చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం అనే సామెతను గురించి మీరు వినే ఉంటారు. అంటే, ఇది ఫలానా చెట్టు, దాని కాయలు ఇవి… వీటిని తింటే.. అబ్బో… చెప్పేదేముంది, చాలా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి… అసలు ఈ చెట్టు కాయలను మీరు తిని తీరాల్సిందే… ఆహా… ఒహో… అంటూ ఊదరగొట్టి, చివరకు కొనుగోలుదారులను ఎలాగో బుట్టలో పడేసి కాయలన్నింటినీ ఎక్కువ ధరకు అమ్ముకుని సొమ్ము చేసుకోవడం అన్నమాట. ఇక దాని తరువాత చూసుకోండి… అప్పటికే ఈ చెట్టు కాయల గురించి ప్రచారం జరుగుతుంది కదా, దీంతో అటు తర్వాత నుంచి ఆ వ్యాపారి ప్రత్యేకంగా టముకు వేసి చెప్పాల్సిన పని లేకుండానే కాయలు బేరం పెట్టకముందు నుంచే వాటిని కొనేందుకు కొనుగోలు దారులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఒక వేళ ఆ కాయలు నిజంగా పనికి మాలినవే అయినా సరే… అవి ఎప్పుడు వస్తాయా… ఎప్పుడు కొందామా అన్నట్టుగా చూస్తుంటారు. అదిగో, సరిగ్గా ఇదే సామెత యాపిల్‌కు కూడా వర్తిస్తుందట. పలు టెక్ రీసెర్చ్ సంస్థలు ఇదే చెబుతున్నాయి. అయితే యాపిల్ అంటే యాపిల్ పండు కాదండోయ్. యాపిల్ కంపెనీ. ఐఫోన్లను తయారు చేస్తారు కదా, అదే కంపెనీ. ఇంతకీ చెట్టు పేరు చెప్పి కాయలమ్ముకోవడం అనేది యాపిల్‌కు ఎందుకు వర్తిస్తుంది..?
ఐఫోన్… దీని గురించి దాదాపుగా చాలా మందికి తెలుసు. ధర ఎక్కువ ఉంటుందని. ఇక దాన్ని వాడిన వారికైతే ఫీచర్స్ గురించి కూడా తెలుస్తాయనుకోండి, అది వేరే విషయం. అయితే ఐఫోన్ విడుదలైన తొలి నాళ్ల నుంచి ఇప్పటి వరకు వచ్చిన అన్ని మోడల్స్ ధరలు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. సాధారణ మొబైల్ వినియోగదారులెవరూ ఊహించని రేంజ్లో వాటి ధరలు ఉంటూ వచ్చాయి. అంతెందుకు ప్రస్తుతం విడుదలైన ఐఫోన్ 7 బేసిక్ మోడల్ (32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియెంట్) ధర ఎంతో తెలుసా..? అక్షరాలా రూ.60వేలు. అక్టోబర్ 7న భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. అయితే అసలు ఈ ఫోన్‌ను తయారు చేసేందుకు నిజంగా అంత ఖర్చవుతుందా..? అందులో అంత కాస్ ఉందా..? ఇప్పుడు చూద్దాం…
ఐఫోన్ 7 బేసిక్ మోడల్‌ను ఐహెచ్ఎస్ అనే ఓ టెక్ రీసెర్చ్ సంస్థ ఏ పార్ట్‌కి ఆ పార్ట్ విడదీసి అందులో ఉన్న హార్డ్‌వేర్‌ను మొదట గుర్తించింది. వాటన్నింటినీ విడి విడిగా పెట్టి ఒక్కో దాని ఖరీదును లెక్కించింది. వాటి వివరాలు ఇవిగో…
- ఐఫోన్ 7 ప్రాసెసర్ ధర – 26.90 డాలర్లు
- బేస్‌బ్యాండ్ ధర – 33.90 డాలర్లు
- బ్యాటరీ – 2.50 డాలర్లు
- బ్లూటూత్, వైపై, ఇతర కనెక్టివిటీ డివైస్‌లు – 8 డాలర్లు
- కెమెరాలు – 19.90 డాలర్లు
- డిస్ప్లే – 43 డాలర్లు
- యాంటెన్నా, కనెక్టర్లు, మైక్రోఫోన్, పీసీబీ, స్పీకర్లు – 16.70 డాలర్లు
- సెమి కండక్టర్లు – 1.30 డాలర్లు
- ఎన్‌క్లోజర్స్, లేబుల్స్, ఇన్సులేటర్స్ తదితరాలు – 18.20 డాలర్లు
- మెమోరీ (ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్) – 16.40 డాలర్లు
- పవర్ మేనేజ్మెంట్ చిప్స్ – 7.20 డాలర్లు
- ఆడియో, ఎన్ఎఫ్సీ, సెన్సార్లు – 14 డాలర్లు
- లైటెనింగ్ కేబుల్, ఆడియో అడాప్టర్, హెడ్సెట్ కనెక్టర్, ఛార్జర్ – 11.80 డాలర్లు
- అసెంబ్లింగ్, టెస్టింగ్ – 5 డాలర్లు
- మొత్తం – 224.80 డాలర్లు
అంటే మన కరెన్సీ ప్రకారం ఐఫోన్ 7 బేసిక్ మోడల్ తయారీకి అయ్యే ఖర్చు రూ.15,067.10 మాత్రమే. దీనికి ఇతర పన్నులు కలిపినా మరో రూ.3వేలు, రూ.4వేలకు ఎక్కువ కాదు. అయితే ఈ ఫోన్ మన దగ్గర ఎంత ధరకు లభించనుందో తెలుసా..? అక్షరాలా రూ.60వేలకు. అంటే తయారీ కన్నా దాదాపుగా 4 రెట్ల ఎక్కువ ధరను వెచ్చించి మనం ఐఫోన్ 7 బేసిక్ మోడల్‌ను కొనుగోలు చేస్తాం అన్నమాట.
