తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన టీ వాలెట్ యాప్‌, వెబ్‌సైట్‌ల‌ను ఎలా వాడుకోవాలో తెలుసా..?

ప్ర‌స్తుతం మ‌న దేశంలో ప్ర‌జ‌ల‌కు డిజిటల్ పేమెంట్స్ యాప్స్‌, ఆన్‌లైన్ మ‌నీ ట్రాన్స్‌ఫ‌ర్ సైట్లు అనేకం అందుబాటులో ఉన్నాయి. ఎవ‌రైనా త‌మ‌ అనుకూల‌త‌ల‌ను బ‌ట్టి ఆయా యాప్స్‌, వెబ్ సైట్ల‌ను వాడుతుంటారు. అయితే అలాంటి యాప్స్‌, సైట్ల జాబితాలోకి మ‌రో కొత్త యాప్ వ‌చ్చి చేరింది. అదే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌వేశ పెట్టిన టీ వాలెట్ (T Wallet) యాప్‌. నిజానికి ఇది వెబ్‌సైట్‌లోనూ ల‌భిస్తోంది. స్మార్ట్ ఫోన్ అయితే యాప్ వాడాలి. కంప్యూట‌ర్ అయితే ఇంట‌ర్నెట్ బ్రౌజ‌ర్ ఓపెన్ చేసి వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. ఇక ఇవి రెండూ అందుబాటులో లేని వారు మీ సేవ కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది. ఈ క్ర‌మంలో అస‌లు ఈ టీ వాలెట్ ఎలా ప‌నిచేస్తుందో, దాన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

పైనే చెప్పాం క‌దా. టీ వాలెట్ సేవ‌ను కంప్యూటర్‌లో అయితే ఇంటర్నెట్ బ్రౌజర్‌లో అడ్రస్ బార్ ఓపెన్ చేసి https://twallet.telangana.gov.in/LoginPage.aspx వెబ్‌సైట్‌ను సందర్శించి పొంద‌వ‌చ్చు. అదే స్మార్ట్‌ఫోన్లు అయితే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌లకు ప్రత్యేకంగా టీ వాలెట్ యాప్‌లు ఆయా యాప్ స్టోర్‌లలో లభిస్తున్నాయి. వాటిని డౌన్‌లోడ్ చేసుకుని టీ వాలెట్ సేవలను వాడడం ప్రారంభించవచ్చు. ఇక ఈ రెండు ప‌ద్ధ‌తుల్లో కుద‌ర‌దు, ఫోన్ లేదు అనుకుంటే వారు కూడా టీ వాలెట్ యాప్‌ను ఉపయోగించవచ్చు. అయితే అందుకు వారు ఏం చేయాలంటే… యూజ‌ర్లు తమకు సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రానికి వెళ్లి ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌లను ఇచ్చి టీ వాలెట్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇక పైన తెలిపిన రెండు ప‌ద్ధ‌తుల‌ (వెబ్‌సైట్‌, యాప్‌) ద్వారా అయితే ఎవరైనా ముందుగా పేరు, ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, ఆధార్ నంబర్‌లతో రిజిస్టర్ చేసుకోవాలి. అనంత‌రం డ‌బ్బును అందులో లోడ్ చేయాలి. ఆ త‌రువాత దాంతో బిల్లు చెల్లింపులు చేయవచ్చు. న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చేసుకోవ‌చ్చు.

టీ వాలెట్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలైన మీ సేవ, జీహెచ్‌ఎంసీ, జలమండలి, విద్యుత్, ఆర్టీఏ సైట్లలో చెల్లింపులు చేయవచ్చు. ప్రైవేటు కంపెనీలకు చెందిన బిల్స్ కట్టుకోవచ్చు. మొబైల్ రీచార్జి చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే నగదును అవతలి వ్యక్తికి పంపవచ్చు. లేదంటే అవతలి వ్యక్తి టీ వాలెట్‌కు డబ్బును ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. దీంతోపాటు లోడ్ చేసిన డబ్బులను ఐఎంపీఎస్ సేవ ద్వారా సొంత బ్యాంక్ అకౌంట్‌కు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు. డ‌బ్బులు కావాల‌ని అవ‌త‌లి వ్య‌క్తుల‌కు మ‌నీ రిక్వెస్ట్ పంపుకోవ‌చ్చు. దీని వ‌ల్ల డిజిట‌ల్ విధానంలో చెల్లింపులు, న‌గ‌దు ట్రాన్స్‌ఫ‌ర్ చాలా సులువు అవుతాయి.

అత్యంత సురక్షితమైన ఇంటర్నెట్ సేఫ్టీ జాగ్రత్తలను టీ వాలెట్‌లో తీసుకున్నారు. దీని వల్ల ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా చాలా సులుభంగా టీ వాలెట్‌ను వాడుకోవచ్చు. టీ వాలెట్‌ను త్వరలో తెలంగాణ‌ రాష్ట్రంలో ఉన్న 16వేల రేషన్ దుకాణాలకు అనుసంధానం చేయనున్నారు. దీంతో చెల్లింపులు చాలా సులభంగా చేయడమే కాదు, అక్రమాలకు అడ్డుకట్ట పడుతుంది. రాష్ట్రంలో ఉన్న 1100 స్త్రీ నిధి బీసీ పాయింట్లను కూడా టీ వాలెట్‌కు అనుసంధానించనున్నారు. అలాగే ఆసరా, ఎంఎన్‌ఆర్‌ఈజీఏ చెల్లింపులను కూడా టీ వాలెట్‌తో త్వరలో జరపనున్నారు. టీ వాలెట్‌ను ప్రజలు ఎవరైనా ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఇందులో ఎలాంటి చార్జీలు లేవు. ప్రస్తుతం తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో టీ వాలెట్ సేవలు లభిస్తున్నాయి.

Comments

comments

Share this post

scroll to top