్దుర్లు వచ్చేలా చేస్తాయి. దీంతో పాటు మనం బట్టల షాపుల్లో బట్టలను కొనేటప్పుడు మనకన్నా ముందు ఎంతో మంది వాటిని వేసుకుని ఉంటారు కదా. అలా వేసుకోవడం వల్ల వారికి చెందిన దుమ్ము, ధూళి, వెంట్రుకలు, డెడ్ స్కిన్ సెల్స్ ఆ బట్టల్లోకి చేరుతాయి. అప్పుడు ఆ బట్టలను అలాగే వేసుకుంటే అవన్నీ మన శరీరంపైకి చేరి అనారోగ్యాలను కలిగిస్తాయి. కనుక సైన్స్ పరంగా చెప్పాలంటే కొత్త బట్టలను వేసుకునే ముందు వాటిని కచ్చితంగా ఓసారి ఉతకాల్సిందే..!
ఈ క్రమంలో మన పూర్వీకులు కూడా కొత్త బట్టలను వేసుకునే ముందు ఒకసారి వాటిని ఉతకాలనే చెబుతున్నారు. ఎందుకంటే వెనుకటికి కొత్త బట్టలు వేసుకున్న వారు తరచూ అనారోగ్యాలకు గురయ్యేవారట. దీంతో ఆ దుస్తులపై ప్రతికూల శక్తుల ప్రభావం ఉంటుందని భావించి వాటిని ఉతకమని, అనంతరమే వాటిని వేసుకోవాలని చెబుతూ వస్తున్నారు. అలా వేసుకుంటే ఎలాంటి అనారోగ్యాలు రావని, ప్రతికూల శక్తుల ప్రభావం ఉండదని పెద్దల నమ్మకం. అందుకే వారు కొత్త బట్టలను ఒక్కసారైనా కచ్చితంగా ఉతికి ఆ తరువాతే వేసుకోవాలని చెబుతున్నారు. అయితే కొత్త బట్టల విషయంలో మన పూర్వీకులు చెప్పిన వాటిలో ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే… శుక్రవారం బట్టల కొనుగోలుకు చాలా మంచిదట. శనివారాల్లో బట్టలను అస్సలు కొనుగోలు చేయవద్దట. అంతేకాదు, కొత్త దుస్తులను కూడా ఆ రోజు ధరించవద్దట..!