ఐఫోన్లలో ఉండే ఫీచర్లు ఎలా ఉన్నా ముందు నుంచీ యాపిల్ ఐఫోన్ అంటే ఒక విలాసవంతమైన బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌గా మారిపోయింది. అది మొదట్నుంచీ అలాగే ఉన్నా అసలు ఆ ఫోన్లకు ఎందుకు అంత ఎక్కువ ధర అంటే ఇప్పటికీ ఏ టెక్ విశ్లేషకుడూ, నిపుణుడూ సరిగ్గా చెప్పలేడు. అది అంతే. ఐఫోన్ ధర అంతే ఉంటుంది లెండి. అని చెప్పడం తప్ప ఎవరూ ఈ ఎక్కువ ధరకు కారణం సరిగ్గా చెప్పడం లేదు. సరే ఫీచర్లు బాగానే ఉంటాయి అని అనుకున్నా, మరీ 4 రెట్ల ఎక్కువ ధర పెట్టడం ఏంటండీ బాబూ..! అంతేలే… మొదట్నుంచీ ఐఫోన్‌ను అమాంతం పైకి లేపి, ఎక్కువ ధరకు అమ్ముతూ వచ్చారు. ఆ క్రమంలో యాపిల్ అనే కంపెనీ ఓ చెట్టులా మారింది. అదే సమయంలో ఆ చెట్టుకూ ప్రాచుర్యం బాగా వచ్చింది. ఇక దానికి పండే కాయలు ముక్కిపోతేనేం, మురిగిపోతేనేం దానికి కావల్సిన పేరైతే వచ్చింది కదా, దీంతో ఆ కాయలను ఎగబడి కొంటారు మరి. అందులో ఆ చెట్టుకు ప్రస్తుతం పండిన కాయలు, అవే ఐఫోన్ 7, 7 ప్లస్. ఇక వీటిని అమ్మేందుకు యాపిల్ తన చెట్టు పేరును ఎంతగా వాడుకుంటుందో వేచి చూడాలిక. అయినా మన పిచ్చి గానీ ఒక వస్తువును గీచి గీచి బేరమాడి కొనే మనం మరీ అలాంటి వస్తువుకు 4 రెట్ల ధరను వెచ్చించి కొనుగోలు చేస్తామా ఏంటీ..?
అన్నట్టు చివరిగా ఇంకో విషయం… మన దగ్గరంటే ఈ ఫోన్లు లేటుగా వస్తున్నాయి కానీ అదే అమెరికా, లండన్ వంటి దేశాల్లో ఇప్పటికే ఈ ఫోన్లను వాడడం మొదలెట్టేశారు. అయితే ఈ ఫోన్లలో అదేదో నో సర్వీస్ బగ్ (సాఫ్ట్వేర్ ఎర్రర్) అని ఓ సమస్య వస్తుందట. దీంతో ఆయా ఫోన్లలో సిగ్నల్ సరిగ్గా రావడం లేదని సదరు దేశాల యూజర్లు ఇప్పటికే మొత్తుకుంటున్నారు. యాపిల్ దీ నిపై అధికారికంగా స్పందించలేదు. మన దగ్గర ఆ సమస్య వస్తుందా..? లేదా..? అన్నది ఆ ఫోన్ రిలీజ్ (అక్టోబర్ 7) తర్వాత తెలుస్తుంది.