వేసవి వచ్చేసింది. మరికొన్ని రోజులు అయితే దాదాపుగా అందరు విద్యార్థులకు కాలేజీలు ముగుస్తాయి. దీంతో వేసవి సెలవులను ఎప్పుడెప్పుడు ఎంజాయ్ చేద్దామా అని అందరు విద్యార్థులు ఇప్పటికే ఆలోచించడం మొదలుపెట్టారు. అయితే ఒకప్పుడు ఇలా చేస్తే నడిచిందేమో గానీ, ఇప్పుడు మాత్రం అలా కాదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నది పోటీ ప్రపంచం. సెలవులను ఎంజాయ్ చేయడం మాని కెరీర్‌పై దృష్టి సారిస్తే కాలేజ్ ముగియగానే మంచి కంపెనీలో ఉద్యోగం సాధించేందుకు వీలు కలుగుతుంది. మరి అందుకు ఏం చేయాలో తెలుసా..? ఇంటర్న్‌షిప్.. అవును, అదే.. ఇది కేవలం మెడికల్, ఇంజినీరింగ్ చదివే వారికేననుకుంటే పొరపాటు పడినట్టే. ఇతర డిగ్రీ కోర్సులు చదివే వారు కూడా చేయవచ్చు. ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల కాలేజీ పూర్తయ్యాక ఉద్యోగం చేసేందుకు అనుకూలమైన స్కిల్స్ వస్తాయి. దీంతో కోరుకున్న కంపెనీలో చక్కని శాలరీ ప్యాకేజీకి ఉద్యోగం లభిస్తుంది.
ఇంటర్న్‌షిప్ అనేది విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఏఐసీటీఈ కూడా ఇంటర్న్‌షిప్ చేయాలనే ఓ నిబంధనను తాజాగా అమలులోకి తెచ్చింది. ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల విద్యార్థులకు మేలే జరుగుతుంది. కంపెనీల్లో ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు అలవడుతాయి. సాధారణంగా మన స్కూల్స్, కాలేజీల్లో విద్యాబోధన మొత్తం సబ్జెక్టును నేర్చుకునే అంశంపైనే ఆధార పడి ఉంటుంది. అంతే కానీ బయటి ప్రపంచంలో ఉద్యోగం ఎలా సాధించాలి అనే దానిపై విద్యాబోధన సాగడం లేదు. దీంతో కాలేజీ పూర్తి చేసి బయటకు వచ్చే విద్యార్థులకు సబ్జెక్ట్ అయితే తెలిసి ఉంటుంది, కానీ ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలను ఎలా సాధించాలి, తద్వారా ఉద్యోగం ఎలా సాధించాలి అని తెలియడం లేదు. అందుకే చాలా మంది నిరుద్యోగులుగా ఉంటున్నారు. ఇక కొందరు ఏదో ఒక ఉద్యోగంలే అని సరిపెట్టుకుంటున్నారు. కానీ అలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా ఉండాలంటే.. కచ్చితంగా ఏ విద్యార్థి అయినా ఇంటర్న్‌షిప్ చేయాలి.
ఇంటర్న్‌షిప్ చేసే విషయానికి వస్తే గ్రాడ్యుయేషన్ (ఇంజనీరింగ్ లేదా సాధారణ డిగ్రీ) పూర్తి చేసినవాళ్లకు ఎన్నో ఇంటర్న్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. internshala.com, hellointern.com, twenty19.com వంటి ఎన్నో వెబ్సైట్లు వివిధ కంపెనీలు, సంస్థలు అందించే ఇంటర్న్‌షిప్‌ల వివరాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నాయి. వీటితోపాటు ఆయా కంపెనీల వెబ్సైట్లలో కూడా ఆ సమాచారం అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇక ఇంటర్న్‌షిప్ ను ఎలా చేయాలి ? ఏ కంపెనీ అయితే బాగుంటుంది ? అన్న వివరాలను ఇలా తెలుసుకోవాలి. మీరు ఏం చదువుతున్నారు? ఏ రంగంలో లేదా ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటున్నారు? మీ వద్ద ఎంత సమయం అందుబాటులో ఉంది? ఇంటర్న్‌షిప్ కోసం వెళ్లే సంస్థలో రోజూ ఎంతసేపు గడపాల్సి ఉంటుంది? వంటి అంశాలపై పూర్తిగా అధ్యయనం చేయాలి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.
ఇక ఇంటర్న్‌షిప్ చేయాలనుకున్న కంపెనీ ప్రొఫైల్ ను కూడా చూడాలి. కంపెనీ ప్రొఫైల్ బాగా లేకపోతే మీరు చేసే ఇంటర్న్‌షిప్‌తో మీకు పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. గతంలో ఎవరైనా అక్కడ ఇంటర్న్‌షిప్ చేశారేమో పరిశీలించండి. ఈ మధ్య చాలామంది ఆన్లైన్లో రివ్యూలు రాస్తున్నారు. వాటిని విశ్లేషించాలి. వారి అనుభవాలను తెలుసుకోవాలి. దీంతో ఆయా కంపెనీలపై ఒక అవగాహన వస్తుంది. ఏ కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తే బాగుంటుంది అనే విషయంపై స్పష్టత వస్తుంది. తద్వారా కంపెనీ ఎంపిక, ఇంటర్న్‌షిప్ చేయడం సులభతరమవుతుంది. ఇక ఇంటర్న్‌షిప్ కోసం కంపెనీని సెలెక్ట్ చేసుకున్నాక మీరు చేసిన లేదా నేర్చుకున్న పనికి సంబంధించి ఏమైనా అస్సెస్మెంట్ ఉంటుందా, గ్రేడింగ్ లేదా సర్టిఫికెట్ ఇస్తారా వంటి అంశాలను కూడా గమనించాలి. ఇలాంటి సర్టిఫికెట్లతో ఉద్యోగవేట కొద్దిగా సులభతరమవుతుంది. ఇవి సాధారణ అభ్యర్థులకు మీకు మధ్య ఉన్న పోటీలో మిమ్మల్ని ఒక మెట్టు పైన నిలబెడతాయనడంలో సందేహం లేదు. ఇలా మీరు ఎంపిక చేసుకున్న కంపెనీలో ఇంటర్న్‌షిప్ చేస్తే అక్కడ వచ్చే సర్టిఫికెట్, అందులో లభించే నైపుణ్యాలు మీకు మంచి ఉద్యోగాన్ని తెచ్చి పెడతాయి. కోరుకున్న జాబ్‌ను సాధించేందుకు అవకాశం ఉంటుంది. కనుక ఏ గ్రాడ్యుయేట్ విద్యార్థికైనా ఇంటర్న్‌షిప్ అవసరం అన్న విషయాన్ని మాత్రం మరిచిపోకండి.