వాహ‌నాల ఫ్యాన్సీ నంబర్ల వేలం పాట‌లో 9999 నంబ‌ర్‌కు ఎంత ధ‌ర వ‌చ్చిందో తెలిస్తే షాక‌వుతారు..!

1, 2, 3… 9 వ‌ర‌కు… 1234, 1111, 9999… 0099… ఏంటివ‌న్నీ అనుకుంటున్నారా..? అవేనండీ… వాహ‌నాల ఫ్యాన్సీ నంబ‌ర్లు. వీటి ధ‌ర ఎంత ఉంటుందో అంద‌రికీ తెలిసిందే. కొన్ని ల‌క్ష‌ల్లో ఉంటుంది. అన్ని ల‌క్ష‌లు పెట్టినా మ‌న‌కు అవి వ‌స్తాయ‌న్న గ్యారంటీ లేదు. ఎందుకంటే వాటికి వేలం పాట పెడ‌తారు. ఆ పాట‌లో రేటు ఎంతైనా ప‌ల‌క‌వ‌చ్చు. అందుకు సిద్ధంగా ఉండి, అంత మొత్తం చెల్లిస్తేనే అప్పుడు మ‌నం కోరుకున్న ఫ్యాన్సీ నంబ‌ర్ మ‌న సొంత‌మ‌వుతుంది. లేదంటే నిరాశ త‌ప్ప‌దు. అయితే ఇటీవ‌లే తెలంగాణ ర‌వాణా శాఖ అధికారులు ఇలాంటి ఫ్యాన్సీ నంబ‌ర్ల‌కు వేలం పాట నిర్వ‌హించారు. అందులో ఏ నంబ‌ర్‌ ఎక్కువ ధ‌ర పలికిందో తెలుసా..?

తెలంగాణ రవాణాశాఖ నిర్వహించిన ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ప‌లు నంబ‌ర్లు మంచి ధ‌ర ప‌లికాయి. అత్యధికంగా 9999 నంబ‌ర్‌ రూ. 10 లక్షల ధ‌ర‌ పలికింది. టీఎస్‌ 09 ఈఎస్‌ 9999 నంబరును హెటిరో డ్రగ్స్‌ ప్రతినిధులు రూ.10 లక్షలకు పాడుకున్నారు. రూ. 6.85 కోట్ల విలువైన బెంట్లీ ముల్సానే బ్రాండు కారుకు గాను వారు ఈ నంబరు తీసుకున్నారు. అదేవిధంగా టీఎస్‌ 09 ఈఎస్‌ 0099 నంబరును రూ. 1.93 లక్షలకు సుశీ ఇన్‌ఫ్రా అండ్‌ మైనింగ్‌ లిమిటెడ్ వారు పాడుకున్నారు. రూ. 4.49 కోట్లతో కొన్న ఫెరారీ 488 జీటీబీ మోడల్‌కు గాను వారు ఈ నంబర్‌ పొందారు.

అదే వేలం పాట‌లో టీఎస్‌ 09 ఈఎస్‌ 0009 నంబరు రూ. 1.73 లక్షల ధర పలికింది. ఇంటర్‌ కాంటినెంటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌ సంస్థ రూ. 20 లక్షలతో తీసుకున్న ఇన్నోవా క్రిస్టా కారుకు గాను ఈ నంబరు తీసుకుంది. ఇక టీఎస్‌ 09 ఈఎటీ 0007 నంబరును గాయత్రి ప్రాజెక్ట్స్ సంస్థ రూ. 1.15 లక్షలకు పాడుకుంది. రూ. 1.28 కోట్లతో కొన్న బెంజ్‌ ఎస్‌350 సీడీఐ కారుకు గాను వారు ఈ నంబరు ద‌క్కించుకున్నారు. ఏది ఏమైనా ఫ్యాన్సీ నంబ‌ర్ల‌కు అంతటి ధ‌ర ప‌ల‌క‌డం విశేష‌మే. అయినా డ‌బ్బుండాలే గానీ ఫ్యాన్సీ నంబ‌ర్లు ఏమిటి, కొండ మీది కోతి అయినా దిగి వ‌స్తుంది, వారు కావాలనుకుంటే..!

Comments

comments

Share this post

scroll to top