హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం దేవాల‌యాల్లో భ‌గవంతున్ని ఎలా ప్రార్థించాలో తెలుసా..?

హిందూ సాంప్ర‌దాయంలో దేవాల‌యాల‌కు వెళ్ల‌డం, దేవుళ్ల‌కు, దేవ‌త‌ల‌కు మొక్కుకోవడం, వీలైతే అర్చ‌నో, పూజో చేయించుకోవ‌డం, హుండీలో ఎంతో కొంత వేసి త‌మ కోర్కెల‌ను తీర్చాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్థించ‌డం భ‌క్తుల‌కు అలవాటే. ఆ సంద‌ర్భంలో గుళ్లో ఉన్న పూజార్ల‌కు కూడా భ‌క్తులు ఎంతో కొంత సంభావ‌న ముట్ట జెపుతుంటారు. భ‌గ‌వంతునికి చెప్పి త‌మ కోర్కెలు నెర‌వేరేలా దీవించాల‌ని మ‌రింత గ‌ట్టిగా పూజార్లకు విన్న‌విస్తారు. అయితే ఇదంతా చేయ‌డం స‌రైందే… కానీ.!?… అంతా చెప్పి, కానీ… అంటున్నారేంట‌ని సందేహంగా చూస్తున్నారా..? అవును… మీరు సందేహ ప‌డుతున్న‌ట్టు ఆ కానీ… వెనుక మ‌నం తెలుసుకోవాల్సిన విష‌యాలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా దేవాల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు అస‌లు భ‌గ‌వంతున్ని ఎలా ప్రార్థించాలి..? ఏ విధంగా ప్రార్థిస్తే భ‌క్తుల కోర్కెలు నెర‌వేరేందుకు అవ‌కాశం ఉంటుంది..? అనే విష‌యాల‌ను గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేవాల‌యాల‌కు వెళ్లిన‌ప్పుడు భ‌క్తులు ఎలా ప్రార్థించాలో, ఫ‌లితం ఎలా రాబ‌ట్టుకోవాలో అనే దానిపై నార‌ద పురాణంలో వివ‌రించారు. వాటిలో ముఖ్య‌మైన అంశాలివే…

hindu-prayer
* సాధార‌ణంగా చాలా మందికి దేవాల‌యాల‌కు వెళ్ల‌డం ఇష్టం ఉండ‌దు. త‌ల్లిదండ్రులు లేదా పెద్ద‌ల బల‌వంతం మీద‌నో, మ‌రే ఇత‌ర కార‌ణాల వ‌ల్లో దేవాల‌యాల‌కు వెళ్తారు. అయిష్టంగానే పూజ‌లు చేస్తారు. దేవుళ్ల‌కు మొక్కుతారు. కానీ అస‌లు అలా మొక్క‌కూడ‌ద‌ట‌. అలా మొక్కితే అస‌లు ఫ‌లితం ఏమీ ఉండ‌ద‌ట‌. పూర్తిగా మ‌న‌స్సులో ఇష్ట ప్ర‌కారం భ‌గ‌వంతున్ని ప్రార్థిస్తేనే సరైన ఫ‌లితం ఉంటుంద‌ట‌.

* దేవుడికి మొక్క‌క‌పోతే మ‌న‌కు ఏదో కీడు జ‌రుగుతుంది, లేదంటే మ‌న‌కు అస్స‌లు మంచి జ‌ర‌గ‌దు… లాంటి భావ‌న‌ల‌తో, భ‌యంతో దేవున్ని మొక్క‌కూడ‌ద‌ట‌. అలా మొక్కినా ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌ట‌. మ‌న‌స్సులో ఎలాంటి భ‌యం లేకుండా భ‌గవంతున్ని ప్రార్థించాల‌ట‌.

* కొంద‌రు త‌మ‌కు తెలిసిన లేదంటే పుస్త‌కాలు చ‌దివి లేదా ఇత‌రులు చెప్పిన మంత్రాల‌తో దేవున్ని ప్రార్థిస్తారు. అయితే అవి నిజంగా సరైన మంత్రాలే అయితే వాటిని ఉచ్ఛ‌రించి దేవున్ని ప్రార్థించ‌వ‌చ్చ‌ట‌. కానీ తెలిసీ తెలియ‌ని మంత్రాల‌తో మాత్రం దేవున్ని ప్రార్థించ‌కూడ‌ద‌ట‌. పూజ‌లు చేయ‌వ‌ద్ద‌ట‌. అంత‌క‌న్నా సింపుల్‌గా దేవుడికి దండం పెట్టుకుని ప్రార్థిస్తే చాల‌ట‌. దాంతో భ‌క్తులు అనుకున్న‌వి జ‌రిగేందుకు అవ‌కాశం ఉంటుంద‌ట‌.

* భ‌క్తులు ఎవ‌రైనా త‌మ వ్య‌క్తిగ‌త స్వార్థం కోసం పూజ‌లు చేయ‌కూడ‌ద‌ట‌. భ‌గ‌వంతున్ని ప్రార్థించ‌కూడ‌ద‌ట‌. స్వార్థంతో దేవున్ని పూజించినా దాని వ‌ల్ల ఎలాంటి ఫ‌లితం క‌ల‌గ‌ద‌ట‌. నిర్మ‌ల‌మైన మ‌న‌స్సుతో, మ‌న‌స్సులో ఎలాంటి స్వార్థం, దురాశ లేకుండా దేవున్ని ప్రార్థించాల‌ట‌.

Comments

comments

Share this post

scroll to top