ఎస్‌బీఐ బ్యాంక్ ఖాతాదారులారా..? జాగ్ర‌త్త‌..! ఇలాంటి మెయిల్స్ వ‌స్తే అస్స‌లు స్పందించ‌కండి..!

ఈ నెల 1వ తేదీ నుంచి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన అనుబంధ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైద‌రాబాద్‌, ట్రావెన్‌కోర్‌… తదిత‌ర ఐదారు బ్యాంకులు అన్నీ ఎస్‌బీఐ లో విలీనం అయ్యాయి క‌దా. ఈ క్ర‌మంలో ఇప్పుడు ఆ బ్యాంకులు అన్నీ ఎస్‌బీఐ కిందే ప‌నిచేయ‌నున్నాయి. ఆ బ్యాంకుల్లో ఉండే ఖాతాదారులంద‌రూ ఎస్‌బీఐ ఖాతాదారుల్లానే ప‌రిగ‌ణింప‌బ‌డుతున్నారు. అయితే ఇదే అద‌నుగా చేసుకుని కొంద‌రు కేటుగాళ్లు సైబ‌ర్ నేరాల‌కు పాల్ప‌డుతున్నారు. అవును, మేం చెబుతోంది నిజ‌మే. హైద‌రాబాద్‌కు చెందిన సైబ‌ర్ క్రైం పోలీసులు ఈ వివ‌రాల‌ను తాజాగా వెల్లడించారు.

onlinesbi.me. అవును, ఇది ఎస్‌బీఐ బ్యాంకు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ సైట్ క‌దా. అని అనుకుంటున్నారా..? అయితే మీరు ప‌ప్పులో కాలేసిన‌ట్టే. ఎందుకంటే ఇది అస‌లు వెబ్‌సైట్ కాదు. న‌కిలీది. అస‌లు వెబ్‌సైట్ ఇలా ఉంటుంది. https://www.onlinesbi.com/. చూశారుగా. ముందు చెప్పిన న‌కిలీ సైట్‌కు, దీనికి ఎంత చిన్న తేడా ఉందో. దాన్నే కొంద‌రు దుండ‌గులు ఆస‌రాగా తీసుకున్నారు. ఈ క్ర‌మంలోనే వారు ఎస్‌బీఐ ఖాతాదారుల మెయిల్స్ సేక‌రించి వారికి బ్యాంకు వారు పంపిన‌ట్టుగా న‌కిలీ ఈ-మెయిల్స్ పంపుతున్నారు. వాటిల్లో ఏముంటుందంటే… మేం ఎస్‌బీఐ బ్యాంకు వాళ్లం. మీ అకౌంట్ వివ‌రాల‌ను అప్‌డేట్ చేస్తున్నాం. కొత్త‌గా ఇత‌ర ఎస్‌బీఐ అనుబంధ బ్యాంకులు ఎస్‌బీఐ లో విలీన‌మ‌య్యాయి. కనుక మీ వివ‌రాల‌ను అప్‌డేట్ చేసుకోవాలి… అని చెప్పి ఆ ఈ-మెయిల్స్‌లో లింక్‌లు పంపుతున్నారు.

ఈ క్ర‌మంలో ఆ లింక్‌ల‌ను యూజ‌ర్లు ఒక వేళ తెలియ‌క క్లిక్ చేసి అందులో వివ‌రాల‌ను నింపితే ఆ త‌రువాత ఇక అంతే సంగ‌తులు. కేటుగాళ్లు పెద్ద ఎత్తున డ‌బ్బును డ్రా చేసుకుంటారు. ఆ త‌రువాత బాధ ప‌డీ ప్ర‌యోజనం ఉండ‌దు. ఇంత‌కీ ఆ మెయిల్స్ పంపిన వారి ఈ-మెయిల్ ఐడీ ఎలా ఉంటుందంటే… customercare@onlinesbi.me అని ఉంటుంది. దీన్ని చూస్తే నిజంగానే ఎస్‌బీఐ మెయిల్ పంపిందేమేన‌ని భ్ర‌మ ప‌డేట్టుగా ఉంది క‌దా. అవును. అందుకే జాగ్ర‌త్త‌. ఇలాంటి మెయిల్స్ పట్ల అప్ర‌మ‌త్తంగా ఉండండి. ఎందుకంటే ఏ బ్యాంకు అయినా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు ఈ-మెయిల్ కాదు క‌దా, బ్యాంకు వివరాల కోసం క‌నీసం ఫోన్ కూడా చేయ‌దు. అది గుర్తు పెట్టుకుంటే చాలు. ఇలాంటి కేటుగాళ్ల బారి నుంచి త‌ప్పించుకోవ‌చ్చు.

Comments

comments

Share this post

scroll to top