కంప్యూటర్లు, ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలు… ఇలా ఎక్కడ చూసినా నేటి తరుణంలో చాలా మంది ఆయా గ్యాడ్జెట్లలో ఫేస్‌బుక్‌ను ఎక్కువగా వాడుతున్నారు. నిత్యం ఉదయం నిద్ర లేచింది మొదలు మళ్లీ రాత్రి నిద్రించే వరకు ఫేస్బుక్లో విహరిస్తున్నారు. ఏ సందర్భంలో ఉన్న లైవ్ వీడియోలు పెట్టడమో, లేదంటే ఫొటోలు తీసి పోస్ట్ చేయడమో చేస్తున్నారు. ఇంకా కొందరైతే సరదా అయిన విషయాలను ఫేస్బుక్ లో షేర్ చేస్తున్నారు. అయితే మీకు తెలుసా..? మనం ఫేస్‌బుక్‌ను ఉచితంగా వాడుకుంటున్నాం. కానీ ఫేస్బుక్ మాత్రం మన వల్ల ఎంతో ఆదాయాన్ని పొందుతోంది. అవును, మీరు విన్నది నిజమే. అయితే అదెలాగో మీరే తెలుసుకోండి..!
ఏమీ లేదండీ.. ఫేస్బుక్ ను మనం ఓపెన్ చూస్తే అందులో పోస్టు మధ్యలో మనకు యాడ్స్ కనిపిస్తాయి కదా. అవును, మనం ఫేస్బుక్ లో ఎంత ఎక్కువ సేపు ఉంటే అన్ని ఎక్కువ యాడ్స్‌ను చూస్తాం కదా. ఆ క్రమంలోనే మనం చూసిన యాడ్స్‌కు గాను ఆయా కంపెనీల నుంచి ఫేస్బుక్ డబ్బును వసూలు చేస్తుంది. అలా మన వల్ల ఫేస్బుక్ కు ఆదాయం వస్తుంది. మరి ప్రపంచం మొత్తం మీద ఉన్న ఫేస్బుక్ యూజర్లలో ఒక్కో యూజర్ వల్ల యావరేజ్ గా ఫేస్బుక్ ఎంత సంపాదిస్తుందో తెలుసా..? 4.01 డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు రూ.258 అన్నమాట. మరి ప్రపంచ వ్యాప్తంగా ఫేస్‌బుక్‌కు ఎంత మంది యూజర్లు ఉన్నారో తెలుసా..? 1.79 బిలియన్ల మంది. దీన్ని బట్టి మీరు ఊహించుకోండి. ఫేస్‌బుక్‌కు మన వల్ల ఎంత ఆదాయం వస్తుందో..! ఊహిస్తేనే షాకింగ్‌గా ఉంది కదా.
అయితే ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఏ దేశానికి చెందిన యూజర్ల వల్ల ఫేస్బుక్ ఎక్కువ డబ్బులు సంపాదిస్తుందో తెలుసా..? అమెరికా వల్ల. అక్కడ యావరేజ్‌గా ఒక్కో యూజర్ వల్ల ఫేస్‌బుక్‌కు రూ.4176 ఆదాయం వస్తోంది. ఇక యూరప్‌లో ఒక్కో యూజర్ వల్ల రూ.1259, ఆసియా పసిఫిక్‌లో రూ.504, మిగిలిన ప్రాంతాలలోని యూజర్ల వల్ల యావరేజ్‌గా ఫేస్బుక్ ఒక్కో యూజర్ కు గాను రూ.322లను సంపాదిస్తోంది. అవును మరి. మన సరదాయే వారికి ఆదాయం. మనం ఎంత ఎక్కువగా ఫేస్‌బుక్‌ను చూస్తే వారికి అంత ఎక్కువ ఆదాయం యాడ్స్ వల్ల వస్తుంది. అయితే ఈ లెక్కలనీ ఒట్టి మాటలు కావు. నిజాలే. వీటిని స్వయంగా ఫేస్బుక్ సంస్థే తాజాగా వెల్లడించింది..!