ఒక‌ప్పుడు రోజుకు 7 రూపాయ‌ల కూలీ…ఇప్పుడు అంత‌ర్జాతీయ క్రికెట‌ర్.!

భార‌త మాజీ క్రికెట్ ఆట‌గాడు మునాఫ్ ప‌టేల్ గురించి చాలా మందికి తెలుసు. ముఖ్యంగా 2011 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల‌ను చూసిన వారికి మునాఫ్ ప‌టేల్ ఎప్ప‌టికీ గుర్తుంటాడు. అత‌ను ఆ టోర్న‌మెంట్‌లో కీల‌క‌పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో స‌త్తా చాటాడు. దీంతో భార‌త్‌కు వ‌ర‌ల్డ్ క‌ప్ ల‌భించింది. అయితే కొన్నేళ్ల కింద‌ట మునాఫ్ గాయం కార‌ణంగా జ‌ట్టు నుంచి దూర‌మయ్యాడు. గాయం తీవ్రత ఎక్కువ ఉండ‌డంతో దాన్నుంచి కోలుకోలేక క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అయితే క్రికెట్ నుంచి రిటైర్ అయినా మునాఫ్ మాత్రం ఇంకా ఆ క్రీడ‌కు ద‌గ్గ‌ర‌గానే ఉన్నాడు. ఎలాగో తెలుసా..? త‌న సొంత గ్రామంలో ఉన్న యువ‌కుల‌కు క్రికెట్ ప‌రంగా మెళ‌కువల‌ను నేర్ప‌డ‌మే కాదు, వారు జాతీయ జ‌ట్టులో ఆడేందుకు కావ‌ల్సిన ఆర్థిక స‌హ‌కారాన్ని సొంతంగా మునాఫ్ అందిస్తున్నాడు.

మునాఫ్ ప‌టేల్‌ది గుజ‌రాత్ రాష్ట్రంలోని ఐఖార్ అనే పేరున్న‌ ఓ మారుమూల గ్రామం. అక్క‌డే అత‌ను పుట్టి పెరిగాడు. అత‌ని తండ్రి ఓ దిన‌స‌రి కూలీ. అప్ప‌ట్లో రోజుకు రూ.7 అత‌ని సంపాద‌న. దీంతో కుటుంబం గ‌డ‌వడ‌మే అంతంత మాత్రంగా ఉండేది. ఈ క్ర‌మంలో మునాఫ్ కూడా కూలి ప‌నికి వెళ్ల‌క త‌ప్ప‌లేదు. అప్ప‌ట్లో రోజుకు అత‌ను రూ.35 సంపాదించేవాడు. స్థానికంగా ఉన్న ఫ్యాక్ట‌రీలో ప‌నిచేసేవాడు. అయితే మునాఫ్ ప‌టేల్‌కు యూసుఫ్ అనే స్నేహితుడు ఉండేవాడు. అత‌నే మునాఫ్‌ను క్రికెట్ ఆడ‌మని ప్రోత్స‌హించేవాడు. అత‌ను మునాఫ్‌కు ఆర్థిక స‌హాయం కూడా చేసేవాడు.

అలా మునాఫ్ ప‌టేల్ త‌న ఫ్రెండ్ యూసుఫ్ ద్వారా క్రికెట్‌లో శిక్ష‌ణ తీసుకుని గొప్ప బౌల‌ర్ అయ్యాడు. అంత‌ర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. అయితే మునాఫ్ అంత‌టి స్టార్ ఆట‌గాడు అయినా ఇప్ప‌టికీ త‌న సొంత గ్రామంలోనే ఉంటున్నాడు. పైగా స్థానికంగా ఉన్న ఔత్సాహిక యువ‌కుల‌కు క్రికెట్ దిశ‌గా స‌హాయం కూడా చేస్తున్నాడు. వారికి అవ‌స‌ర‌మైన కిట్లు, క్రీడా సామ‌గ్రిని సొంత ఖ‌ర్చుతో అంద‌జేయ‌డ‌మే కాదు, వారికి క్రికెట్‌లో మెళ‌కువ‌ల‌ను కూడా నేర్పుతున్నాడు. అదీ మునాఫ్‌లో ఉన్న గొప్ప‌త‌నానికి నిద‌ర్శ‌నం. ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండ‌డ‌మంటే ఇదే క‌దా..!

Comments

comments

Share this post

scroll to top