దివంగత ముఖ్యమంత్రి జయలలితకు శశికళ ఎంతో దగ్గర అన్న విషయం అందరికీ తెలిసిందే. సొంత చెల్లెలుగా, కొన్ని సందర్భాల్లో తనకే సలహాలిచ్చే తల్లిగా కూడా జయలలిత శశికళకు ప్రాధాన్యం ఇచ్చేవారు. ఎన్నో విపత్కర పరిస్థితుల్లో శశికళ జయకు తోడుగా నిలవగా ఒకానొక దశలో వీరిద్దరి మధ్య పొరపచ్చాలు ఏర్పడి విడిపోయారు. అయినా జయ శశికళను మళ్లీ చేరదీసింది. ఈ క్రమంలో ఇటీవల జయలలిత మరణించినా ఆమె అంత్యక్రియలన్నీ శశికళ చేతుల మీదుగానే జరిగాయి. అంతా ఆమె చెప్పినట్టే నడుచుకున్నారు. అయితే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో వినిపిస్తున్న చర్చ ఒక్కటే. అన్నాడీఎంకే పార్టీని ఎవరు నడిపిస్తారని..? అందుకు సమాధానం అందరికీ తెలిసిందే..! శశికళే ఆ పార్టీ బాధ్యతలు నిర్వహించనున్నారని తెలిసింది. ఈ క్రమంలో సాధారణ స్థాయికి చెందిన శశికళ అనే ఓ మహిళ అసలు జయకు ఎలా పరిచయమైంది..? వారి బంధం ఎలా కొనసాగింది..? అన్న వివరాల్లోకి వెళితే…
శశికళ జన్మస్థలం తమిళనాడులోని మన్నార్గుడి. ఈమె తల్లిదండ్రులు వ్యవసాయం చేసే వారు. కాగా కల్లార్ సామాజిక వర్గానికి చెందిన నటరాజన్ అనే వ్యక్తిని శశికళ పెళ్లి చేసుకుంది. ఇతను 1970 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన వాడు. అప్పట్లో ఎంజీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆ ప్రభుత్వంలో పీఆర్వోగా పనిచేశాడు. అయితే చంద్రలేఖ అనే మరో ఐఏఎస్ అధికారిణి ద్వారా నటరాజన్ తన భార్య శశికళను జయకు పరిచయం చేశాడు. అప్పట్లో జయ సినిమా స్టార్‌గా అందరికీ తెలుసు. కానీ రాజకీయంగా మాత్రం ఎవరికీ అంతగా పరిచయం లేదు. ఎందుకంటే ఎంజీఆర్ పెట్టిన పార్టీలో జయ ఒక సాధారణ కార్యకర్తగా చేరారు. ఆ సమయంలో శశికళ జయ మీద అభిమానంతో ఆమెను కలవాలని అనుకుంది. అందుకు తన వీడియో పార్లర్ వ్యాపారం తోడ్పడింది.
భర్త నటరాజన్ ప్రభుత్వ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నప్పుడు శశికళ వీడియో పార్లర్ వ్యాపారం చేసేది. పెళ్లిళ్లకు, శుభకార్యాలకు ఈమె వీడియోలను తీసేది. ఆ క్రమంలో జయను కూడా వీడియో తీస్తానని, ఓ సారి పరిచయం చేయాలని భర్త నటరాజన్‌ను అడగ్గా అతను చంద్రలేఖ అనే ఐఏఎస్ అధికారిణి సహాయంతో ఎంజీఆర్ దగ్గర ఉన్న జయను శశికళకు పరిచయం చేశారు. అప్పుడు 1982వ సంవత్సరం. అలా శశికళ జయకు దగ్గరైంది. క్రమంగా వారి మధ్య బంధం బలపడింది. ఎంతగా అంటే ఎవరైనా వారిని చూస్తే సొంత అక్క, చెల్లెల్లు అనుకుంటారు. అంతలా వారిద్దరు కలసిపోయారు. అయితే అన్నాడీఎంకే పార్టీలో జయ ఒక్కో మెట్టూ ఎదుగుతూ ఉన్న సమయంలోనే పార్టీలో పొరపచ్చాలు వచ్చాయి. ఈ క్రమంలో దానంతటికీ బాధ్యత వహిస్తూ జయ రాజీనామా చేసినా అనంతరం మళ్లీ ఎంజీఆర్ ఆమెను పార్టీలోకి తీసుకున్నారు. అయితే ఆ విపత్కర సమయంలోనూ శశికళ జయ వెన్నంటే ఉన్నారు. అనంతరం ఎంజీఆర్ చనిపోయాక, జయ ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. సీఎం పదవి చేపట్టారు. ఓ క్రమంలో అక్రమాస్తుల కేసు ఎదుర్కొన్నా శశికళ జయ వెన్నంటే ఉండి ధైర్యం చెప్పారు. అయితే అనుకోని కారణాల వల్ల శశికళ దూరమైనా జయ ఆమెను మళ్లీ అక్కున చేర్చుకున్నారు. అదీ… వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం..!
ఇక…జయలలిత అండ్ శశికళ….హోమోసెక్సువల్స్, అందుకే జయ పెళ్లి చేసుకోలేదు, అంతేకాదు శశికళ జయ ఇంట్లోనే ఉండడానికి ఇది ఓ కారణమంటూ పెద్ద ఎత్తున పుకార్లు కూడా తమిళనాట హల్ చల్ చేశాయి. అయినా జయ వాటిని ఏ మాత్రం ఖాతరు చేయలేదు. జయలలిత అమ్మగా తమిళ ప్రజల మన్నన్నలు పొందితే…శశికళ చిన్నమ్మగా పాపులర్ అయ్యారు.