చీమ‌లు నిద్ర‌పోతాయా..? వాటికి నిద్ర వ‌స్తుందా..? నిద్ర వ‌స్తే ఎలా నిద్రిస్తాయి..? తెలుసా..?

చీమ‌లు… త‌మ శ‌రీర బ‌రువు క‌న్నా 50 రెట్ల ఎక్కువ బ‌రువును మోయ‌గ‌ల‌వు. ప్ర‌పంచంలో అలా బ‌రువును మోసే ఏకైక ప్రాణి దాదాపుగా చీమ‌నే అని చెప్ప‌వచ్చు. క‌ష్టించి ప‌నిచేసే గుణానికి వాటిని ఆద‌ర్శంగా తీసుకోమ‌ని మ‌న‌కు పెద్ద‌లు చెబుతుంటారు. అయితే నిజంగా చీమ‌లు క‌ష్ట‌ప‌డే జీవులే. అవి రాత్రి, ప‌గ‌లు అని తేడా లేకుండా ఎప్పుడు చూసినా లైన్లలో వెళుతూ ఏదో ఒక ప‌దార్థాన్ని మోసుకెళ్తూనే ఉంటాయి. మ‌రి అవి విశ్రాంతి తీసుకోవా..? వాటికి అలుపు రాదా..? అస‌ల‌వి నిద్రిస్తాయా..? అవి కూడా స‌గటు ప్రాణులే క‌దా. మ‌రి వాటికి నిద్ర రాదా..? వ‌స్తే ఎప్పుడు వ‌స్తుంది..? అవి ఎంత సేపు నిద్ర‌పోతాయి..? అంటే.. అవును, అవి విశ్రాంతి తీసుకుంటాయి. నిద్ర‌పోతాయి. అయితే అన్ని చీమ‌లు ఒకే రకంగా నిద్రించ‌వు. ఒకేసారి ప‌డుకోవు. అవును, మేం చెబుతోంది నిజ‌మే..! యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన ప‌లువురు పరిశోధ‌కులు చీమ‌ల నిద్ర‌పై ప‌రిశోధ‌న‌లు చేశారు. దీంతో ప‌లు ఆసక్తిక‌ర విష‌యాలు తెలిశాయి. అవేమిటంటే…

యూనివ‌ర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడా సైంటిస్టులు ఒక ల్యాబ్‌లో చీమ‌లు నివాసం ఉండే ఓ ప్ర‌త్యేకమైన కాల‌నీని ఏర్పాటు చేశారు. అందులో 30 వ‌ర‌కు సాధార‌ణ (కూలి) చీమ‌ల‌ను పెట్టారు. 3 రాణి చీమ‌ల‌ను పెట్టారు. ఈ క్ర‌మంలో వారు ఆ చీమ‌ల‌కు రాత్రి, ప‌గ‌లు తేడా తెలిసేలా వెలుతురు కోసం ప్ర‌త్యేక ఏర్పాటు కూడా చేశారు. అనంత‌రం కొన్ని రోజుల పాటు ఆ చీమ‌ల‌ను ప‌రిశీలించారు. దీంతో వారికి తెలిసిందేమిటంటే… చీమ‌లు నిద్రిస్తాయి. అయితే కూలి చీమ‌లు, రాణి చీమ‌లు నిద్రించే స‌మయం వేరుగా ఉంటుంది.

కూలి చీమ‌లు రోజుకు దాదాపుగా 250 సార్లు నిద్రిస్తాయి. ప‌డుకున్న‌ప్పుడ‌ల్లా 72 సెకండ్ల‌కు మించి నిద్ర‌పోవు. అలా 250 x 72 = 18000 సెక‌న్ల పాటు రోజూ ప‌డుకుంటాయి. అంటే అవి రోజుకు 5 గంట‌ల పాటు నిద్రిస్తాయ‌న్న‌మాట‌. అంత త‌క్కువ వ్య‌వ‌ధిలోనే అవి ప‌డుకుంటాయి. ఇక మిగిలిన స‌మ‌యమంతా ప‌నిచేస్తూనే ఉంటాయి. ఆహార ప‌దార్థాల‌ను కాల‌నీకి తేవ‌డం, ర‌క్ష‌ణ క‌ల్పించ‌డం వంటి ప‌నులు చేస్తాయి. దీంతో అవి చాలా త‌క్కువ రోజులు జీవిస్తాయి. కేవ‌లం 1 ఏడాది వ‌ర‌కు మాత్ర‌మే అవి జీవిస్తాయ‌ట‌. ఇక రాణి చీమ‌లు రోజుకు 90 సార్లు నిద్రిస్తాయి. ఒక్కోసారి 6 నిమిషాల క‌న్నా ఎక్కువ స‌మ‌యం ప‌డుకోవు. అలా అవి 90 x 6 = 540 నిమిషాలు రోజుకు నిద్రిస్తాయి. అంటే అవి రోజుకు 9 గంట‌లు ప‌డుకుంటాయ‌న్న‌మాట‌. దీంతో వాటి జీవిత కాలం ఎక్కువ‌గా ఉంటుంది. ఇవి 6 ఏళ్ల వ‌ర‌కు జీవిస్తాయ‌ట‌. అయితే కొన్ని ప్ర‌త్యేక‌మైన ఫైర్ యాంట్ అని పిల‌వ‌బ‌డే రాణి చీమ‌లు 45 ఏళ్ల వ‌ర‌కు బ‌తికి ఉంటాయ‌ట‌. ఇవి అస్స‌లు ప‌నిచేయ‌వ‌ట‌. కేవ‌లం కాల‌నీని కాపు కాసి ర‌క్ష‌ణ‌గా ఉంటాయ‌ట‌. అంతే..! ఇవీ… చీమ‌ల నిద్ర వెనుక ఉన్న అస‌లు విష‌యాలు..!

Comments

comments

Share this post

scroll to top