స్కూల్లో, కాలేజీలో చదువుకున్న గురుత్వాకర్షణ సిద్ధాంతం మీకు గుర్తుందా..? అదేనండీ, భూమిపై ఏ వస్తువును పైకి వేసినా అది మళ్లీ తిరిగి భూమి పైనే పడుతుంది. భూమికి ఉన్న గురుత్వాకర్షణ బలం వల్లే అలా వస్తువులు మళ్లీ కిందకి వస్తాయి. అవును, అయితే ఏంటంటారా..? ఏం లేదండీ, భూమికి ఉన్న గురుత్వాకర్షణ బలం వల్ల మనం భూమిపై ఉండగలుగుతున్నాం. అన్ని పనులు చేయగలుగుతున్నాం. మరి గురుత్వాకర్షణ బలం అత్యంత తక్కువగా లేదా అసలు ఆ బలం లేని ప్రదేశంలో ఎలా ఉండగలమో ఆలోచించగలరా..? ఉండగలం, కానీ అప్పుడు మనం గాల్లో తేలుతూనే ఉంటాం. అన్ని వస్తువులు తేలుతూనే ఉంటాయి. అంతరిక్షంలోని ప్రత్యేక నౌకలలో ఉండే వ్యోమగాములకు కూడా సరిగ్గా ఇలాగే అవుతుంది. అయితే మరి వారు తినడం, బ్రష్ చేసుకోవడం, వాంతి చేసుకోవడం వంటి పనులు ఎలా చేస్తారు..? అప్పుడన్నీ గాల్లోనే తేలుతూనే ఉంటాయి కదా, అప్పుడు వారికి ఇబ్బంది అవుతుంది కదా..? అనబోతున్నారా..? అవును, మీరు చెప్పింది నిజమే. అయితే వారి కోసం కొన్ని ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉంటాయి. ఇంతకీ అవేంటో తెలుసా..?
మనం భూమిపై ఉన్నప్పుడు తినే విధంగా అన్నం, కూర, పెరుగు లేదా పిజ్జా, బర్గర్, శాండ్విచ్ వంటి వాటిని అంతరిక్షంలో తినలేం. ఎందుకంటే పైన చెప్పాం కదా, అవి గాల్లోకి తేలిపోతాయి. అయితే వ్యోమగాములు మాత్రం అలాంటి ఆహారం తినరు. వారు అందుకు బదులుగా టార్టిలాస్ అని పిలవబడే ఆహారాన్ని మాత్రమే తింటారు. ఇక పళ్లు తోముకునే విషయానికి వస్తే వారు మనలా పేస్ట్ పెట్టుకుని బ్రష్ చేసుకోరు. పేస్ట్ మొత్తాన్ని మింగేస్తారు.
వ్యోమగాములకు బట్టలు పిండుకోవడం కూడా ఇబ్బందే. ఎందుకంటే బట్టలను పిండితే అందులోంచి నీరు బయటికి రాదు. వారు ప్రత్యేక మిషన్‌ను అందుకోసం వాడుతారు. అనారోగ్యంగా ఉండి వాంతి చేసుకుంటే దాన్ని పట్టుకునేందుకు ఓ ప్రత్యేకమైన పాలిథీన్ సంచిని ఇస్తారు. లేదంటే వాంతి అంతా గాల్లోనే తేలుతుంది.
వ్యోమగాములైన పురుషులు షేవింగ్ చేసుకోవాల్సి వస్తే అందుకు ప్రత్యేకమైన క్రీములు ఉంటాయి. కానీ నీళ్లను మాత్రం ఉపయోగించరు. అదే విధంగా హెయిర్ కట్ చేయించుకునేటప్పుడు ప్రత్యేకమైన వాక్యూమ్ పైప్ ద్వారా వెంట్రుకలను మిషన్‌లోకి పంపుతారు. అంతరిక్షంలో వ్యోమగాములు కూరగాయలను కూడా తింటారు. కాకపోతే వారికి వాటిని డీహైడ్రేట్ చేసి ప్యాక్‌లలో సప్లై చేస్తారు. అనంతరం వ్యోమగాములు వాటిని రీహైడ్రేట్ చేసుకుని తినాలి. అందుకోసం ప్రత్యేకమైన మిషన్లను వాడుతారు. చేతులను కడుక్కునేందుకు పౌచ్‌లో ఉండే సోప్ వాటర్‌ను వాడుతారు. గోర్లు కట్ చేసుకుంటే అవి గాల్లోకి లేస్తాయిగా, వెంటనే వాటిని పట్టుకుని ప్రత్యేకమైన ఎయిర్ వెంట్లో పెట్టేస్తారు. దీంతో అవి మళ్లీ బయటికి రావు. ఇబ్బందులను కలిగించవు.