గుహల్లో చదువులు…చుట్టూ బాంబులు పేలుతున్న తరుణంలో తప్పని తిప్పలు.

సిరియా సంక్షోభం, అంత‌ర్యుద్ధం గురించి అంద‌రికీ తెలిసిందే. ప్ర‌భుత్వ అనుకూల‌, వ్య‌తిరేక వ‌ర్గాల మ‌ధ్య జ‌రుగుతున్న నిర‌స‌న పోరు తీవ్ర‌త‌ర‌మై అగ్ర‌రాజ్యాలు జోక్యం చేసుకునే దాకా వెళ్లింది. దీంతో అంతర్యుద్ధం కాస్తా ప్ర‌పంచ దేశాల యుద్ధంగా మారింద‌నే చెప్ప‌వ‌చ్చు. దీని కార‌ణంగా ఎన్నో ఏళ్ల నుంచి కొన్ని ల‌క్ష‌ల మంది పౌరులు చ‌నిపోయారు. కొన్ని కోట్ల మంది నిరాశ్ర‌యులై ఇత‌ర దేశాల‌కు వ‌ల‌స వెళ్లారు. ఇంకా అక్క‌డ మిగిలి ఉన్న వారు గుహ‌ల్లో, బంక‌ర్ల‌లో త‌ల‌దాచుకుని నిత్యం బాంబుల శ‌బ్దాలు, తుపాకుల మోత‌ల మ‌ధ్య ఎప్పుడు ప్రాణాలు పోతాయో తెలియ‌ని అత్యంత దుర్భ‌ర‌మైన జీవితం గ‌డుపుతున్నారు. కింద ఇచ్చిన ఫొటో స‌రిగ్గా అదే కోవ‌కు చెందుతుంది.

syrian-children-1

యుద్ధం కార‌ణంగా సిరియాలోని అలెప్పో న‌గ‌రం పూర్తిగా ధ్వంసం కాగా అక్క‌డికి కొద్ది దూరంలో ఉన్న ఇడ్‌లిబ్ అనే ఓ ప్రాంతంలో ఓ గుహ‌లో పిల్ల‌లు చ‌దువుకుంటున్న దృశ్య‌మ‌ది. అప్ప‌టికి కొద్ది రోజుల ముందు వారి స్కూల్ భ‌వ‌నంపై బాంబుల దాడి జ‌రిగింది. దీంతో 22 మంది విద్యార్థులు, ఆరుగురు ఉపాధ్యాయులు మృతి చెందారు. అనేక మందికి తీవ్ర గాయాల‌య్యాయి. అయితే ఆ దాడిలో బ‌తికి బ‌ట్ట‌క‌ట్టిన అహ్మ‌ద్ అనే ఓ ఉపాధ్యాయుడు పిల్ల‌ల‌కు చ‌దువునందించాల‌నే ఉద్దేశంతో సిటీకి దూరంగా ఉన్న ఓ గుహ‌లో పాఠ‌శాల‌ను ఏర్పాటు చేశాడు. అందులోనే స్థానిక పిల్ల‌లు ఇప్పుడు విద్యాభ్యాసం కొన‌సాగిస్తున్నారు. అత్యంత దిగ్భ్రాంతిని క‌లిగించే విష‌యమిది.

syrian-children-2

స‌ద‌రు ఉపాధ్యాయుడు అహ్మ‌ద్‌ ఆ పాఠ‌శాల‌ను గుహ‌లో ప్రారంభించిన‌ప్పుడు కేవ‌లం కొంద‌రు మాత్ర‌మే అక్క‌డికి వ‌చ్చారు. అయితే ఇప్పుడందులో 120 మంది చ‌దువుకుంటున్నారు. అందుకు కార‌ణం చ‌దువుకోవాల‌న్న ఆకాంక్ష ఆ పిల్ల‌ల్లో బ‌లంగా ఉండ‌డ‌మే. అయితే వీరికి అండ‌గా యునిసెఫ్ కూడా త‌న వంతు స‌హాయ స‌హ‌కారాల‌ను అందిస్తోంది. ఈ క్ర‌మంలో అనేక మంది పిల్ల‌లు ఆ గుహ‌లో చ‌దువుకునేందుకు ఆస‌క్తి చూపుతున్నారు కూడా. ఏది ఏమైనా ఇలాంటి అవ‌స్థ ఏ పిల్ల‌ల‌కూ రాకూడ‌దు క‌దా..! ఇప్ప‌టికీ వారికి భ‌య‌మే. ఏ రోజు ఏ స‌మ‌యంలో ఏ ఉప‌ద్ర‌వం వ‌స్తుందో, ఎటు నుంచి బాంబులు ప‌డ‌తాయో తెలియ‌దు. అయినా వారి ముందున్న ఆశ‌యం ఒక్కటే. చ‌దువు..! అదే వారికి కావాలి..! మిగ‌తా వాటి గురించి వారికి అన‌వ‌స‌రం..!

Comments

comments

Share this post

scroll to top